లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేసేసే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి మనం యాభైవేల కోట్ల రూపాయల నిధులడిగితే.. ముష్టి విదిలించినట్టుగా.. రవ్వంత విదిలిస్తుంటారు. అనాథలా ఏర్పడిన రాష్ట్రానికి కాస్తంత అద్భుతమైన రాజధాని నగరం కట్టుకుంటాం.. అని అడిగితే.. రెండున్నర వేలకోట్లకు మించి.. మీకు పైసా కూడా ఇచ్చేది జరగదు.. అంటూ తెగేసి చెప్పేస్తారు. అలాంటి ప్రభుత్వం.. అవసరం ఏదైనా కావొచ్చు గాక.. ఒకే దానికోసం పదిలక్షల కోట్ల రూపాయలు వెచ్చించడానికి సిద్ధపడుతోంటే.. ముక్కున వేలేసుకుంటాం. అది.. పొరుగుదేశం పాకిస్తాన్ తో ప్రస్తుతం నెలకొని ఉన్న ఉద్రిక్తతల పర్యవసానంగా ఖర్చేనా? అని అనుమానం కలిగితే మరింతగా నివ్వెరపోతాం… కానీ ఇది నిజం.
భారత ప్రధాని నరేంద్రమోడీ ప్రస్తుతం రష్యా పర్యటనలో ఉన్నారు. రష్యా అధ్యక్షుడు ఫుతిన్ ను కలిశారు. సహజంగానే కాశ్మీరు విషయంలో తీసుకున్న నిర్ణయాలను ఫుతిన్ కు వివరించారు. తమ దేశ అంతర్గత వ్యవహారాల్లో పాకిస్తాన్ జోక్యం చేసుకోకూడదన్న తమవాదనకు ఫుతిన్ తరఫు మద్దతును కూడా కూడగట్టారు. ఆ సందర్భంగా భారత్-రష్యా 20వ వార్షిక సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోడీ రష్యా పర్యటనకు సంబంధించి ఇరుదేశాల అధికారులు కొన్ని వివరాలను వెల్లడించారు.
భారత అధికారులు వెల్లడించిన వాటిలో.. భారత్‌లో వచ్చే ఇరవై ఏళ్లలో ఇరవై అణువిద్యుత్ ప్రాజెక్టులు నెలకొల్పడానికి రష్యా సిద్ధంగా ఉన్నదనేది ప్రధాన వార్త. అయితే.. రష్యా అధికారులు వెల్లడించిన వివరాల్లో ఆ దేశంనుంచి 10.45 లక్షల కోట్ల విలువైన ఆయుధాలు, భద్రత సామగ్రిని భారత్ కొనుగోలు చేయనున్నదనేది ప్రధానాంశం. ఆయుధాల కోసం ఇంత భారీ మొత్తం వెచ్చిచండం అంటే కళ్లు బైర్లు కమ్ముతాయి. కాశ్మీర్ నిర్ణయం తర్వాత.. పాకిస్తాన్‌తో మనకు భయావహమైన యుద్ధవాతావరణం ఏర్పడి ఉన్నసంగతి నిజమే.
అందుకోసం పదిన్నర లక్షల కోట్లను ఆయుధాలకోసం వెచ్చిస్తున్నామంటే.. భారత్ వంటి పేద దేశానికి అది ఎంత పెద్దమొత్తమో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. దేశసార్వభౌమత్వ పరిరక్షణ, దేశ సమగ్రత, ఒకేదేశం-ఒకేజెండా వంటి నినాదాలు అన్నీ పౌరులకు చాలా తీయగానే ధ్వనిస్తూ ఉంటాయి. కానీ, అలాంటి నినాదాల ఖరీదు అదనంగా.. పదిన్నర లక్షల కోట్లు అని తెలిసినప్పుడు మాత్రం.. తీపి మధ్యమధ్యలో కాస్తంతా చేదుగా రుచిస్తుంటుంది.