‘‘మణిపూర్‌లో భూవివాదాలు’’ అనే వ్యాసం చదివాక, యిది చదివితే మంచిది. ఆ వ్యాసంలో మార్చి 10న అనేక జిల్లాలలో ప్రశాంతంగా జరిగిన ఒక నిరసన ప్రదర్శన ఒకే ఒక్క చోట, చురాచాంద్‌పూర్‌లో హింసాత్మకం కాగానే ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ పర్వతప్రాంతాల జిల్లాలన్నిటిలో సెక్షన్ 144 పెట్టేసి, అదే ఊపులో ఆ రాత్రే ఎస్‌ఓఓ నుంచి వైదొలుగుతానని ప్రకటించాడని రాశాను. ఈ ఎస్‌ఓఓ (సెషేషన్ ఆఫ్ ఆపరేషన్స్) కథేమిటంటే – కుకీల తీవ్రవాద సంస్థలతో చాలాకాలం పోరాటం సలిపిన తర్వాత భారత సైన్యం వారితో ఒక ఒప్పందానికి రాదలచింది. 2005 ఆగస్టు1న కుకీ నేషనల ఆర్గనైజేషన్, వివిధ కుకీ తీవ్రవాద సంస్థలు కలిసి ఏర్పడిన యునైటెడ్ పీపుల్స్ ఫ్రంట్‌తో యుద్ధవిరమణకై ఒక ఒప్పందానికి వచ్చింది. దానిలో నిబంధనలు స్పష్టంగా లేవంటూ దాన్ని మణిపూరు ప్రభుత్వం గుర్తించలేదు. చివరకు 2008 ఆగస్టు 22న కేంద్రం, రాష్ట్రప్రభుత్వం, కుకీ ఫ్రంట్ కలిసి త్రైపాక్షిక ఒప్పందం చేసుకున్నాయి.
దాని ప్రకారం క్యాడర్లు పోరాటం మానేసి, మణిపూరు సార్వభౌమత్వాన్ని గుర్తించారు, అది తమ కోసం నిర్దేశించిన క్యాంపుల్లోనే నివసిస్తామని, రాజ్యాంగానికి లోబడి నడుచుకుంటామని ఒప్పుకున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, సైన్యం తమ పోరాటాన్ని విరమించాయి. ఇది 15 ఏళ్లగా అమల్లో ఉండి పరిస్థితి ప్రశాంతంగానే ఉంటూ వచ్చింది. దీన్ని బీరేన్ ఏకపక్షంగా రద్దు చేసి మార్చి 11 నుంచి కూంబింగ్ ఆపరేషన్స్ ప్రారంభించారు. ఇళ్లు పోగొట్టుకున్న కుకీల నిరసన ప్రదర్శనలు చేస్తే వారి భయాందోళనలు దూరం చేయాలి, వారి నివాసాలు అక్రమమైనవో, సక్రమమైనవో చెక్ చేయించాలి. ఆ బాధితులు అచ్చమైన భారతీయులో, అక్రమ చొరబాటుదారులో విచారణ చేయించాలి. అంతేకానీ, మధ్యలో యీ ఒప్పందం రద్దు చేయబూనడం దేనికి? ఇది పూర్తిగా రెచ్చగొట్టే చర్య. పైగా కేంద్రాన్ని కూడా సంప్రదించకుండా ఏకపక్షంగా ప్రకటన ఏమిటి? మేం ఏం చేసినా పడుండాలి, లేకపోతే ఉగ్రవాది అనే ముద్ర కొట్టి జైల్లో పడేస్తాం అని బెదిరించడానికా? ఇదంతా మైతేయీల ఎస్టీ హోదా తీర్పు ప్రకటించడానికి ముందు జరిగిందని బాగా గుర్తు పెట్టుకోవాలి.
