గ్రహణంలో సెక్స్.. పిచ్చెక్కిస్తున్న యూట్యూబ్

యూట్యూబ్ లో తెలుగు వీడియోస్ ఫాలో అయ్యే జనాలకు ఎవరికైనా ఆ మాధ్యమం ఎంత పిచ్చిగా తయారైందో ఇట్టే తెలిసిపోతుంది. అర్థంపర్థం లేని పిచ్చి కంటెంట్ తో యూట్యూబ్ నిండిపోయింది. సహేతుక సమాచారం కంటే…

యూట్యూబ్ లో తెలుగు వీడియోస్ ఫాలో అయ్యే జనాలకు ఎవరికైనా ఆ మాధ్యమం ఎంత పిచ్చిగా తయారైందో ఇట్టే తెలిసిపోతుంది. అర్థంపర్థం లేని పిచ్చి కంటెంట్ తో యూట్యూబ్ నిండిపోయింది. సహేతుక సమాచారం కంటే చెత్తతో నిండిపోతోంది తెలుగు యూట్యూబ్ కంటెంట్. మరికొన్ని గంటల్లో గ్రహణం రాబోతోంది. దీన్ని బేస్ చేసుకొని యూట్యూబ్ లో అర్థంపర్థం లేని చెత్త పేరుకుపోతోంది.

గ్రహణం సమయంలో చేయకూడని పనులంటూ వందల వీడియోలు యూట్యూబ్ లో ప్రత్యక్షమయ్యాయి. ఇందులో హేతుబద్ధత ఎంతనేది పక్కనపెడితే, చాలామంది వీటిని పాటిస్తుంటారు. అయితే రెగ్యులర్ గా చెప్పే విషయాలే చెబితే వ్యూస్ రావు కదా. సరిగ్గా ఇక్కడే యూట్యూబ్ ఛానెళ్ల పిచ్చి పరాకాష్టకు చేరింది.

గ్రహణ సమయంలో సెక్స్ చేయొచ్చా.. గ్రహణం పడుతున్నప్పుడు శృంగారంలో పాల్గొంటే ఏం జరుగుతుంది లాంటి చెత్త హెడ్డింగులతో ప్రజలను పిచ్చెక్కిస్తున్నాయి యూట్యూబ్ ఛానెళ్లు.

సైన్స్ బాగా అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో సెక్స్ కు, గ్రహణానికి సంబంధం లేదనే విషయం ఇట్టే అర్థమౌతుంది. అయినప్పటికీ ఎవరికి తోచిన పద్ధతులు వాళ్లు ఫాలో అవుతుంటారు. ఎవరి నమ్మకాలు వాళ్లవి. వాళ్ల నమ్మకాలు, అపోహలు అని చెప్పడం ఇక్కడ ఉద్దేశం కాదు. ఎటొచ్చి యూట్యూబ్ వీడియోల్లో మాత్రం గ్రహణ సమయంలో సెక్స్ చేయమని కొందరు చెబుతుంటే, వద్దని మరికొందరు చెబుతున్నారు. ఫలానా రాశుల వాళ్లు మాత్రం శృంగారానికి దూరంగా ఉంటే సరిపోతుందని ఇంకొందరు చెబుతున్నారు.

ఇలా అర్థంపర్థం లేని వీడియోలతో యూట్యూబ్ నిండిపోతోంది. వీటికి వేలల్లో వ్యూస్ రావడం మరీ విచిత్రం.