హింస ప్రజ్వరిల్లాక యిరుపక్షాల వారు ‘ఎత్తుకుపోయిన’ ఆయుధాలు తిరిగి యివ్వాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. మొహమాటానికి కొన్ని అప్పగించి, అవతలివాళ్లు అన్నీ అప్పగించాకనే, మాకు భద్రత కలిగిందని మేం విశ్వసించినప్పుడే, తక్కినవి తిరిగి యిస్తాం అని యిద్దరూ మొండికేశారు. మైతేయీ, కుకీ యువత కాలేజీలు మానేసి, ఆయుధాల వాడకంలో శిక్షణ పొందుతూ, తమ గ్రామాలను రక్షిస్తున్నారు. మయన్మార్, చైనాల నుంచి దిగుమతి చేసుకున్న అక్రమాయుధాలు మణిపూరులో ఎప్పణ్నుంచో దొరుకుతూంటాయి. ఇప్పుడు వాటి గిరాకీ పెరిగింది. బ్లాక్మార్కెట్లో ఎకె47 ధర రూ.4-5 లక్షలుంటే, యిప్పుడది రూ.7-8 లక్షలైంది. తాజా గణాంకాలను ప్రభుత్వం విడుదల చేస్తే తప్ప ఎవరి వద్ద ఎన్ని ఆయుధాలున్నాయో ప్రస్తుత పరిస్థితి క్లియర్‌గా తెలియదు.
ఈ విషయంలో మైతేయీలు మరీ పట్టుదలగా ఉన్నారు. 2008లో కుకీ మిలిటెంటు గ్రూపులతో చేసుకున్న ఎస్ఓఎస్ త్రైపాక్షిక ఒప్పందాన్ని రద్దు చేసి, వారిని పూర్తిగా నిరాయుధులను చేసిన తర్వాతనే మైతేయీల నుంచి ఆయుధాలు వెనక్కు తీసుకోవాలని ‘‘మణిపూర్ కోఆర్డినేషన్ కమిటీ’’ దిల్లీలో ఒక ప్రదర్శన నిర్వహించింది. వెంటనే ఎన్ఆర్సి (నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్) పని ప్రారంభించాలని కూడా కోరారు. మైతేయీ లీపున్ అనే సంస్థకు అధిపతిగా ఉంటూ మైతేయీ యువతకు ఆయుధాల్లో శిక్షణ యిస్తున్న ప్రమోత్ సింగ్ అనే అతను తీవ్రమైన పదజాలం ఉపయోగిస్తాడు. ‘‘ఇది మణిపూరులో భూమిపుత్రులైన మైతేయీలకు, ఎప్పుడో బ్రిటిషు వారి చేత మయన్మార్ నుంచి తేబడిన కుకీలకు మధ్య సంఘర్షణ’’ అంటాడు. ఈ కుకీలు మయన్మార్‌లో, బంగ్లాదేశ్‌లో, మణిపూరులో ఎక్కడ ఉంటే అక్కడ గొడవలు చేస్తూనే ఉంటారు అని ఆరోపించాడు.
అధికారగణంలో విభజన – ఇక ఘర్షణల విషయానికి వస్తే, కుకీల ప్రాబల్యం ఉన్న జిల్లాలలో మైతేయీల యిళ్లు, కార్లు, గోడౌన్లు తగలబడ్డాయని వినగానే, లోయలో ఉన్న మైతేయీలు కుకీల యిళ్లు, దుకాణాలు తగలబెట్టారు. ప్రభుత్వాఫీసులు అత్యధికంగా లోయలోనే ఉన్నాయి. అక్కడున్న కుకీ ఐఏఎస్‌లు, ఐపిఎస్‌లు కూడా దడిసిపోయి, గువాహతికో, దిల్లీకో పారిపోయారు. డిజిపిగా ఉన్న డౌన్‌గెల్ కుకీ జాతి వాడే. ఆయన వెనక ఉండిపోయాడు కానీ విపరీతమైన భద్రత కల్పించవలసి వచ్చింది. కొంతకాలం కల్పించి, తర్వాత అతన్ని ఒక అప్రధానమైన పోస్టుకి బదిలీ చేసేసింది కేంద్రం. ఆయన తర్వాత సీనియర్‌గా ఉన్న ఆయన తమ్ముడికి కూడా పోస్టు యివ్వకుండా త్రిపుర క్యాడర్ ఐపిఎస్‌ను ఆ స్థానానికి పంపింది.