ఆ తీర్పు యిచ్చినది మార్చి 27న, బయటకు తెలిసినది ఏప్రిల్ 19న. దానికి వ్యతిరేకంగా పర్వతప్రాంతాల్లో మే3న ‘‘ట్రైబల్ సాలిడారిటీ మార్చ్’’ పేర ప్రదర్శనలు జరిగాయి. నాగాలు, కుకీలతో సహా గిరిజనులందరూ పాల్గొన్నారు. (ఈ మధ్యలో జరిగిన ఓపెన్ జిమ్ కాల్చివేత విషయం ‘‘మణిపూర్ ఘర్షణలు’’ అనే వ్యాసంలో రాయబోతున్నాను) అన్ని చోట్లా శాంతియుతంగానే జరిగినా, ఆ రోజు చురాచాంద్‌పూర్ ప్రదర్శన మాత్రమే హింసాత్మకం అయింది. (దానికి ముందు జరిగిన మైతేయీల బ్లాకేడ్ సంగతీ ఆ వ్యాసంలోనే ఉంటుంది) టోర్బంగ్ ప్రాంతంలో మైతేయీలపై దాడి జరిగింది. దానికి కారణం కుకీ తీవ్రవాదుల్లో కొందరు ఆయుధాలు ధరించి రావడం! అసాం రైఫిల్స్ వారి పర్యవేక్షణలో ఉండవలసిన వారు బయటకు ఎలా వచ్చారు?
తప్పు అసాం రైఫిల్స్‌లో ఒక దళానిదైతే (దీని గురించీ ఆ వ్యాసంలో రాస్తాను) వారిని శిక్షించమని కేంద్రాన్ని కోరాలి. తీవ్రవాదులు క్యాంపుల నుంచి బయటకు వచ్చినందుకు వారిని అరెస్టు చేయిస్తే పోయె! ఇది జరగడానికి దాదాపు ఆరు వారాల ముందే ఒప్పందాన్ని రద్దు చేసుకుని, కూంబింగ్ ప్రారంభించి బావుకున్నదేమిటి? కూంబింగ్ ఆపరేషన్స్ లాటివి వినడానికి బాగానే ఉంటాయి. కానీ ఆ పేరు మీద అమాయకులను కూడా హింసించడం అనేక చోట్ల జరుగుతూ ఉంటుంది. ఇప్పుడీ అల్లర్ల తర్వాత ఎవరు స్థానికుడో, ఎవరు చొరబాటుదారో నిరూపించడం మరీ కష్టమై పోతుంది. అల్లర్లలో నా డాక్యుమెంట్లన్నీ పోయాయండి అంటాడు. వెరిఫై చేద్దామంటే ప్రభుత్వాఫీసుల్లో రికార్డులు కాలిపోయి ఉంటాయి.
తీవ్రవాదులు అన్ని జాతుల్లోనూ ఉన్నారు – ఇక్కడ గమనించవలసినది ఏమిటంటే తీవ్రవాద గ్రూపులు కుకీలలో మాత్రమే ఉన్నాయి, మైతేయీలందరూ శాంతికాముకులు అనే కలరింగు ఎవరైనా యిస్తే అది తప్పు. 1993లో మైతేయీ హిందువులకు, మైతేయీ ముస్లిములకు మధ్య భయంకరమైన ఘర్షణలు జరిగాయి. నాగాలు, కుకీలు, మైతేయీలు అందరూ హింసకు పాల్పడేవారే! చాలాకాలంగా కెఎల్ఎఫ్, పిఎల్ఏ వంటి మైతేయీ తీవ్రవాద గ్రూపులు కూడా ఉన్నాయని యింటర్నెట్ చూస్తే తెలుస్తుంది. అంతెందుకు, జూన్ నెలాఖరులో 1500 మంది మైతేయీ మహిళలు (మైయిరా పైబిస్ సభ్యులు కావచ్చు) తూర్పు ఇంఫాల్‌లోని 3వ ఆర్మీ దశ శిబిరాన్ని చుట్టుముట్టి మైతేయీ వేర్పాటువాద ‘కంగ్లేయ్ యావోల్ కన్న లుప్’ గ్రూపుకి చెందిన 12 మంది మైతేయీ తీవ్రవాదులను విడిపించుకుని పోయారు. 2015లో చందేల్ మెరుపుదాడిలో 16 మంది సైనికులను చంపింది యీ గ్రూపే. ఈ మహిళలకు బిజెపి ఎమ్మెల్యే టి. శ్యామ్‌కుమార్ మద్దతుందట.
