వామపక్ష నాయకులు ఎన్నికల్లో గెలిచినా గెలవకపోయినా.. రాజకీయంగా ఎంతో మేథస్సు కలిగి ఉంటారు. వారి అవగాహన చాలా విస్తృతంగా ఉంటుంది. అలాంటిది.. వర్తమాన తెలంగాణ రాజకీయాలను పరిశీలించినప్పుడు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. వామపక్ష పార్టీలు ఇంత అమాయకంగా వ్యవహరిస్తుంటాయా, కించిత్తు ఆశ ఉన్నప్పుడు అందుతున్న సంకేతాలను పట్టించుకోకుండా అపరిపక్వ వైఖరితో వ్యవహరిస్తాయా అనే అనుమానం ఇప్పుడు కలుగుతోంది.
అభ్యర్థుల మార్పు కోసం నిరీక్షిస్తున్న నాలుగు నియోజకవర్గాలు మినహా, తెలంగాణలోని 115 నియోజకవర్గాలకు కేసీఆర్ తమ భారాస అభ్యర్థుల జాబితాను ప్రకటించేసిన తర్వాత గానీ.. ఇక్కడ ఎర్ర పార్టీలకు స్పష్టత రాలేదు. భారాసతో పొత్తుల కోసం ఇన్నాళ్లు నిరీక్షించిన వాళ్ళు.. ఇక తమ రెండు పార్టీలు కలిసి పోటీ చేయాలని ఇప్పుడు కసరత్తు ప్రారంభిస్తున్నారు. అసలు కెసిఆర్ ను నమ్ముకుని ఇన్నాళ్లు నిరీక్షించడమే వారి ఆపరిపక్వతకు నిదర్శనం అని అందరూ వ్యాఖ్యానిస్తున్నారు.
మునుగోడులో ఉప ఎన్నిక జరిగినప్పుడు భారత రాష్ట్ర సమితి ఎర్రదండు మీద బాగా ఆధారపడింది. వారి మద్దతు తీసుకొని అక్కడ ఎన్నికలలో పోటీ చేసింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రతి చోటా ఎంతో కొంత బలం కలిగి ఉండే వామపక్షాల సహాయం లేకపోతే బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఓడించడం అసాధ్యం అని ఆనాడు కేసీఆర్ భావించారు. వారి మద్దతుతో అనుకున్నట్లుగానే విజయం దక్కింది. వామపక్షాలతో పొత్తు అనేది కేవలం మునుగోడు ఎన్నికలకు పరిమితమైనది కాదని ఆ తర్వాత కూడా కొనసాగుతుందని ఆ రోజున ప్రచార సభలలో అటు కేసీఆర్ గానీ ఇటు వామపక్ష నాయకులు గానీ ప్రకటించారు.
కానీ భారత రాష్ట్ర సమితి జాతీయ పార్టీగా ఆవిర్భవించిన తర్వాత కేసీఆర్ వామపక్షాలను పట్టించుకోవడం మానేశారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ సారధ్యంలోని కుటుంబం కోసం వారు సుముఖంగా ఉండడమే ఆయన వారిని దూరం పెట్టడానికి కారణమైంది. ఈలోగా ఇం.డి.యా. కూటమి ఏర్పడడం అందులో వామపక్షాలు కూడా కీలక భాగస్వాములు కావడం ఆ దూరాన్ని మరింత పెంచింది. అయినా సరే తెలంగాణలోని వామపక్ష నాయకులకు ఆశ చావలేదు.
కేసీఆర్ ఇవ్వాళో రేపో అపాయింట్మెంట్ ఇస్తారని తాము సీట్లు పంచుకోబోతున్నామని వారు పదే పదే చెబుతూ వచ్చారు. అపాయింట్మెంట్ సంగతి ఏమోగానీ అభ్యర్థుల జాబితా వచ్చేసింది. ఒకవేళ వారు కోరుకున్నట్టు జరిగిఉన్నా, అసెంబ్లీ ఎన్నికలలో కలిసి పోటీ చేయగలరు తప్ప.. ఇండియా కూటమిలో భాగం కావడం వలన పార్లమెంటు ఎన్నికల నాటికి భారాసతో వామపక్షాలు కలిసి ఉండవు అన్న విషయం నిజం. అయినా సరే వారు మాత్రం పొత్తులపై ఆశలు పెట్టుకున్నారు.
కేసీఆర్ ఎలాంటి మొహమాటం లేకుండా వారి ఆశలను చిదిమేశారు. ఇప్పుడిక సొంతంగా పోటీ చేయాలనుకుంటున్న వామపక్షాలు కేసీఆర్ ను దెబ్బ కొట్టగలవో, లేదా, వ్యతిరేక ఓటు చీల్చి ఆయనకు మేలు చేస్తాయో వేచిచూడాలి.