ఈ ‘టెక్నికాలిటీ’ కేసీఆర్ ఎలా మిస్సయ్యారబ్బా?

ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా ఆచితూచి అడుగులు వేస్తుంటారు. అసలే కేంద్రంతో సున్నం పెట్టుకుంటున్నారు గనుక.. ప్రతి విషయంలోనూ ఒకటికి పదిసార్లు క్రాస్ చెక్ చేసుకుని మరీ అడుగులు వేస్తారు. భారాస విషయంలో కూడా అదే…

ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా ఆచితూచి అడుగులు వేస్తుంటారు. అసలే కేంద్రంతో సున్నం పెట్టుకుంటున్నారు గనుక.. ప్రతి విషయంలోనూ ఒకటికి పదిసార్లు క్రాస్ చెక్ చేసుకుని మరీ అడుగులు వేస్తారు. భారాస విషయంలో కూడా అదే జరిగింది. తొలుత కొత్త పార్టీ పెట్టాలని తలపోసినప్పటికీ.. ఆ తర్వాత సాంకేతికంగా అనేక వివరాలను మధించిన తర్వాత.. ఇప్పుడు ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితికి పేరు మారిస్తేనే సరిపోతుందని ఆయన ఒక నిర్ణయానికి వచ్చారు. న్యాయ, రాజ్యాంగ నిపుణులతో కూడా మధించిన తర్వాత.. దానికి సంబంధించిన పేపర్ వర్క్ రెడీ చేయించారు.

విజయదశమినాడు పార్టీని ప్రకటించిన కేసీఆర్.. తనకు విశ్వసనీయులైన మీడియా వారి ద్వారా.. కొన్ని రోజుల వ్యవధిలోనూ.. జాతీయ పార్టీగా అప్రూవల్ వచ్చేస్తుందనే సంకేతాలు ప్రజల్లోకి పంపారు. అయితే ఆయన చాలా కీలకమైన పాయింట్ ను మాత్రం ఎలా మిస్సయ్యారో అర్థం కావడం లేదు.

‘‘పార్టీ పేరు మారుస్తుంటే గనుక.. దానికి సంబంధించి పార్టీ అధికారికంగా ఒక ప్రకటన ఇవ్వాలని, అన్ని పత్రికల్లోనూ దానిని ప్రచురించాలని ఆ తర్వాత అభ్యంతరాలను ఆహ్వానించాలని ఆ తర్వాత మాత్రమే పేరు మార్పు గురించి ప్రకటన ఉంటుందని’’ ఆయన ఎలా మిస్సయ్యారో తెలియదు. మొత్తానికి భారాస అనే జాతీయ రాజకీయ పార్టీ పుట్టడానికి సంబంధించిన అసలైన ప్రక్రియ ఇప్పుడే మొదలైంది. తాజాగా కేసీఆర్ ఈసీ సూచించే నియమనిబంధనల మేరకు ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు. 

విజయదశమి నాడు పార్టీని ప్రకటించిన కేసీఆర్.. మునుగోడు నామినేషన్ల పర్వం ముగిసేలోగానే గుర్తింపు వచ్చేస్తుందని భావించారు. ఆమేరకు మీడియాకు లీకులు కూడా ఇచ్చారు. అయితే.. పార్టీ నాయకులు వెళ్లి ఈ నిర్ణయాన్ని ఈసీకి అందజేసిన తర్వాత.. అసలు నిబంధన వారికి తెలిసి వచ్చింది. పార్టీ బహిరంగ ప్రకటన ఇవ్వాలని ఈసీ సూచించింది.

అయితే.. మునుగోడు ఎన్నికల కారణంగా కేసీఆర్ ఇన్నాళ్లు ఆగారు. ఒకవైపు ఎన్నిక జరుగుతుండగా.. పార్టీ పేరు మార్చినట్లుగా బహిరంగ ప్రకటన ఇస్తే.. ప్రజల్లో చిన్న కన్ఫ్యూజన్, గందరగోళం ఏర్పడుతుందని అనుకున్నారు. అందుకే ఫలితాలు వచ్చేదాకా ఆగి, తాజాగా పత్రికల్లో ప్రకటన ఇచ్చారు. 

పార్టీ కొత్త పేరుమీద ఎవరికైనా అభ్యంతరాలుంటే.. 30 రోజుల్లోగా ఈసీ కార్యదర్శికి తెలియజేయవచ్చు. ఎవ్వరి అభ్యంతరాలు లేకపోతే జాతీయ పార్టీ గుర్తింపును ప్రకటిస్తుంది. ఈ కోణంలో చూసినప్పుడు.. డిసెంబరు 7 దాకా గుర్తింపు వచ్చే ఛాన్సు లేదు. డిసెంబరు 9న ఢిల్లీలో భారీ సభ ప్లాన్ చేస్తున్నారు కేసీఆర్. ఆలోగా గుర్తింపు రాకపోయినట్లయితే.. ఒకటిరెండు రోజులు వాయిదా పడొచ్చు. అయినా బహిరంగ ప్రకటన అనే ఈ టెక్నికల్ విషయాన్ని కేసీఆర్ ముందే ఎలా మిస్సయ్యారో అర్థం కావడం లేదు.