ఇంకో విషయం కుకీ మిలిటెంట్ గ్రూపులందరితో బిజెపి ఎప్పుడూ కఠినంగానే వ్యవహరిస్తోందా? కుకీ తీవ్రవాదుల్లో అనేక గ్రూపులున్నాయి. వారిలో ఒక నిషిద్ధ గ్రూపుతో ఎన్నికల సమయంలో బిజెపి ఒప్పందం కుదుర్చుకుని, కుకీలను చీల్చి అక్కడున్న సీట్లలో అధికశాతం గెలిచిందని ఆ గ్రూపు నేత యిటీవల ప్రకటన చేశాడని కూనంనేని రాసిన వ్యాసంలో చదివాను. (ఇలాటివి వింత కాదు, 1983 ఎన్నికలకు ముందు ఎన్టీయార్ ‘నక్సలైట్లు నిజమైన దేశభక్తులు’ నినాదం యిచ్చి, వారిని ఆకట్టుకోవాలని చూశారు) ఈ ఒప్పందానికి మధ్యవర్తిత్వం వహించినవారు రామ్ మాధవ్, అసాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మట. అప్పుడు ఏమేమి ప్రామిస్ చేశారో తెలియదు కానీ బిజెపి అధికారంలోకి వచ్చాక తమకు ప్రత్యేక పరిపాలన మండలి కావాలనే నినాదాన్ని కుకీ ఎమ్మెల్యేలు అందుకున్నారు. ఈ అల్లర్లు జరిగాక కుకీ ఎమ్మెల్యేలు యీ మేరకు 10 మంది కేంద్రానికి మెమొరాండం యిచ్చారు. వారిలో 7గురు బిజెపి వారే, యిద్దరు బీరేన్ కాబినెట్‌లో మంత్రులు కూడా.
కుకీల ప్రత్యేక రాష్ట్ర డిమాండు – తమను మాదకద్రవ్య వ్యాపారులుగా, విదేశాల్లోంచి అక్రమంగా చొరబడినవారిగా వర్ణించడాన్ని నిరసిస్తూ, కుకీలు తమకు వేరే ఎడ్మినిస్ట్రేషన్ ఉండాలి అని మొదలుపెట్టి తాజాగా తమకు ప్రత్యేకరాష్ట్రం, లేదా యుటి (యూనియన్ టెరిటరీ) హోదా యివ్వాలని డిమాండు చేస్తున్నారు. తమ ప్రాంతాల్లో హేష్‌టాగ్ ఎస్ఓఎస్‌ను ప్రదర్శిస్తున్నారు. దాని అర్థం ‘సెపరేషన్ ఓన్లీ సొల్యూషన్’! (విడిపోవడమే ఏకైక పరిష్కారం). చావుకి పెడితే లంఖణానికి వస్తుందను కుంటున్నారేమో! కర్ఫీనా కిమ్‌ఖోవా అనే కుకీ రచయిత్రి తెలంగాణకు వచ్చి తమ ప్రత్యేక రాష్ట్ర డిమాండుకి తెలంగాణ ప్రజ మద్దతివ్వాలని కోరింది. ‘కుకీలపై దాడి 2014 నుంచి ప్రారంభమైంది. మేం దేశవాసులం కాము అంటూ సోషల్ మీడియాలో పోస్టు చేయడం అప్పణ్నుంచి మొదలైంది. మణిపూరుకి చెందిన యిద్దరు ఎంపీలు మైతేయీలే! ఇక మా ప్రాంతాలకు నిధులెక్కణ్నుంచి వస్తాయి? కుకీ ప్రాంతాల్లో యిప్పటికీ విద్యుత్, రోడ్డు, రవాణా సౌకర్యాలు లేవు. మా వాళ్లు ప్రకృతి వ్యవసాయం చేసుకుని బతుకు వెళ్లదీస్తున్నారు. అలాటిది వాళ్లకు కోకా విత్తనాలు ఎక్కణ్నుంచి వస్తాయి? మైతేయీలకు ఎస్టీ హోదాలను నాగాలు కూడా నిరసించారు. అయినా కుకీలపైనే ఎందుకు దాడులు జరుగుతున్నాయి? కుకీ జాతికి చెందిన ఉన్నత పోలీసధికారులకు సైతం రక్షణ లేకుండా పోయింది. మమ్మల్ని తరిమేస్తే, పర్వతప్రాంతాలను వ్యాపారక్షేత్రాలుగా మలిచేందుకే యిది జరుగుతోందని అర్థమౌతోంది.’ అందామె.