ఐఏఎస్, ఐపిఎస్‌ల గతే అలా ఉంటే మన పరిస్థితి ఏం కాను అని లోయలోని ప్రభుత్వ ఆఫీసుల్లో కుకీలు, పర్వత ప్రాంతాల్లో మైతేయీలు ఆఫీసులకు వెళ్లడం మానేశారు. వాళ్ల ప్రాణాలకు భద్రత కల్పించలేక పోయినా ప్రభుత్వం ‘నో వర్క్, నో పే, లీవులు గీవులు జాన్తానై. ఆఫీసులకు రావల్సిందే’ అని హుకుం జారీ చేసింది. ప్రభుత్వాఫీసుల్లో అత్యధిక శాతం లోయలోనే ఉన్నాయి కుకీ ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారింది. ప్రభుత్వోద్యోగుల గైర్హాజరీ వలన మే3 తర్వాత ప్రభుత్వ పథకాలన్నీ నిలిచిపోయాయి. పరిస్థితి చక్కదిద్దడానికై ఆగస్టు 17న ప్రభుత్వం 2వేల మంది భయభ్రాంతులైన ప్రభుత్వోద్యోగులను వారు కోరుకున్న జిల్లాలకు బదిలీ చేసింది. ఇకపై పైనైనా ప్రభుత్వం పని చేస్తుందేమో చూడాలి.
మూడు నెలలుగా జరుగుతున్న హింసకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా వివిధ పోలీసు స్టేషన్లలో మొత్తం 6 వేల దాకా జీరో ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. జీరో ఎఫ్ఐఆర్ అంటే నేరం ఒకచోట జరిగితే మరో చోట రిపోర్టు చేయడమన్నమాట. గతంలో అయితే పోలీసు స్టేషన్ వారు మా పరిధిలోకి రాదు అని తప్పించుకునేవారు. తర్వాత చట్టంలో మార్పులు చేసి, ఎక్కడో అక్కడ రిపోర్టు చేసి, తర్వాత సంబంధింత పోలీసు స్టేషన్‌కు కేసును బదిలీ చేయవచ్చు అన్నారు. ఆ వెసులుబాటును యీ అల్లర్లలో విస్తారంగా ఉపయోగించుకున్నారు. ఎందుకంటే పోలీసులు కూడా జాతిపరంగా విడిపోవడంతో తమ జాతి వాళ్లు అధికారులుగా ఉన్న పోలీసు స్టేషన్లో మాత్రమే రిపోర్టు చేస్తున్నారు.
మే 3న అల్లర్లు ప్రారంభమయ్యాయి, మే 4న కుకీ మహిళలను నగ్నంగా ఊరేగించి, రేప్ చేసిన సంఘటన జరిగింది. ఆ వీడియో జులై మూడోవారంలో వైరల్ అయింది. బాధిత మహిళలు మే 16న కుకీల ప్రాబల్యం ఎక్కువ ఉన్న సైకుల్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వాళ్లు వెంటనే సంబంధిత ఠాణా నాంగ్‌పోక్ సెక్యాయ్కు కేసు బదిలీ చేశారు. కానీ వాళ్లు జూన్ 21 వరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. నెలన్నర గ్యాప్ యిస్తే మానభంగానికి రుజువులుంటాయా? ఇక అరెస్టు చేసినది, వీడియో బయటకు వచ్చాక! దీన్ని బట్టి పోలీసులు ఎంత పక్షపాతంతో ఉన్నారో క్లియర్‌గా తెలుస్తోంది.
