వాడిన గులాబీలు అన్నీ కమలం గూటిలోకే!

టికెట్లు నిరాకరింపబడి, అసంతృప్తికి గురై భారత రాష్ట్ర సమితిని వీడాలని అనుకుంటున్న నాయకులకు ఉన్న ప్రత్యామ్నాయం ఏమిటి? భారాసలో ఒకవైపు అసంతృప్తులందరినీ బుజ్జగించే ప్రయత్నం నడుస్తూనే ఉన్నది గానీ.. అందరికీ పట్నం మహేందర్ రెడ్డి…

టికెట్లు నిరాకరింపబడి, అసంతృప్తికి గురై భారత రాష్ట్ర సమితిని వీడాలని అనుకుంటున్న నాయకులకు ఉన్న ప్రత్యామ్నాయం ఏమిటి? భారాసలో ఒకవైపు అసంతృప్తులందరినీ బుజ్జగించే ప్రయత్నం నడుస్తూనే ఉన్నది గానీ.. అందరికీ పట్నం మహేందర్ రెడ్డి లాగా మంత్రి పదవి జాక్ పాట్ దక్కే అవకాశం లేదు! అందుకే, ఇప్పటికే కొందరు తమ తమ దారులు వెతుక్కుంటున్నారు. 

అయితే గులాబీ నాయకులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపే అడుగులేస్తున్నారా అనే అభిప్రాయం పలువురికి కలుగుతోంది. ఇప్పటికే గులాబీ ఎమ్మెల్యే రేఖానాయక్ దంపతులు కాంగ్రెసులో చేరబోతున్నారు. మిగిలిన వారు రాయబారాలు సాగిస్తున్నారు.

తొలి జాబితాను ప్రకటించిన సందర్భంలోనే అసంతృప్త నాయకులు ఎవరు పార్టీని విడిపోవాల్సిన అవసరం లేదని వారందరికీ కూడా పార్టీ మంచి అవకాశాలు కల్పిస్తుందని కేసీఆర్ హామీ ఇచ్చారు. అయితే దానిని ఎందరు పట్టించుకుంటున్నారు అనేది ప్రశ్నార్థకం.

పెద్దపల్లి టికెట్ దాసరి మనోహర్ రెడ్డికి కేటాయించడంతో, ఎంతోకాలంగా పార్టీని నమ్ముకుని ఉన్నప్పటికీ, మంత్రి కేటీఆర్ కు 9 ఏళ్లుగా కీలక అనుచరుడుగా సేవలందిస్తున్నప్పటికీ తనను పట్టించుకోకపోవడం బాధించిందని నల్ల మనోహర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీకి రాజీనామా చేసిన ఆయన ఇండిపెండెంటుగా బరిలో ఉంటానని కూడా హెచ్చరిక జారీ చేశారు.

ఇతర అసంతృప్త నియోజకవర్గాలలో కూడా పరిస్థితి భిన్నంగా ఏమీ లేదు. ఉప్పల్ నియోజకవర్గం నుంచి భేతి సుభాష్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉండగా అక్కడ టికెట్ కు విపరీతమైన పోటీ ఏర్పడింది. ఆశావహుల్లో గతంలో కూడా టికెట్ ఆశించి భంగపడిన బొంతు రామ్మోహన్ కు కేటీఆర్ ఇదివరకే హామీ ఇచ్చారని.. ఎన్నికల ప్రచారం కూడా ప్రారంభించేశారని ఆయన అనుచరులు చెబుతున్నారు. 

ఈలోగా సిట్టింగ్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి- బొంతు రామ్మోహన్ ఇద్దరూ కలిసి కల్వకుంట్ల కవితతో భేటీ కావడం, ‘తమ ఇద్దరిలో ఏ ఒక్కరికి ఇచ్చినా కలిసి పనిచేస్తామని’ ఆమెకు విన్నవించడం జరిగింది. ఇలాంటి విన్నపాలు, హామీలు అన్నీ బుట్ట దాఖలు అయ్యాయనడానికి నిదర్శనంగా ఉప్పల్ టికెట్ బండారి లక్ష్మారెడ్డి కి కేటాయిస్తూ కేసీఆర్ జాబితా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు నాయకులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారుతోంది.

వేములవాడ టికెట్ ఆశించి భంగపడిన చెన్నమనేని రమేష్ కూడా అసంతృప్తితో ఉన్నారు. పౌరసత్వం సమస్య కోర్టులో ఉందని చెబుతున్న ఆయన ‘త్వరలోనే అందరమూ కలిసి ఏదో ఒక నిర్ణయం తీసుకుందాం’ అంటూ అనుచరులకు మెసేజీలు పంపడం గమనార్హం. మిగిలిన వారిలో వేముల వీరేశం కూడా పార్టీ పట్ల అసంతృప్తితో రగిలిపోతున్నట్లుగా సమాచారం.

ఎమ్మెల్యే రేఖా నాయక్ కాంగ్రెసులో చేరడానికి నిర్ణయించుకున్న నేపథ్యంలో మిగిలిన నాయకులు అందరూ కూడా కాంగ్రెస్ వైపే అడుగులు వేసే అవకాశం ఉందని వారి సన్నిహితులు చెబుతున్నారు. ప్రత్యేక సందర్భాలలో ఇండిపెండెంటుగా పోటీ చేసేవారు తప్ప మిగిలిన వారు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. అసంతృప్తితో వాడిపోతున్న గులాబీలను కాంగ్రెస్ పార్టీ ఏ మేరకు తమలో కలుపుకొని లబ్ధి పొందుతుందో వేచి చూడాలి.