నివాసయోగ్యం కాని అరణ్యప్రాంతాలపై మైతేయీలకు, కేంద్రానికి మోజెందుకు అని ‘‘మణిపూరులో భూవివాదాలు’’ వ్యాసంలో ప్రస్తావించిన దానికి ఆమె వాదన ఊతమిస్తోంది. 2023 నాటి ఫారెస్ట్ చట్టం అంశంతో పాటు అదనపు అంశం ఏమిటంటే కుకీలు అత్యధికంగా నివసిస్తున్న ఫెర్జావల్, చురాచాంద్‌పూర్ జిల్లాలలోని భూమి కింద అసాం-అరకాన్ బేసిన్‌లోని గ్యాస్ నిక్షేపాలు అపారంగా ఉన్నాయని ప్రొఫెసర్ ఖామ్ హౌసింగ్ అనే ఆయన రాశారు. ఉమ్మడి రాష్ట్రంలో అయితే అది మైతేయీల వశమై పోతుందని, తమకంటూ రాష్ట్రం ఏర్పడితే అది తమ అధీనంలోకి వస్తుందని కుకీల ఉద్దేశం కావచ్చు. పార్లమెంటు ఉభయ సభల్లోనూ యీ నెలలో పాస్ అయిన ఫారెస్టు కన్సర్వేషన్ (ఎమెండ్‌మెంట్) బిల్లు, 2023 గురించి తెలుసుకుంటే కేంద్రం అటవీ చట్టాన్ని నీరు కార్చి, ఆ ప్రాంతాలను ఎలా ఉపయోగించుకో దలచుకుందో అర్థమౌతుంది.
ఈ సవరణ కారణంగా నాగాలాండ్‌లోని 90శాతం ప్రాతం, అరుణాచల్, అసాంలలోని చాలా ప్రాంతాలు, మేఘాలయ, మిజోరాం, మణిపూర్, త్రిపుర రాష్ట్రాల్లో దాదాపు పూర్తి ప్రాంతం ప్రభావిత మౌతాయి. 2021లోనే కేంద్ర కాబినెట్ ఈశాన్య రాష్ట్రాలలో, అండమాన్ నికోబార్‌లలో ఆయిల్ పామ్ సాగుని ప్రోత్సహించడానికి రూ11,040 కోట్లు కేటాయించింది. మిజోరామ్ రాష్ట్రంలో యీ ప్రయోగం 2004లోనే జరిగింది. దాని వలన దుష్ఫలితాలే ఎక్కువగా కలగడంతో ఆపేశారు. కానీ కేంద్రం దీనిపై పట్టుదలగానే ఉంది. మణిపూరులో కూడా పర్వతప్రాంతాల్లో వాణిజ్యపంటలు వేయడానికి కేంద్రం చూస్తోంది కాబట్టి ఆ భూమిలో తమకు వాటా కావాలని మైతేయీలు ఒక పక్క, తమకు ప్రత్యేక రాష్ట్రం యిచ్చి దానిపై హక్కులు తమకు దఖలు పరచాలని కుకీలు పోరాడుతున్నారని అనుకోవాలి.
తమకు ప్రాబల్యం ఉన్న ప్రాంతాలలో మైతేయీలు పెత్తనం చలాయిస్తున్నా వారిని ఎకనమిక్ బ్లాకేడ్ ద్వారా సతాయించగల సత్తా కుకీల వద్ద ఉంది. మణిపూరు లోయకు సరుకులు చేర్చడానికి ఉపయోగ పడే నేషనల్ హైవే నెంబరు 2 వారి ప్రాంతాల ద్వారానే వెళుతుంది. గతంలో కూడా ఎప్పుడు ఆందోళన చేయాలన్నా దాన్ని మూసేసి, తమ కోర్కెలు చెల్లించుకుంటూ ఉంటారు. ఇప్పుడూ అదే చేశారు. దాంతో లోయలోనే మైతేయీలు నిత్యావసర వస్తువులు అందక చాలా యిబ్బంది పడుతున్నారు. దీనివలన అసాం, మిజోరాంలు కూడా ప్రభావితం అయ్యాయి. ఇది మానవహక్కులను హరించడం కిందకు వస్తుంది కాబట్టి ఆ బ్లాకేడ్‌ను ఎత్తివేయమని హోం శాఖ కుకీ ఉద్యమకారులను కోరింది. కమిటీ ఆన్ ట్రైబల్స్ యూనిటీ (సిఓటియు) అనే ఒక గ్రూపు వారం రోజుల పాటు ఎత్తివేయడానికి ఒప్పుకుంది. వెంటనే కొన్ని కుకీ గ్రూపులు దాని నాయకుల యిళ్లపై దాడి చేశారు. కుకీల బ్లాకేడ్‌కు ప్రతిగా మైతేయీలు కూడా పర్వత ప్రాంతాలకు వెళ్లే సరుకులను, వాహనాలను ఆపేస్తున్నారు.
