జనసేనాని పవన్‌కల్యాణ్ తమను కాదని టీడీపీతో చెట్టపట్టాలేసుకుని తిరుగుతుండడంపై బీజేపీ గుర్రుగా ఉంది. అదును చూసి పవన్‌ను దెబ్బ కొట్టడానికి ఏపీ బీజేపీ ఏ మాత్రం వెనుకాడడం లేదు. పవన్‌కు తమ నిరసనను పరోక్షంగా తెలియజేయడానికి ప్రధాని మోదీ ఏపీ పర్యటనను బీజేపీ అవకాశం తీసుకుంటోంది.
బీజేపీకి జనసేనాని మిత్రపక్షం కావడంతో, ప్రధాని మోదీని పవన్ కలవడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇదే విషయమై ఏపీ బీజేపీ నేతల్ని మీడియా ప్రతినిధులు నొక్కినొక్కి ప్రశ్నిస్తున్నారు. కానీ ఏపీ బీజేపీ నేతలు సమాధానం చెప్పకుండా దాటవేత ధోరణి ప్రదర్శిస్తూ వచ్చారు. ఇవాళ మాత్రం బీజేపీ వ్యూహం మార్చింది. పవన్‌కల్యాణ్‌ను ఆహ్వానించడంపై ఏపీ బీజేపీ నేతలు కుండబద్ధలు కొట్టినట్టు చెప్పడం గమనార్హం.
విశాఖలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు బుధవారం మీడియాతో మాట్లాడుతూ పవన్‌ను ప్రధాని మోదీ పర్యటనకు ఆహ్వానించడంపై స్పష్టత ఇచ్చారు. విశాఖలో ప్రధాని అధికారిక కార్యక్రమాలకు హాజరవుతున్నారని స్పష్టత ఇచ్చారు. కావున పవన్‌ను ఆహ్వానించే విషయమై పీఎంవో (ప్రధాన మంత్రి కార్యాలయం) చూసుకుంటుందని చెప్పి, చేతులు దులుపుకున్నారు. అంటే బంతిని పీఎంఓ కోర్టులోకి చాలా తెలివిగా ఏపీ బీజేపీ నేతలు నెట్టారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తమను కాదని సొంత ఎజెండాతో రాజకీయాలు చేస్తున్న పవన్‌కు దూరంగా ఉండడమే మేలనే అభిప్రాయంలో ఏపీ బీజేపీ నేతలున్నారు. అందుకే విశాఖ పర్యటనను చిన్నచిన్న రాజకీయ కోణాల్లో చూడొద్దని జీవీఎల్ చెప్పారని అంటున్నారు. పవన్‌కల్యాణ్‌ను దృష్టిలో పెట్టుకునే ఈ మాట అన్నారనేది బహిరంగ రహస్యమే. పవన్ గురించి పట్టించుకునే మరీ పెద్ద నాయకుడిని చేయడం ఇష్టం లేకే ఏపీ బీజేపీ నేతలు ప్రధాని పర్యటనలో ఆయన ఊసే లేకుండా చూసుకుంటున్నారనేది పచ్చి నిజం.