రేవంత్ సోనియా భజన.. పీసీసీ కోసమేనా?

తెలంగాణ సర్కారుపై వీరోచితస్థాయిలో విరుచుకుపడుతూ ఉండే ఫైర్ బ్రాండ్ నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి.. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడుగా నియమితులు కాబోతున్నారా? సకుటుంబ సమేతంగా ఆయన ఢిల్లీ యాత్ర, సోనియాతో ప్రత్యేకభేటీ, ఆమెను…

తెలంగాణ సర్కారుపై వీరోచితస్థాయిలో విరుచుకుపడుతూ ఉండే ఫైర్ బ్రాండ్ నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి.. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడుగా నియమితులు కాబోతున్నారా? సకుటుంబ సమేతంగా ఆయన ఢిల్లీ యాత్ర, సోనియాతో ప్రత్యేకభేటీ, ఆమెను ప్రస్తుతించడం.. ఇవన్నీ కూడా పీసీసీ పీఠం కోసమేనా? అనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. తెలంగాణ పీసీసీ మార్పు అనివార్యంగా, తథ్యంగా కనిపిస్తున్న  ప్రస్తుత తరుణంలో.. ఆ పదవిని ఆశిస్తున్న వారిలో ఆ రేసులో ఆయనే ముందున్నట్లుగా తెలుస్తోంది.

తెలంగాణ పీసీసీ సారథిని మార్చడానికి చాలారోజుల నుంచి ప్రతిపాదనలు, డిమాండ్లు ఉన్నాయి. పీసీసీ సారథి పోస్టులో ప్రస్తుతం ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి అసమర్థుడని, కేవలం ఆయన నిర్వాకాల వల్లనే పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయిందని అప్పట్లోనే అధిష్టానానికి అనేక ఫిర్యాదులు వెళ్లాయి. నిజానికి అసెంబ్లీ ఎన్నికలకు ముందునుంచే ఉత్తమ్ కుమార్ రెడ్డిని మార్చేయాలనే డిమాండ్ బాగా ఊపందుకుంది. అయితే పార్టీ అధిష్టానం వాటిని పట్టించుకోలేదు.

ఎన్నికల తర్వాత ఆ డిమాండ్ మళ్లీ ప్రాణం పోసుకుంది. ఉత్తం అసమర్థుడంటూ అనేకమంది మేడమ్‌కు ఫిర్యాదు చేస్తూ వచ్చారు. కానీ ఆయన సారథ్యంలోనే ఎంపీ ఎన్నికలను కూడా ఎదుర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల నాటికంటె పరిస్థితి మెరుగుపడినా.. తమను మించి భాజపా ఎదగడం వారికి జీర్ణంకాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతానికి పీసీసీ సారథి మార్పు కసరత్తు ఢిల్లీలో జరుగుతోంది. తెలంగాణ కీలకనాయకులందరినీ పిలిపించి.. వారితో మాట్లాడి కొత్త సారథి నియామకం చేస్తారని అనుకుంటున్నారు.

ఒకవైపు పార్టీ సీనియర్ నాయకుడు.. వీహెచ్ మాత్రం.. సారథి ఎంపికలో విధేయతకే పెద్దపీట వేయాలని అంటున్నారు. ఆ మాటకొస్తే.. విధేయత విషయంలో ఆయనను తలదన్నేవారు లేరు. ప్రజల్లో తనకున్న పట్టు సంగతి ఎలా ఉన్నప్పటికీ.. కేవలం సోనియా కుటుంబం పట్ల విధేయత అనే కార్డుతోనే అవిరళంగా రాజ్యసభ ఎంపీ అవుతూ వచ్చిననేత ఆయన. ఆయన డిమాండ్ ఇలా ఉండగా.. పీసీసీ సారథ్యం రేవంత్ చేతుల్లోనే పెడతారనే ప్రచారం బలంగా ఉంది. ఇటీవలి కాలంలో ఆయన కేసీఆర్ సర్కారు మీద విమర్శల దాడిలో డోసేజీ పెంచడానికి కూడా అది ఒక కారణం అని చెబుతున్నారు.

ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, భట్టి విక్రమార్క తదితర ప్రముఖులంతా ఢిల్లీ చేరుకున్నారు. వీరందరితో భేటీలో సారథిని ఎంపికచేయబోతున్నారు. సారథి ఎవరైనా సరే.. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బట్టి వారి మీద బాధ్యత చాలా ఎక్కువగానే ఉంటుంది. పార్టీనుంచి నాయకులు వలసలు వెళ్లిపోకుండా.. ఆపుకోలగడం పెద్ద పని అవుతుంది. మరి అందులో ఎవరు సఫలీకృతులవుతారో చూడాలి.

సాహోపై సీనియర్ జర్నలిస్ట్ ఏమన్నారంటే..?