కుకీల డిమాండుపై నాగాల ఉద్దేశం ఏమిటి? ఈ పోరాటంలో నాగాలు తటస్థంగా ఉన్నారు. కానీ కుకీలను తృప్తిపరచే క్రమంలో మైతేయీలు (అనగా ప్రభుత్వం) తమ భూములను కుకీలకు కట్టబెడతారేమోనన్న భయం వారిలో కనబడుతోంది. ఆగస్టు 21న జరగబోయే అసెంబ్లీ సెషన్‌లో యీ మేరకు బిల్లు పాస్ చేస్తారేమోనని, వారం ముందే 8 మంది నాగా ఎమ్మెల్యేలు బీరేన్‌ను కలిసి 10 మంది కుకీ ఎమ్మెల్యేల ‘ప్రత్యేక ఎడ్మినిస్ట్రేషన్’ లేదా యూటీ హోదా డిమాండ్‌ను ఒప్పుకోవద్దని కేంద్రానికి విజ్ఞప్తి చేయమని కోరారు. మరో యిద్దరు నాగా ఎమ్మెల్యేలు వీరితో విభేదిస్తున్నారు.
మోదీ ప్రధాని అయ్యాక 2015 ఆగస్టులో నాగాలకు, కేంద్రానికి మధ్య ఒక ఒప్పందం కుదిరింది కానీ అమల్లోకి రాలేదు. ప్రస్తుత పోరాటంలో తాము సాటి గిరిజనులైన కుకీలతో కలవకుండా తటస్థంగా ఉన్నందుకు గాను, తమ ఒప్పందాన్ని అమలు చేయాలని వారు కోరుతున్నారు. దానితో పాటు మైతేయీలకు ఎస్టీ హోదా యివ్వకూడదని, కుకీలకు తమ భూభాగాన్ని కట్టబెట్టకూడదని కూడా కోరుతున్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కోరితే మైతేయీలకు, కుకీలకు మధ్య రాజీ కుదర్చడానికి తాము సిద్ధమే నంటున్నారు.
నార్కో వ్యాపారం – కుకీ సంఘాలు అభ్యంతరం చెప్తున్న ముఖ్యమైన అంశం తమపై వేసిన నార్కో ముద్ర! ముఖ్యమంత్రి బీరేన్ మే 28 నాటి పత్రికా సమావేశంలో మాట్లాడుతూ కుకీ మిలిటెంట్లు ఉగ్రవాదులు అన్నాడు. (తీవ్రవాదం, ఉగ్రవాదం రెండూ ఒకటి కాదు). మయన్మార్ నుంచి అక్రమంగా వలస వచ్చిన కుకీలు, గసగసాల సాగు చేస్తున్నవారు యీ హింసాకాండకు కారకులు అన్నాడు. మూలసమస్య భూమిదైతే ముఖ్యమంత్రి యీ కలరింగ్ యివ్వడంతో కుకీలకు అతనిపై నమ్మకం పోయింది. అతన్నీ, మణిపూరు రాజ్యసభ ఎంపీ మరొకతన్ని కుకీలు నమ్మటం లేదు. కొందరు కుకీ రైతులు పాపీ సీడ్స్ (గసగసాలు) సాగు చేస్తున్నారన్నమాట వాస్తవం. గసగసాలకు బదులు తెలుగు మీడియా గంజాయి అంటోంది. ఏదైతేనేం మాదకద్రవ్యం అనుకోండి.
