తెలంగాణలో సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఒకరిపై మరొకరు పైచేయి సాధించే క్రమంలో వ్యవస్థల మధ్య సుహృద్భావ వాతావరణం దెబ్బతింటోంది. ఈ నేపథ్యంలో ఇవాళ సాయంత్రం గవర్నర్ తమిళిసై రాజ్‌భవన్‌లో ప్రెస్‌మీట్ పెట్టనుండడంపై ఆసక్తి నెలకుంది. ఢిల్లీ పర్యటన ముగించుకుని వచ్చిన వెంటనే గవర్నర్ ఏం చెప్పదలుచుకున్నారో అనే చర్చ జరుగుతోంది.
తాజాగా యూనివర్సిటీల చట్ట సవరణ బిల్లు విషయంలో కేసీఆర్ సర్కార్‌తో గవర్నర్ ఢీకొంటున్నారు. బిల్లుపై చర్చించేందుకు తన వద్దకు విద్యాశాఖ మంత్రిని తన వద్దకు పంపాలంటూ ప్రభుత్వానికి లేఖ రాసినట్టు గవర్నర్ చెబుతున్నారు. అయితే అలాంటి లేఖ ఏదీ తమకు రాలేదని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి కామన్ రిక్రూట్మెంట్ బోర్డును ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇదే వివాదానికి దారి తీసింది.
విశ్వవిద్యాలయాల చాన్స్‌లర్‌గా గవర్నర్‌గా వ్యవహరిస్తున్నారు. అలాంటిది తన అధికారాలను ప్రభుత్వం లాక్కోవడం ఏంటని తమిళిసై నిలదీస్తున్నారు. యూనివర్సిటీల చట్ట సవరణ బిల్లును శాసనసభ సెప్టెంబర్ 12న ఆమోదించింది. ఈ బిల్లును గవర్నర్ ఆమోదిస్తేనే, తదుపరి కార్యకలాపాలు సాగుతాయి. గవర్నర్ ఆమోదించకపోవడంతో పీటముడి పడింది.
బిల్లుపై తన సందేహాలు తీర్చాలని గవర్నర్ మెలిక పెట్టారు. అలాగే రాజకీయంగా కూడా గవర్నర్‌ను బీజేపీ ప్రతినిధిగా కేసీఆర్ సర్కార్ చూస్తోంది. గవర్నర్ కూడా రాజకీయ విమర్శలు, కామెంట్స్ చేస్తూ, ప్రభుత్వంపై కవ్వింపు చర్యలకు దిగారు. ఈ నేపథ్యంలో ఆమె ఢిల్లీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.
తెలంగాణలో ప్రతిపక్ష పార్టీల నేతలతో పాటు తన ఫోన్లు కూడా ట్యాపింగ్‌కు గురవుతున్నట్టు కేంద్రానికి గవర్నర్ ఫిర్యాదు చేసినట్టు వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో గవర్నర్ ఇవాళ్టి సాయంత్రం నిర్వహించే ప్రెస్మీట్లో ఎలాంటి సంచలన వ్యాఖ్యలు చేస్తారో అనే చర్చకు తెరలేచింది.