పాపం చిదంబరం.. తీహార్‌ జైలు తప్పలేదంతే.!

ముందస్తు బెయిల్‌ తెచ్చుకుని చాన్నాళ్ళపాటు అరెస్ట్‌ నుంచి తప్పించుకున్న మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత.. ఎట్టకేలకు అడ్డంగా బుక్కయిపోయారు. ఐఎన్‌ఎక్స్‌ మీడియా, ఎయిర్‌సెల్‌ – మ్యాక్సిస్‌.. ఇలా పలు కేసులకు సంబంధించి…

ముందస్తు బెయిల్‌ తెచ్చుకుని చాన్నాళ్ళపాటు అరెస్ట్‌ నుంచి తప్పించుకున్న మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత.. ఎట్టకేలకు అడ్డంగా బుక్కయిపోయారు. ఐఎన్‌ఎక్స్‌ మీడియా, ఎయిర్‌సెల్‌ – మ్యాక్సిస్‌.. ఇలా పలు కేసులకు సంబంధించి చిదంబరం, ఆయన తనయుడు కార్తీ తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం విదితమే. ఇప్పటికే అరెస్టయి, బెయల్‌ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తోన్న చిదంబరం, ఎట్టకేలకు తీహార్‌ జైలు బాటక తప్పలేదు.

సెప్టెంబర్‌ 19 వరకు చిదంబరం తీహార్‌ జైలులోనే వుంటారు. ఓ కేసులో బెయిల్‌ వచ్చినా, మరో కేసులో చిదంబరంకి కష్టాలు తప్పడంలేదు. జైలు బాట పడుతూ కూడా చిదంబరం, 'జైలుకి వెళుతున్నందుకు బాధగా లేదు.. దేశ ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారవడమే బాధాకరం..' అంటూ సెలవిచ్చారు చిదంబరం. ఇలాంటి పరిస్థితుల్లోనూ ఇంత ధైర్యంగా వ్యవహరించడాన్ని ఏమనుకోవాలి.? బహుశా మేకపోతు గాంభీర్యమంటే ఇదేనేమో.!

కేసుల తీవ్రత ఎంత.? వాటి కారణంగా చిదంబరం ఇమేజ్‌ ఏమవుతుంది.? అన్న విషయాల్ని పక్కన పెడితే, చిదంబరం ప్రస్తుత పరిస్థితిపై దేశంలో మెజార్టీ హర్షం వ్యక్తం చేస్తోంది. ఆర్థిక మంత్రిగా వున్నప్పుడు కావొచ్చు, హోంమంత్రిగా వున్నప్పుడు కావొచ్చు.. 'హుందానం' ముసుగులో చిదంబరం ప్రదర్శించిన ఓవరాక్షన్‌ అంతా ఇంతా కాదు. మరీ ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విషయంలో ఆయన వ్యవహరించిన తీరు మరీ దారుణం.

తెలంగాణ వాదులు, సమైక్యవాదులూ చిదంబరం ప్రవర్తనపై మండిపడ్డారు అప్పట్లో. తెలంగాణ పట్ల సానుకూల ప్రకటన చేసిన చిదంబరం.. ఆ వెంటనే, తన ప్రకటనని వెనక్కి తీసుకున్నారు. ఓ సారి విభజన తప్పదని చెప్పిన ఆయనే.. ఇంకోసారి విభజన అంశాన్ని కన్‌ఫ్యూజన్‌లో పడేసేలా స్టేట్‌మెంట్‌ ఇచ్చేవారు. కేంద్ర మంత్రి హోదాలో తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడే క్రమంలో పూర్తిగా హుందాతనం కోల్పోయారాయన. అందుకే, చిదంబరం అరెస్ట్‌ వ్యవహారాన్ని తెలుగు రాష్ట్రాల్లో మెజార్టీ ప్రజలు 'ఎంజాయ్‌' చేస్తున్నారనడం అతిశయోక్తి కాదేమో.

అఫ్‌కోర్స్‌ ఇంతకంటే తీవ్రమైన కేసుల్లో అభియోగాలు ఎదుర్కొన్నవారు, దోషులుగా తేలినవారు.. ఆ తర్వాత తెరవెనుక రాజకీయాలు నడిపి.. ఎంచక్కా బయటకొచ్చేశారనుకోండి.. అది వేరే విషయం. ఏమో, అన్నీ కలిసొస్తే చిదంబరం కూడా బయటకొచ్చి, మళ్ళీ తనదైన దర్పాన్ని ఓవరాక్షన్‌ రూపంలో ప్రదర్శించేస్తారేమో.!