ఈ గొడవల్లో సందట్లో సడేమియా అన్నట్లు కొందరు తమ పనులు చక్కబెట్టుకుంటున్నారు. కుకీ ప్రాంతాల్లో జరిగిన ఆందోళనల్లో గసగసాల సాగు గురించి అటవీ అధికారుల ఆఫీసుల్లో ఉన్న రికార్డులు తగలబెట్టారు. రేణు తఖెల్లంబాం అనే ఆమె సైన్యం జరిపిన ఫేక్ ఎన్కౌంటర్ల గురించి 15 ఏళ్లగా పోరాటం సలుపుతూ కేంద్రం దృష్టికి తీసుకెళ్లి, 100 ఫేక్ ఎన్కౌంటర్లపై చర్య తీసుకునేట్లు చేసింది. ఆమె పోరాటం సాగుతూనే ఉంది. ఈ అల్లర్లలో ఆమె యింటిపై దాడి జరిగి, ఫేక్ ఎన్కౌంటర్ల గురించి సైన్యానికి వ్యతిరేకంగా ఆమె వద్ద ఉన్న డాక్యుమెంట్లను కాల్చేశారు. కొంతమంది అక్రమంగా వచ్చినవాళ్లు కూడా తమ డాక్యుమెంట్లు అల్లర్లలో పోయాయని అనవచ్చు. కొందరివి నిజంగానే పోయి ఉండవచ్చు. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి గీతా మిత్తల్ నేతృత్వాన వేసిన కమిటీ డాక్యుమెంట్ల రీకనస్ట్రక్షన్కై నోడల్ ఆఫీసర్ని నియమించమని సిఫార్సు చేశారని యీ రోజు పేపర్లో వచ్చింది.
అధికారగణ పార్టీలోనూ విభజన – అధికారుల మధ్యే కాదు, అధికార పార్టీ కూడా జాతుల వారీగా చీలిపోయింది. జులై నాల్గవ వారంలో మే 4న లోయలో మైతేయీల దాడికి గురై, పక్షవాతం పాలబడి ఆసుపత్రి పాలైన వాల్తే అనే ఒక బిజెపి కుకీ ఎమ్మెల్యేను పరామర్శించానని రాజదీప్ సర్దేశాయి రాశారు. అతను మూడుసార్లు గెలిచిన ఎమ్మెల్యే. ముఖ్యమంత్రికి సలహాదారు. ఆస్పత్రిలో ఆయనను పరామర్శించేందుకు సొంత పార్టీ వాళ్లు కూడా రాలేదు. దాడి చేసిన వారిని గుర్తించి అరెస్టు చేయలేదట.
బీరేన్ పూర్తిగా మైతేయీల పక్షం వహించారనే విషయం స్పష్టంగా బోధపడుతోంది. మే3 సాయంత్రం కుకీల చురాచాంద్‌పూర్‌లో గొడవ జరగ్గానే షూట్-ఎట్-సైట్ (కనబడితే కాల్చేస్తామనడం) ఆర్డర్స్ వెంటనే జారీ చేసిన బీరేన్ లోయ ప్రాంతాల్లో మాత్రం ఆ ఆర్డర్లు జారీ చేయడంలో రోజున్నర జాప్యం చేశాడు. కుకీలకు బుద్ధి చెప్పాలనే ప్లాను అప్పుడే తెలిసింది. తర్వాత కూడా తప్పంతా కుకీలదే అన్నట్లు ఆయన ప్రకటనలు చేస్తున్నాడు. దాంతో ఆయన ప్రకటన శాంతి కమిటీలో చేరడానికి కుకీలు ఒప్పుకోవటం లేదు.
ఆగస్టు 6న కుకీ పీపుల్స్ ఎలయన్స్‌కు చెందిన యిద్దరు ఎమ్మెల్యేలు అమిత్ షాను కలిసి బీరేన్ వ్యవహారంపై అసంతృప్తి వ్యక్తం చేసి, తాము ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరిస్తున్నామని చెప్పారు. మొత్తం 60 సీట్లలో బిజెపికి స్వయంగా 32 సీట్లు ఉన్నాయి కాబట్టి దీని ప్రభావం పడదు. కానీ బిజెపిలో ఉన్న 7గురు కుకీ ఎమ్మెల్యేలు కూడా యిదే బాట పడితే అప్పుడు ప్రభుత్వానికి మెజారిటీ పోతుంది. మొత్తం 10 మంది కుకీ ఎమ్మెల్యేలలో ఒకడు స్వతంత్రుడు. ఈ 10 మంది కలిసి కుకీ జిల్లాలకై ప్రత్యేక చీఫ్ సెక్రటరీ, డిజిపి ఉండాలని కోరుతూ ప్రధానికి ఆగస్టు 17న లేఖ రాశారు. శాంతిభద్రతలు కరువైన ప్రస్తుత పరిస్థితుల్లో తాము యిళ్లల్లోంచి బయటకు రాలేకున్నామని, అసెంబ్లీకి హాజరయ్యే పరిస్థితి లేదని అన్నారు.
