మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పంచన చేరుతున్నారు. పవన్ పంచన చేరడం ఇది ఆయనకు రెండోసారి. గతంలో ప్రజారాజ్యం పార్టీ తరఫున పనిచేశారు వంగవీటి రాధ. అప్పట్లో పవన్ కళ్యాణ్‌కి అన్నీ తానే అయి వ్యవహరించిన రాధ, ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్‌లో కలిసిపోయాక.. కొన్నాళ్ళు రాజకీయంగా మౌనం దాల్చి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం విదితమే. సరిగ్గా ఎన్నికలకు ముందు వైసీపీని వీడి, తెలుగుదేశం పార్టీలో చేరారు.
వైసీపీలోనే వుండి వుంటే, వంగవీటి రాధాకృష్ణని ఎంపీగా చూసేవాళ్ళమేమో. దురదృష్టం వెంటాడితే ఎవరు మాత్రం ఏం చేస్తారు.? పైగా, వంగవీటి రాధాకృష్ణకి ఇలాంటి చిలిపి పనులు చేయడం అలవాటుగా మారిపోయింది. 'కులం' కార్డు పట్టుకుని తిరగడం తప్ప, ఏనాడూ జనం గురించి ఆలోచించడన్న విమర్శ వంగవీటి రాధాకృష్ణ మీద బలంగా వుంది. తన తండ్రి వంగవీటి మోహనరంగా పేరుని ఇంకా ఏ స్థాయిలో చెడగొట్టాలో రీసెర్చ్ చేస్తున్నట్టున్నారాయన.
ఇక, జనసేనలోకి వంగవీటి రాధ చేరుతున్నారన్న ప్రచారం గత కొద్ది రోజులుగా జరుగుతున్న విషయం విదితమే. 'వద్దు బాబోయ్..' అంటూ ఇప్పటికే కొందరు జనసేన నేతలు, వంగవీటి రాధ రాకపై తమ అభిప్రాయాన్ని అధినేత వద్ద కుండబద్దలుగొట్టేశారు. అయితే, వంగవీటి రాధతో గతంలో వున్న పరిచయాల నేపథ్యంలో ఆయన చేరికపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టమైన వైఖరితో వున్నట్లు తెలుస్తోంది.
తాజాగా వంగవీటి రాధ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని కలిశారు. తూర్పుగోదావరి జిల్లా దిండి రిసార్ట్స్‌లో జనసేన పార్టీ మేధోమధనం జరుగుతోంది. ఈ సందర్భంగా అక్కడికి వెళ్ళిన వంగవీటి రాధ, జనసేన ముఖ్య నేతల్లో ఒకరైన నాదెండ్ల మనోహర్‌తో మంతనాలు జరిపారు. జనసేనలో రాధ చేరడం దాదాపు ఖాయమైపోయింది. మంచి ముహూర్తం చూసుకుని జనసేనలో రాధ చేరబోతున్నారు. ఇకనేం, జనసేన పార్టీని పూర్తిగా ముంచేసేదాకా రాధ నిదరపోరన్నమాట.!