ఏం ఖర్మరా…!

టీడీపీ ఖ‌ర్మ సిద్ధాంతాన్ని న‌మ్ముకుంటోంది. వైసీపీకి వ్య‌తిరేకంగా  ‘ఏం ఖర్మరా’ పేరుతో జ‌నాల్లోకి వెళ్లాల‌ని అనుకుంటున్న‌ట్టు ఎల్లో ప‌త్రిక క‌థ‌నాన్ని రాసింది. టీడీపీ ఖ‌ర్మ ఏంటంటే… కార్య‌క్ర‌మాల పేర్లు అద్భుతంగా వుంటాయి. తీరా ఆచ‌ర‌ణకు…

టీడీపీ ఖ‌ర్మ సిద్ధాంతాన్ని న‌మ్ముకుంటోంది. వైసీపీకి వ్య‌తిరేకంగా  ‘ఏం ఖర్మరా’ పేరుతో జ‌నాల్లోకి వెళ్లాల‌ని అనుకుంటున్న‌ట్టు ఎల్లో ప‌త్రిక క‌థ‌నాన్ని రాసింది. టీడీపీ ఖ‌ర్మ ఏంటంటే… కార్య‌క్ర‌మాల పేర్లు అద్భుతంగా వుంటాయి. తీరా ఆచ‌ర‌ణకు వ‌చ్చే స‌రికి తుస్సుమంటున్నాయి. పేరు గొప్పు, వూరు దిబ్బ అనే సామెత‌ను టీడీపీ కార్య‌క్ర‌మాలు మ‌రిపిస్తున్నాయి. బాదుడే బాదుడంటూ జ‌నంలోకి పెద్ద ఎత్తున వెళ్లాల‌ని ఆ పార్టీ నిర్ణ‌యించింది.

క‌నీసం ఆ పేరుతో రాష్ట్రంలో 25 శాతం కూడా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌లేదు. ఇప్పుడు ఇదే ఖ‌ర్మంరా అంటూ కొత్త నినాదం ఎత్తుకోడానికి ఆ పార్టీ సిద్ధ‌మైంది. జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై వ్య‌తిరేకంగా పోరాడ‌డానికి ఇన్ని ర‌కాల పేర్ల‌తో వెళ్లాల్సిన అవ‌స‌రం లేదు. బాదుడే బాదుడు అంటూ ఎన్నైనా చెప్పొచ్చు. బాదుడే బాదుడు ల‌క్ష్యం నెర‌వేర‌కుండానే మ‌రో పేరుతో జ‌గ‌న్ ప్ర‌భుత్వ వ్య‌తిరేక కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్ట‌డం ఆ పార్టీకే చెల్లింది.

రెండు నెల‌ల పాటు నిత్యం జ‌నంలోనే ఉండేందుకు చంద్ర‌బాబు నిర్ణ‌యించుకున్నార‌ని వార్త‌లొచ్చాయి. తాజాగా ‘ఏం ఖర్మరా’ అంటున్నారు. నిజ‌మే టీడీపీకి ఖ‌ర్మ అనే చెప్పాలి. నాలుగు ద‌శాబ్దాల రాజ‌కీయ చ‌రిత్ర క‌లిగిన పార్టీకి, అంత‌కు పైబ‌డి రాజ‌కీయ అనుభ‌వం క‌లిగిన నాయ‌కుడు సార‌థ్యం వ‌హిస్తున్నా, రోజురోజుకూ బ‌ల‌హీన‌ప‌డుతోంది. జ‌నాన్ని న‌మ్ముకోకుండా, ద‌త్త పుత్రుడిపై ఆధార‌ప‌డ‌డం టీడీపీ ఖ‌ర్మ కాక‌పోతే మ‌రేంటి?

ఎంత‌సేపూ జ‌గ‌న్, ఆయ‌న ప్ర‌భుత్వంపై చిల్ల‌ర విష‌యాల‌తో నెగెటివ్ క్రియేట్ చేయాల‌నే కుయుక్తులే త‌ప్ప‌, జ‌నాద‌ర‌ణ పొంద‌డానికి టీడీపీ చేస్తున్న‌దేంటి? ఉదాహ‌ర‌ణ‌కు చిన్న విష‌యం గురించి మాట్లాడుకుందాం. హైద‌రాబాద్‌లో ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఇంటి వ‌ద్ద ఎవ‌రో మందుబాబులు హ‌డావుడి చేశారు. దాన్ని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై రెక్కీగా చిత్రీక‌రించ‌డం, తద్వారా రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలు పొందాల‌ని అనుకోవ‌డాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? జ‌నాలు మ‌రీ అంత అమాయ‌కంగా క‌నిపిస్తున్నారా?

తెలంగాణ పోలీసులు ఇది రెక్కీ కాద‌ని, మందుబాబుల పోకిరీ చేష్ట అని తేల్చి చెప్పారు. అప్ప‌టికైనా ఆ ఇష్యూని ప‌క్క‌న పెట్టి, జ‌నం స‌మ‌స్య‌ల‌పై దృష్టి సారించి వుంటే గౌర‌వం వుండేది. కానీ జ‌న‌సేన‌తో క‌లిసి టీడీపీ ఓవ‌రాక్ష‌న్ చేసింది. త‌మ చిల్ల‌ర చేష్ట‌ల్ని కొన‌సాగించింది.

ఇప్ప‌టంలో జ‌న‌సేన నాయ‌కుల ఇళ్లు కూల్చార‌ని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తో సినీ ఫ‌క్కీలో న్యూసెన్స్ క్రియేట్ చేయించింది. అలాగే బాదుడే బాదుడే కార్య‌క్ర‌మంలో పాల్గొన్న చంద్ర‌బాబుపై ఎవ‌రో గుల‌క‌రాయి విసిరితే, హ‌త్యాయ‌త్నం చేశారంటూ గ‌గ్గోలు పెట్ట‌డం, గ‌వ‌ర్న‌ర్‌కు ఫిర్యాదు చేయ‌డం… టీడీపీ దృష్టిలో ఎలా వున్నాయో తెలియ‌దు కానీ, జ‌నం దృష్టిలో మాత్రం అభాసుపాలైంది. ఇలాంటి ప్ర‌తిప‌క్ష పార్టీలు ఏపీలో ఉండ‌డం ‘ఏం ఖర్మరా’ అని ప్ర‌తి ఒక్క‌రూ అనుకునేలా టీడీపీ-జ‌న‌సేన కూట‌మి చేస్తోంది. ముందు త‌మ‌లోని లోపాల‌ను స‌వ‌రించుకుని, ఆ త‌ర్వాత ప్ర‌త్య‌ర్థి గురించి ఆలోచిస్తే బాగుంటుంది. సొంతింటిని చ‌క్క‌దిద్దుకోకుండా, ప‌క్కింటి వాళ్ల గురించి విమ‌ర్శిస్తే, జ‌నాద‌ర‌ణ ల‌భించ‌ద‌ని గుర్తిస్తే మంచిది.