ప్రభుత్వ వైఫల్యాలు – మే 3 నాటి అల్లర్ల గురించి ముందస్తుగా ఇంటెలిజెన్సు వర్గాలు పసిగట్టలేదా అనే సందేహం సహజంగా వస్తుంది. ఏది ఏమైనా ఆ పనిని ఆర్మీ, అసాం రైఫిల్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ వారికి అప్పచెప్పారు. వారి దగ్గర తగినంత స్టాఫ్ లేరు. డిఫెన్స్ మినిస్ట్రీకి రాస్తే పరిస్థితి తీవ్రతను అంచనా వేయడంలో వాళ్లు విఫలమై, పంపడంలో జాప్యం చేశారు. సంఘటన తర్వాత ఇన్ఫర్మేషన్ వార్ రూమ్‌లో లెఫ్టినెంట్ జనరల్‌ను, పబ్లిక్ ఇన్ఫర్మేషన్లో లెఫ్టినెంట్ జనరల్‌ను మార్చేశారు. కేంద్ర వైఫల్యం యిలా ఉండగా, రాష్ట్రానికి సంబంధించిన పోలీసు వ్యవస్థలో చాలామంది పోలీసు అధికారులు అదే సమయానికి లీవు అడిగితే యిచ్చేశారు.
మహిళల పాత్ర – ఏదైనా ఉద్యమంలో మహిళలు ముందువరసలో ఉంటే చైతన్యవంతులుగా భావిస్తాం. మణిపూరు మహిళలకు 1904లో, 1939లో బ్రిటిషు వారికి వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర ఉంది. 2004లో సైన్యం అకృత్యాలకు వ్యతిరేకంగా చేసిన నగ్నప్రదర్శనా విదితమే. ఇటీవలి కాలంలో వారు ఆల్కహాల్‌కు, డ్రగ్స్‌కు, గృహహింసకు వ్యతిరేకంగా కూడా ఉద్యమించారు. కానీ యీసారి అల్లర్లలో వారు హింసలో పాలు పంచుకోవడం బాధాకరంగా ఉంది. ఈ దోపిడీలూ అవీ ఒక స్కీము ప్రకారం జరిగాయి. తమ గ్రామాలను కాపాడుకోవాలని యువత ఆయుధాలు ధరించి ఉన్నారనుకోండి, వారికి వ్యతిరేకంగా ఉండే సైన్యమో లేదా పోలీసులో వచ్చి వారిని తరిమివేస్తారు. అప్పుడు ఒక 500 మంది యువతీయువకులు వచ్చి పడి యిళ్లను దోపిడీ చేస్తారు. వెంటనే బాధితులు తమ పక్షాన ఉన్న పోలీసులకో, సైన్యానికో ఫోన్ చేసి రమ్మనమని కోరతారు. వారు ఏ మార్గాన వస్తారో ముందే ఊహించి, హింసకు పాల్పడిన జాతి మహిళలు ఆ వాహనాలు వచ్చే దారిలో అడ్డంగా పడ్డుకుని, దారిని బ్లాక్ చేస్తారు. ఇది ఇరుపక్షాల నుంచీ జరిగింది.