ఇక్కడ గమనించాల్సింది, సాగు చేయటం వేరు, వ్యాపారం చేయటం వేరు. అరకు ప్రాంతంలో గంజాయి సాగు సాగుతోంది అంటున్నారు. దానికి అక్కడి కులం లేదా తెగవారిని తప్పు పడుతున్నారా? వారి పేరు కూడా పైకి రాలేదే! ‘దీని వెనక్కాల పెద్ద తలకాయలున్నాయి, వారికి ముఖ్యమంత్రి జగన్ అండ ఉంది’ అని టిడిపి ఆరోపిస్తోంది. ‘మీ హయాంలోనూ యిది జరిగింది, అంటే వారికి బాబు అండ ఉన్నట్లా?’ అని వైసిపి ఎదురుప్రశ్న వేసింది. సాగు చేయడం చిన్న విషయం. దాన్ని ప్రాసెస్ చేసి, మాదకద్రవ్యంగా మార్చి, అమ్మడం, ఎగుమతి చేయడం అది పెద్దవాళ్లకే సాధ్యం.
1960ల నుంచి 1990ల వరకు స్మగ్లింగ్ అనేది పెద్ద అక్రమ వ్యాపారం. ఆ కాలపు సినిమాలు చూస్తే యిది అర్థమౌతుంది. హార్బర్లు ఉన్న నగరాల్లో కొన్ని మార్కెట్లలో వీటిని అమ్మేవారు. పోలీసులు దాడి చేస్తే దొరికేది వీరే! సామాన్లను అక్రమంగా దిగుమతి చేసే, వీళ్ల చేత అమ్మించి లాభాలు గడించే బడా షావుకార్లు ఎప్పుడూ పట్టుబడేవారే కాదు. దిగుమతి ఆంక్షలు సడలించాక అనేక వస్తువుల స్మగ్లింగ్ తగ్గిపోయింది. కానీ యిప్పటికీ బంగారం స్మగ్లింగ్ సాగుతోంది. ‘శంషాబాద్ ఎయిర్‌పోర్టులో చెప్పుల్లో కిలో బంగారం దాచి తెస్తూ ఒక యువతి పట్టివేత’ వంటి వార్తలు వారానికి మూడు వస్తాయి. పట్టుబడిన వారెవ్వరూ కిలో బంగారం కొనగలిగిన సత్తా ఉన్నవారు కారు. కూలీకి ఆశపడి యీ నేరానికి ఒప్పుకున్న సామాన్యులే! వీరు కారియర్స్ మాత్రమే. అసలు కింగ్‌పిన్స్ జ్యూయలర్స్, రియల్టర్లు, మాఫియా వాళ్లు అని మొన్నటి పేపర్లో వచ్చింది.
అలాగే కుకీలు గసగసాలు పండిస్తే అవి మన వంటింట్లో మాత్రమే ఉపయోగపడతాయి. వాటిని డ్రగ్స్‌గా మార్చాలంటే ఎంత నెట్‌వర్క్ ఉండాలి! డ్రగ్స్ వ్యాపారపు గోల్డెన్ ట్రయాంగిల్‌కు మణిపూరు కీలకమైన స్థావరంగా మారిందని బీరేన్ అన్నాడు. ఐక్యరాజ్య సమితి తన నివేదికలో మాదకద్రవ్యాల ఉత్పత్తిలో మయన్మార్‌ది ద్వితీయస్థానం అంది. ఆ దేశంతో మన సరిహద్దు 1600 కి.మీ. లుంటే మణిపూరులోనే 400 కిమీ లుంది. అందులో 30శాతం మాత్రమే కంచె ఉఁది. మయన్మార్-లావోస్-థాయ్‌లాండ్‌ల సరిహద్దును గోల్డెన్ ట్రయాంగిల్ అంటారు. దీనితో పాటు యిచ్చిన ఫోటోలో మ్యాప్ చూస్తే మణిపూరులోని ఇంఫాల్‌తో పాటు, నాగాలాండ్ లోని దిమాపూర్, మేఘాలయలోని షిల్లాంగ్ కూడా మాదకాలు రవాణా చేసేవిగా తెలుస్తోంది. బీరేన్ మాత్రం తమ రాష్ట్రమే కీలకం అంటున్నారు. అంతటి స్థావరంగా మార్చాలంటే ఎంతటి ఆర్థిక, రాజకీయ, వ్యాపార వనరులండాలి? అవి పేద కుకీ రైతుల వద్ద ఉన్నాయని మనం నమ్మాలా? వాళ్లదంతా పిట్టను కొట్ట, పొయిలో పెట్ట వ్యవహారం. సరైన వసతులే లేవు. అధికారులు కూల్చిన యిళ్ల ఫోటోలు చూడండి. చెంబూ, తప్పాలా తప్ప యింకేమీ కనబడటం లేదు.
