సాధారణంగా రాజకీయ పార్టీలన్నీ అటూ ఇటుగా పీతల బుట్టల్లాగే ఉంటాయి. పీతల బుట్టల సంగతి తెలిసిందే కదా. ఏదైనా ఒక పీత బుట్ట నుంచి తప్పించుకొని బయటకు రావాలని ప్రయత్నిస్తే మిగతా పీతలు దాన్ని బయటకు పోనివ్వకుండా గుంజి బుట్టలో కుదేస్తాయి. రాజకీయ పార్టీల్లోనూ ఇంతే. ఎదగాలనే నాయకులను ఎదగనివ్వకుండా చేస్తారు. ఒకరు ఎదిగితే మరొకరు సహించలేరు. జెలసీ ఎక్కువగా ఉంటుంది. ఈ పీతల కల్చర్ కాంగ్రెసు పార్టీలో ఎక్కువగా కనబడుతుంది. సామర్థ్యమున్నవారు ఎదుగుదామనుకున్నా కూడా మిగతా నాయకులు అడ్డుపడుతుంటారు.
ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెసుకు వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న రేవంత్ రెడ్డి విషయంలో ఇదే జరుగుతోందని చెప్పుకుంటున్నారు. రేవంత్ ఎంత యాక్టివ్‌గా ఉంటాడో అందరికీ తెలిసిందే. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో టీడీపీ కొంతకాలమైనా బతికి ఉన్నదంటే అందుకు రేవంత్ యాక్టివ్‌నెస్, స్పీడు కారణాలుగా చెప్పుకోవచ్చు. అప్పట్లో టీడీపీ నుంచి తెరాస అధినేత కమ్ సీఎం కేసీఆర్‌ను దీటుగా ఎదుర్కొన్న నాయకుడు రేవంత్ రెడ్డి మాత్రమే. చంద్రబాబుపై వ్యతిరేకతతో కాకుండా ఇతరత్రా కారణాలతో కాంగ్రెసులోకి వెళ్లిపోయాడనుకోండి. అది వేరే విషయం.
ఆ పార్టీలోనూ ఆయన స్పీడేమీ తగ్గలేదు. ఇంత స్పీడును కాంగ్రెసు నాయకులు జీర్ణం చేసుకోలేకపోయారు. రేవంత్ తమను మించిపోతాడని భయపడ్డారు. అతను పార్టీలోకి రావడాన్నే కొందరు జీర్ణం చేసుకోలేదనుకోండి. పార్టీని ప్రజల్లోకి తీసుకుపోవాలనే అతని ఆలోచనలకు, ప్రణాళికలకు అడుగడుగునా అడ్డుతగిలారు. కాంగ్రెసు నాయకుల తీరుకు ఓ దశలో రేవంత్ విసిగిపోయాడు. అడ్డంకులను, వ్యతిరేకతనూ అధిగమిస్తూనే పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాడు. పార్టీలో చేరిన కొంతకాలానికే ఈ స్థాయికి రావడంతో తను నెక్స్ట్ గోల్ డిసైడ్ చేసుకున్నాడు.
అదే రాష్ట్ర కాంగ్రెసు అధ్యక్ష పదవి. పార్టీ ఎన్నికల్లో ఓడిపోతే అధ్యక్షులను, కీలక పదవుల్లో ఉన్నవారిని తొలగించి కొత్తవారిని పెట్టడం అధిష్టానానికి అలవాటే కదా. దేశంలో కాంగ్రెసు హవా బలంగా వీచిన కాలంలో ముఖ్యమంత్రులను తరచూ మార్చడం గుర్తుంది కదా. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా చాలాఏళ్లుగా కొనసాగుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డిని మార్చాలని అధిష్టానం ఎప్పటినుంచి ఆలోచిస్తోంది. ఆయన్ని మారుస్తారని చాలాసార్లు వార్తలు వచ్చినప్పటికీ ఏవో కారణాలతో హైకమాండ్ ఆ పని చేయలేదు. ఉత్తమ్‌ను మార్చాలని అనుకోగానే అధ్యక్ష పదవికి నేనంటే నేను అని పోటీపడేవారు అనేకమంది ఉన్నారు.