ఒక సంఘటన ప్రత్యేకంగా ప్రస్తావించ దగినది. కైతెల్మంబిలో ఒక చర్చిని తగలబెట్టారని తెలిసి ఇంఫాల్ వెస్ట్ నుంచి సైన్యదళం అటువైపు వెళుతూంటే, 100 మంది మైతేయీ మహిళలు రోడ్డు మీద పడుక్కుని వాటిని వెళ్లనీయలేదు. ‘‘మీరంతా కుకీల బానిసలు, వెళ్లడానికి వీల్లేదు’’ అంటూ నినదించారు. ఒక ఆర్మీ మేజర్ వాళ్ల వద్దకు వచ్చి హిందీలో మాట్లాడబోగా ఒకామె ‘‘హిందీ కుదరదు, ఇంగ్లీషులో మాట్లాడు’’ అని గద్దించింది. ఈ హిందీ, ఇంగ్లీషు గొడవేమిటంటే 1978లో బిశ్వేశ్వర్ సింగ్ అనే అతను పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఆఫ్ మణిపూర్ అనే చైనా అనుకూల పార్టీ పెట్టి మణిపూరును ప్రత్యేక దేశంగా గుర్తించాలని ఉద్యమించాడు. క్రమేపీ అది అనేక శాఖలుగా విడిపోయింది. దానిలో ఒక శాఖ 2000 సం.లో మణిపూరులో హిందీ సినిమాలు ప్రదర్శించరాదని ఆంక్ష విధించింది. ఎందుకంటే అవి చూస్తే మణిపూరు సంస్కృతికి విఘాతం కలుగుతుందట.
ఆ తర్వాత థియేటర్లలో హిందీ సినిమాలు ప్రదర్శించడం మానేశారు. ప్రభుత్వం యీ విషయంలో జోక్యం చేసుకోలేదు. ఈ మధ్య ‘‘కశ్మీర్ ఫైల్స్’’, ‘‘రాకెట్రీ’’ సినిమాలు రెండు ఓపెన్ ఆడిటోరియంలలో ముఖ్యమంత్రి చూసినా, మైతేయీలకు కోపం వస్తుందని థియేటర్లు సాహసించటం లేదు. ఇప్పుడీ గొడవల తర్వాత ఒక ట్రైబల్ ఆర్గనైజేషన్ ‘మేం భారతదేశంలో భాగం అని నిరూపించడానికి హిందీ సినిమా వేస్తాం అంటూ ఆగస్టు 15న చురాచాంద్‌పూర్‌లో ఓపెన్ థియేటర్లో ‘‘యూరీ’’ సినిమాను ప్రదర్శించారు. ఈ విధంగా మైతేయీలను ఉడికించడానికి గిరిజనులు హిందీ సినిమాలను ఉపయోగించు కుంటున్నారు.
దీని సంగతి సరే, మహిళల గురించి యింకా చెప్పాల్సుంది. ఇరుజాతుల మధ్య గొడవల్లో అవమానానికి, అత్యాచారానికి గురైనవాళ్లు మహిళలు. మహిళలను హింసించి, అది అవతలి జాతిపై తమ గెలుపు అనుకోవడం అనాదిగా వస్తోంది. వార్ బేబీల అంశంపై ‘‘సమరంలో సమిధలు’’ అనే కథ పాతికేళ్ల క్రితం రాశాను. బంగ్లాదేశ్ యుద్ధ సమయంలో తన తల్లిని మానభంగం చేసిన పాక్ సైనికాధికారికి బుద్ధి చెప్పడానికి, ఒకతను అతని కూతుర్ని ట్రాప్ చేసి, గర్భవతిని చేస్తాడు. విధిలేని పరిస్థితిలో సైనికాధికారి కూతుర్ని అతనికిచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకుంటాడు. కథ సుఖాంతం అనుకునే సమయంలో సైనికాధికారి భార్య వచ్చి యిద్దర్నీ తిట్టిపోస్తుంది. ‘లైంగిక అత్యాచారం చేయడానికీ, దానికి ప్రతీకారంగా పగ తీర్చుకోవడానికీ ఆడదే కావలసి వచ్చిందా? ఆడదాన్ని శరీరాన్ని, మనసుని అడ్డుపెట్టుకునే ఆటాడుతున్నారా? సమరం ఏదైనా సరే, సమిధలు మాత్రం మహిళలే’ అని.
