వైసీపీ జ‌నం…ప్ర‌త్య‌ర్థి పార్టీ షో!

సొమ్మొక‌రిది సోకు మ‌రొక‌రిది అనే సామెత చందాన విశాఖ‌లో బీజేపీ ప్ర‌చార ఆర్భాటం సాగుతోంది. ఈ నెల 11న రాత్రి ప్ర‌ధాని మోదీ విశాఖ చేరుకుంటారు. 12న ఆంధ్రా విశ్వ‌విద్యాల‌యంలో వివిధ ప్రాజెక్టుల‌కు శంకుస్థాప‌న…

సొమ్మొక‌రిది సోకు మ‌రొక‌రిది అనే సామెత చందాన విశాఖ‌లో బీజేపీ ప్ర‌చార ఆర్భాటం సాగుతోంది. ఈ నెల 11న రాత్రి ప్ర‌ధాని మోదీ విశాఖ చేరుకుంటారు. 12న ఆంధ్రా విశ్వ‌విద్యాల‌యంలో వివిధ ప్రాజెక్టుల‌కు శంకుస్థాప‌న చేస్తారు. కొన్నింటిని జాతికి అంకితం చేస్తారు. ఆ త‌ర్వాత బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌సంగిస్తారు.

ఈ కార్య‌క్ర‌మాన్ని కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు క‌లిసి నిర్వ‌హిస్తున్నాయి. అయితే ప్ర‌ధానికి స్వాగ‌తం ప‌లికేందుకు బీజేపీ శ్రేణులు భారీగా త‌ర‌లి రావాల‌ని ఆ పార్టీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు పిలుపు ఇవ్వ‌డం గ‌మ‌నార్హం. త‌మ పార్టీకి ఏపీలో అంత సీన్ లేద‌ని వీర్రాజుకు బాగా తెలుసు. గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో బీజేపీకీ క‌నీసం ఒక శాతం ఓట్లు కూడా రాని సంగ‌తి గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. కానీ ప్ర‌ధాని ఏపీకి వ‌స్తున్న సంద‌ర్భంగా, ఆయ‌న కార్యక్రమం విజ‌య‌వంతం క్రెడిట్ కొట్టేందుకు ఏపీ బీజేపీ త‌పిస్తుండ‌డం న‌వ్వు తెప్పిస్తోంది.

ప్ర‌ధాని ఏపీ ప‌ర్య‌ట‌న స‌క్సెస్ చేసేందుకు వైసీపీ కృషి చేస్తోంది. విశాఖ జిల్లాలోని ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప‌ది వేల మందికి త‌క్కువ కాకుండా కార్య‌క‌ర్త‌ల్ని త‌ర‌లించాల‌ని వైసీపీ పెద్ద‌లు ఆదేశాలు ఇచ్చారు. ఆ ప‌నిలో మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్‌లు ఉన్నారు.

ప్ర‌ధాని విశాఖ‌లో అడుగు పెట్ట‌డం మొద‌లు, బ‌హిరంగ స‌భ ముగిసే వ‌ర‌కూ జ‌నంతో స‌మ‌స్య వుండ‌దు. దీన్ని త‌మ ఖాతాలో వేసుకోవాల‌ని సోము వీర్రాజు, ఎంపీ జీవీఎల్ నర‌సింహారావు త‌పించ‌డం చ‌ర్చ‌కు దారి తీసింది. ప్ర‌ధాని స‌భ‌కు వ‌చ్చిన జ‌నాన్ని త‌మ పార్టీ కార్య‌క‌ర్త‌లుగా వారు చెప్పినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు. జ‌నాన్ని త‌ర‌లించ‌డానికి అధికార పార్టీ నేత‌లు తిప్ప‌లు ప‌డుతుంటే, షో చేయ‌డానికి సూటుబూటు వేసుకుని బీజేపీ నేత‌లు ఇప్ప‌టికే రెడీగా వున్నారు. సొమ్మొక‌రిది, సోకు ఇంకోక‌రిది అంటే ఇదే కాబోలు.