బిజెపి అధినాయకత్వంపై కోమటిరెడ్డి గుస్సా!

భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకత్వం మీద మునుగోడు పరాజిత బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు. పార్టీ అధినాయకులు తన ఓటమికి కీలక కారకులయ్యారంటూ ఆయన సన్నిహితుల వద్ద…

భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకత్వం మీద మునుగోడు పరాజిత బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు. పార్టీ అధినాయకులు తన ఓటమికి కీలక కారకులయ్యారంటూ ఆయన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోట్లకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకోవడానికి తాను వెనకాడకపోయినప్పటికీ ప్రచారాన్ని సీరియస్ గా తీసుకోకుండా.. తనను గెలిపించడానికి సహకరించకుండా.. బిజెపిలోని నాయకులే ద్రోహం చేశారనే భావన ఆయనకు ఏర్పడుతోంది! 

ఇందుకు బిజెపి ఢిల్లీ నాయకత్వం మీద ఆయనకు ఎక్కువ ఆగ్రహంగా ఉంది. వారి ద్వారా ఆశించిన ప్రయోజనం కలగలేదనేదే కోపానికి ప్రధాన కారణం అయినప్పటికీ, అందుకు దారి తీసిన కారణాల మీద మాత్రం ఆయనకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. మునుగోడులో ఈ దఫా గెలిస్తే రాష్ట్ర భారతీయ జనతా పార్టీలో తన ప్రాబల్యం అమాంతం పెరుగుతుందని భయపడుతూ ఉండే స్థానిక నాయకులు కొందరు, తనకు చేటు చేయడానికి కుట్ర పన్నారని ఆయన అనుకుంటున్నారు. కేంద్ర నాయకత్వం నుంచి తనకు పూర్తిస్థాయి మద్దతు ప్రోత్సాహం రాకుండా మోకాలడ్డారనేది ఆయన అభిప్రాయంగా ఉంది. కోట్లు కోల్పోయిన తర్వాత, ఓటమిని మూట కట్టుకున్న తర్వాత, ‘‘ఓడితే ఓడాంగానీ పార్టీ బలపడింది’’ అనే పనికిరాని నినాదంతో సమీక్ష సమావేశం పెట్టుకున్నప్పుడు.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కడుపుమండిందని సమాచారం. 

సిటింగ్ ఎమ్మెల్యేగా పదవీ వైభవాన్ని కలిగి ఉన్నప్పటికీ దానిని వదులుకొని మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరారు. తద్వారా వచ్చిన ఉప ఎన్నికను కోట్లకు కోట్ల రూపాయల అనవసరపు వ్యయంతో ఎదుర్కోవడానికి సిద్ధపడ్డారు. ఈ ప్రయత్నం యావత్తూ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రతిష్ట పెంచడానికి ఉపయోగపడుతుందని ఆయన నమ్మారు. ఆయన ద్వారా తమకు ప్రయోజనం కలుగుతుందని భారతీయ జనతా పార్టీ కూడా నమ్మింది. అయితే మునుగోడు ఎన్నికల బరిలో ఆయన వెన్నంటి ఉండి విజయానికి దోహదం చేస్తామని బిజెపి పెద్దలు హామీ ఇచ్చారు. ఆ హామీలను నిలబెట్టుకోలేదు అనేదే ఇప్పుడు కోమటిరెడ్డి విలాపం అంతా కూడా!!

అయినా ఎన్నికలలో దిగకముందు ప్రచారానికి అమిత్ షా నేరుగా వస్తారని.. దానితో నియోజకవర్గ వ్యాప్తంగా తన అభ్యర్థిత్వానికి ఒక ఊపు వస్తుంది అని ఆశించారు. అమిత్ షా పార్టీ చేరిక సందర్భంలోనే వచ్చి వెళ్లారు కనుక మళ్ళీ ఎన్నికల ప్రచారానికి రాకపోవచ్చునని అర్థమైంది. కానీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్వయంగా వచ్చి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని సభలు నిర్వహిస్తారని భావించారు. దానికి సంబంధించి కోట్లాది రూపాయల వ్యయంతో ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. 

సరిగ్గా నడ్డా సభ జరగడానికి ఒకటి రెండు రోజులు ముందుగా, బిజెపి అధినాయకత్వం తన నిర్ణయాన్ని మార్చుకుంది. ఎన్నికల ప్రచారానికి వెళ్లకూడదని నడ్డా డిసైడయ్యారు. అప్పటికే మునుగోడులో పార్టీ ఓడిపోతుందని ఇంటెలిజెన్స్ అంచనాలతో భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం ఒక నిర్ణయానికి వచ్చిందా అని అనుమానం ఇప్పుడు అందరికీ కలుగుతుంది. కానీ ఎన్నికల ప్రచారానికి ఢిల్లీ నాయకత్వం సక్రమంగా రాకపోవడం ద్వారా తనకు పార్టీ చేయవలసిన మేలు చేయలేదని కోమటిరెడ్డి అనుకుంటున్నారు.

నిజం చెప్పాలంటే ఆ విషయంలో ఎలాంటి సందేహం లేదు. పొద్దున లేస్తే పడుకునే వరకు కేసీఆర్ ని తిడుతూనే ఉండే బండి సంజయ్ వంటి వాళ్ళు ఎంతమంది వెళ్లి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నా ప్రజలకు కొత్తగా తెలియదు చెప్పే సంగతులు ఉండవు. అదే కేంద్ర నాయకత్వం నుంచి గాని, కేంద్ర మంత్రులు గాని ఇతర రాష్ట్రాల బీజేపీ ముఖ్యమంత్రి కానీ ఎవరో ఒకరు వచ్చి చురుగ్గా ఎన్నికల ప్రచారంలో పాల్గొని కోమటిరెడ్డి కి మద్దతు ఇచ్చి ఉంటే పరిస్థితి కొంత మెరుగ్గా ఉండేదని ఆయన భావిస్తున్నారు. ఆ రకంగా పార్టీ తనను వంచించిందనే అభిప్రాయం రాజగోపాల్ కు ఏర్పడుతోంది. 

మరి ఈ ద్వంద్వ భావనల నడుమ ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలీదు. పార్టీ మున్ముందు అయినా సరే తనకు కనీస ప్రాధాన్యం ఇస్తుందని నమ్ముతారో లేదా ఓడిపోయిన నేతకింద జమ కట్టి లూప్ లైన్ లో పెడతారని భయపడతారో వేచి చూడాలి!