మే4 నాటి ఘటనలో ‘మైయిరా పైబీస్’ సంస్థకు చెందిన మైతేయీ మహిళలే కుకీ మహిళలను పట్టుకుని, వివస్త్రలను చేసి మైతేయీ మగవాళ్లకు అప్పగించి, రేప్ చేయండి అన్నారు అంటే తలచుకుంటేనే ఒళ్లు జలదరిస్తోంది. ఒక కులాన్ని, ఒక జాతిని అవమానపరచాలంటే వారింటి స్త్రీని బలాత్కారం చేయడమే మార్గమా? కత్తులతో పొడుచుకున్నారు, తుపాకులతో పేల్చుకున్నారు అంటే హింసను అర్థం చేసుకోవచ్చు. కానీ యిదేమిటి? ఈ అఘాయిత్యానికి పాల్పడినవారు కూడా తల్లులే కదా, కూతుళ్లే కదా! ఈ ఘర్షణలలో యిరు పక్షాలలోని మహిళల పాత్ర ఎక్కువగా ఉంది. నిరసన ప్రదర్శనలలోనే కాదు, వాహనాలను ఆపి చెక్ చేయడం, యిళ్లను తగలబెట్టడం, యిలాటివి మహిళలే నిర్వహిస్తున్నారు. జూన్ నెలాఖరులో మైతేయీ మహిళలు ఆర్మీ దశ శిబిరాన్ని చుట్టుముట్టి 12 మంది మైతేయీ తీవ్రవాదులను విడిపించుకుని పోయిన సంగతి ‘కుకీ సమస్య’ వ్యాసంలో రాశాను.
వేల సంవత్సరాల మానవచరిత్రలో మనం నేర్చుకున్న సంస్కారం యిదా? ఇదా వాళ్ల మతం వాళ్లకు నేర్పిన సంస్కృతి? సంఖ్యలో తేడాలున్నా ఇలాటి నీచానికి యిరుమతాల వాళ్లూ పాల్పడి ఉంటారని ఊహించవచ్చు. మన మతానికి సంబంధించిన వారంటూ యీ అపరాధుల్లో ఎవర్ని వెనకేసుకుని వచ్చినా తప్పే! అంతిమంగా యీ పోరాటంలో విజేతలెవరైనా పరాజితులు మాత్రం మహిళలే. సుప్రీం కోర్టు కూడా అది గుర్తించింది కాబట్టే, బాధితుల సహాయానికై వేసిన కమిటీలో మాజీ న్యాయమూర్తులు ముగ్గురూ మహిళలే ఉండాలంది. ఆ కమిటీలో పైన పేర్కొన్న జస్టిస్ గీతా మిత్తల్‌తో బాటు, జస్టిస్ శాలినీ ఫణ్సల్కార్, జస్టిస్ ఆశా మేనన్ ఉన్నారు.
చిత్రం ఏమిటంటే మణిపూరు మహిళల పట్ల యిన్ని అత్యాచారాలు జరుగుతున్నా, జాతీయ మహిళా కమిషన్ స్పందించక పోవడం! మే4 నాటి సంఘటనపై నార్త్ అమెరికా మణిపూర్ ట్రైబల్ అసోసియేషన్ వారు జూన్ 12న మహిళా కమిషనర్ రేఖా శర్మకు ఈమెయిల్ పంపితే నెల దాటినా యీమె జవాబివ్వలేదు. జులై 19న ప్రపంచానికంతా తెలిసిపోవడంతో యిక తప్ప విచారణకు ఆదేశించారు. ఇన్నాళ్లూ ఎందుకు చర్యలు తీసుకోలేదని అడిగితే స్థానికుల నుంచి వచ్చిన ఫిర్యాదులను మణిపూరు అధికారులకు పంపించానని, మూడు రిమైండర్లు పంపినా వాళ్లు జవాబివ్వలేదని సమాధాన మిచ్చారు. ఇదీ ఆమె బాధ్యతారాహిత్యం! ఈ సీరీస్‌లో చివరి వ్యాసం – మణిపూర్ సమస్యలో రాజకీయాలు
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఆగస్టు 2023)