పవన్ కల్యాణ్ డిసైడైతే బెటర్!

పవన్ కల్యాణ్ సూపర్ డూపర్ హిట్ చిత్రాల్లో ఒకటైన బద్రిలో ఓ అద్భుతమైన డైలాగ్ ఉంటుంది. ప్రకాష్ రాజ్ వచ్చి.. తన చెల్లెలిని ప్రేమిస్తున్నందుకు వార్నింగ్ ఇచ్చినప్పుడు.. పవన్ కల్యాణ్ అంతకంటె ఎక్కువ ఫోర్స్…

పవన్ కల్యాణ్ సూపర్ డూపర్ హిట్ చిత్రాల్లో ఒకటైన బద్రిలో ఓ అద్భుతమైన డైలాగ్ ఉంటుంది. ప్రకాష్ రాజ్ వచ్చి.. తన చెల్లెలిని ప్రేమిస్తున్నందుకు వార్నింగ్ ఇచ్చినప్పుడు.. పవన్ కల్యాణ్ అంతకంటె ఎక్కువ ఫోర్స్ తో ప్రకాష్ రాజ్ తో చెప్తాడు..‘‘ముందు ఏం చెయ్యాలో డిసైడ్ చేసుకో.. ఎందుకంటే అదే జరుగుద్ది’’ అని! ఇప్పుడు పవన్ అభిమానులకు, జనసైనికులకు అనిపిస్తోంది. వారందరికీ కూడా ఇప్పుడు చాలా బాగా తెలుసు.. ఏం జరుగుతుందో? బిజెపి అనుసరిస్తున్న తీరు చూస్తే ఎవ్వరికైనా తెలిసిపోతుంది.. పవన్ కల్యాణ్ తెగతెంపులు చేసుకోవడానికి వారు సిద్ధంగా ఉన్నారని. పవన్ కల్యాణ్ .. తాను ఏం చేయాలో డిసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.  ఎందుకంటే అదే జరుగుద్ది.

జనసేన- బిజెపి మధ్య స్నేహబంధం ఎంత అసహ్యకరమైన వాతావరణంలో కొనసాగుతూ ఉంటుందో రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. ఈ రెండు పార్టీలు తాము స్నేహితులం.. ఒకే కూటమిలో భాగమైన మిత్రపక్షాలం అని ఎవరికి వారు అనుకుంటూ ఉంటారు తప్ప.. ఉభయులకూ దాని మీద విశ్వాసం లేదు. 

పవన్ కల్యాణ్ ఎంతసేపూ.. నాకు ఢిల్లీలో బిజెపి పెద్దలు చాలా మంచి స్నేహితులు అని చెప్పుకుంటూ ఉంటారు. వాళ్లేమో ఆయనను అంత సీరియస్ గా పట్టించుకుంటున్న దాఖలాలు మాత్రం కనిపించవు. అదే సమయంలో రాష్ట్రంలోని బిజెపి నాయకుల్లో ఏ ఒక్కరితోనూ సఖ్యంగా ఉన్నట్టు కనిపించరు. ఎవ్వరితోనూ కలిసి మెలిసి వ్యూహరచన చేయరు. అసలు తను పొత్తుల్లో ఉన్నది కేంద్ర బిజెపితో మాత్రమే.. రాష్ట్ర బిజెపితో కాదు.. అన్నట్టుగా ఆయన తీరు ఉంటుంది. వారితో కలిసి ఒక్క కార్యక్రమం కూడా నిర్వహించరు. 

బిజెపి పరిస్థితి అంతకంటె ఘోరం. పవన్ ను కూరలో కరివేపాకు కంటె ఘోరంగా చూస్తుంటారు. తిరుపతి ఎంపీ ఉపఎన్నికలో పవన్ కల్యాణ్ పార్టీ ప్రచారాన్ని కూడా అండగా వాడుకోవడానికి ప్రయత్నించినప్పుడుతప్ప.. జనసేనతో బిజెపి సఖ్యంగా మెలిగిన సందర్భాలను వెతకడం చాలా కష్టం. 

కానీ, పవన్ తాను చంద్రబాబు పల్లకీ మోయాలనుకుంటున్న మనోగతాన్ని బయటపెట్టినప్పుడు, జగన్ వ్యతిరేక ఓటు ఒక్కటి కూడా చీలనివ్వననే ఉత్తరకుమార ప్రగల్భాలు పలికినప్పుడు.. దానికి బ్రేకులు వేస్తూ.. బిజెపి నాయకులు మాట్లాడతారు. జనసేన- బిజెపి కలిసే పోటీచేస్తాయి అని సన్నాయి నొక్కులు నొక్కుతారు. కానీ.. ప్రధాని మోడీ సభ జరుగుతూ ఉంటే.. కనీసం పవన్ ను ఆహ్వానించరు. అందుకే, ఏం జరుగుతుందో ప్రజలందరికీ క్లియర్ గా కనిపిస్తోంది.. ముందు ఏం చెయ్యాలో పవన్ కల్యాణ్ డిసైడ్ చేసుకోవడం బెటర్!