కాంగ్రెసులో ఇది సాధారణ వ్యవహారమే. పోటీపడేవారు హైకమాండ్‌కు సన్నిహితులైన నాయకుల దగ్గరకు పోయి పైరవీలు చేసుకుంటూ ఉంటారు. పైరవీలు సాగుతుండగానే అధిష్టానం దృష్టిలోనూ కొందరు నాయకులుంటారు. అలా అధిష్టానం దృష్టిలో రేవంత్ కూడా ఉన్నాడు. అంటే పీసీసీ అధ్యక్ష పదవి రేసులో ఉన్నాడన్నమాట. ఈమధ్య ఢిల్లీలో కుటుంబ సమేతంగా సోనియా గాంధీని కలిశాడు. దీంతో అధ్యక్ష పదవి కోసం జోరుగా పైరవీ చేస్తున్నాడని సీనియర్ కాంగ్రెసు నాయకుల్లో గుబులు బయలుదేరింది. ఆ పదవిని హైకమాండ్ రేవంత్‌కు కట్టబెడుతుందేమోనని తీవ్రంగా ఆందోళన చెందారు.
అతన్ని అడ్డుకోవడం ఎలా? అని తీవ్రంగా ఆలోచించిన కొందరు నేతలు రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి ఖుంటియాతో మాట్లాడటమే కాకుండా, ఢిల్లీ వెళ్లి అహ్మద్ పటేల్‌ను కలుసుకున్నారు. రేవంత్‌ను అడ్డుకోవాలంటే అతని 'అసలు జాతకం' ఏమిటో, రాజకీయ మూలాలు ఏమిటో హైకమాండ్‌కు చెప్పాలనుకొని ఆ పనిచేశారు. ఇంతకూ వాళ్లేం చెప్పారు? రేవంత్ రాజకీయ పాఠాలు నేర్చుకున్నది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ)లో. ఆ తరువాత టీడీపీలో చేరి చాలా ఏళ్లు అందులో కీలకపాత్ర పోషించాడు. అతని మూలాలు ఏబీవీపీలో ఉన్నాయి కాబట్టి ఆర్‌ఎస్‌ఎస్‌తో, బీజేపీ నాయకులతో లింకులు ఉన్నాయి.
కాంగ్రెసులో అతను చాలా జూనియర్. సీనియారిటీలో కొమ్ములు తిరిగినోళ్లు పార్టీలో ఉన్నారు. అధ్యక్ష పదవి సీనియర్ నాయకుడికే ఇవ్వాలి. కాదూ కూడదని రేవంత్‌కే కట్టబెడితే మా దారి మేం చూసుకోవడానికి సిద్ధం… ఇదీ అధిష్టానంతో చెప్పినదాని సారాంశం. అధిష్టానం రేవంత్ రెడ్డి పేరును దాదాపుగా ఖరారు చేసే సమయంలో అతని జాతకం ఇదీ అంటూ సీనియర్లు అధిష్టానం ముందుపెట్టారు. ప్రస్తుతానికి ఉత్తమ్‌నే కొనసాగించాలని హైకమాండ్ నిర్ణయించుకుంది. ఇతర పార్టీల నుంచి వచ్చి కాంగ్రెసులో చేరిన అనేకమందిని అందలం ఎక్కించిన సందర్భాలున్నాయి.
రాష్ట్ర అధ్యక్ష పదవికి విజయశాంతి పేరు కూడా అధిష్టానం పరిశీలించింది. ఆమె మూలాలు బీజేపీలో లేవా? ఆమె టీఆర్‌ఎస్ నుంచి రాలేదా? పార్టీకి దూరంగా ఉన్నప్పటికీ ఎన్నికల ప్రచార కమిటీ బాధ్యతలు ఇవ్వలేదా? ఈ కథ చెప్పుకుంటూపోతే చాలా ఉంది మరి.