ఈ వ్యాపారానికి పెట్టుబడి పెట్టే స్తోమత వాళ్ల కెక్కడిది? ఎవరో వేరే వాళ్లు డబ్బిచ్చి, వాళ్ల చేత యీ సాగు చేయిస్తున్నారు. అక్రమ మార్గాల్లో సులభంగా, త్వరగా డబ్బు సంపాదించ వచ్చంటే అన్ని ప్రాంతాల వాళ్లూ ఏకమౌతారు. స్థానిక ధనికులు ప్రత్యక్షంగా రంగంలోకి దిగితే, బయటివాళ్లు పరోక్షంగా అండదండలు అందిస్తారు. ఈ డ్రగ్స్ వ్యాపారదోషం మొత్తాన్ని కుకీల నెత్తిన చుట్టేయడం సమంజసం కాదు. దానిలో ధనిక కుకీలు ఉండవచ్చు, వారితో పాటు ధనిక మైతేయీలూ ఉన్నారు. విదేశీ శక్తులూ ఉన్నాయట. మే8న నార్కోటిక్స్ అండ్ ఎఫయిర్స్ ఆఫ్ బోర్డర్ బృందం వాళ్లు ఇంఫాల్‌లో ఒక యింటి నుంచి 77 గోనెసంచుల గసగసాల విత్తనాలు, మయన్మార్ కరెన్సీ నోట్లను పట్టుకున్నారు. ఆ యిల్లు ఒక ఇంటర్నేషనల్ డ్రగ్ కార్టెల్ వారిదట!
గసగసాల సాగు విషయంలో అందరికీ హస్తముందని తౌనావ్జామ్ బృందా అనే ఆవిడ ధృవీకరించారు. ఆవిడ సరిహద్దు ప్రాంతాల్లో నార్కోటిక్స్ విభాగంలో ఎఎస్‌పేగా పని చేశారు. డ్రగ్స్ వ్యాపారుల పట్ల సింహస్వప్నంగా నిలిచారు. డ్రగ్ మాఫియాతో సంబంధం ఉన్న విఐపిల నెందరినో అరెస్టు చేసింది. తెగువ గల పోలీసధికారిగా అజయ్ దేవగణ్ వేసిన ‘సింఘం’ (2011) సినిమా వచ్చాక ప్రజలు ఆమెకు ‘లేడీ సింఘం’ అని పిలవసాగారు. ఎంతోమంది మాదక వ్యాపారులను చట్టానికి పట్టిచ్చారు. అలా పట్టిచ్చిన వారిలో ఒకతన్ని కోర్టు ఏదో సాకుతో వదిలేయడంతో ఆమెకు కోపం వచ్చి ఉద్యోగానికి రాజీనామా చేసింది, ప్రభుత్వం తనకిచ్చిన గేలంట్రీ ఎవార్డును వాపసిచ్చింది. ఆవిడ ‘‘ద వీక్’’కు యిచ్చిన యింటర్వ్యూలో ‘‘ఈ వ్యాపారంలో జాతుల తేడా లేకుండా అందరూ ఉన్నారు.’ అని స్పష్టం చేసింది. ఆమె జన్మతః మైతేయీయే!
ఆమె చెప్పిన ప్రకారం యీ డ్రగ్ కార్టెల్‌లో నాలుగు రకాల వారున్నారు. మొదటి వర్గం టాప్ లెవెల్, వాళ్లకే లాభాల్లో ఎక్కువ శాతం వెళుతుంది. రెండో వర్గం ఫైనాన్షియర్స్. మూడో వర్గం నార్కో టెర్రరిస్టులు. వీళ్లు డ్రగ్ వ్యాపారంలో వచ్చిన లాభాలతో ఆయుధాలు కొని, అధికారం సంపాదించి, ప్రజలను భయభ్రాంతులను చేస్తారు. నాలుగోవర్గం వారు పేద రైతులు. వీళ్లకు కనీస వసతులు కూడా ఉండవు. దళారుల చేతుల్లో నలుగుతూంటారు. అన్ని కులాల వారు, జాతుల వారు యీ వ్యాపారంలో పెట్టుబడి పెడుతున్నారు.
ఆమె అడిగేది ఏమిటంటే ‘మణిపూరు ముఖ్యమంత్రి కొన్ని నెలల క్రితం ఎస్‌ఓఓ ఒప్పందం కింద క్యాంపుల్లో ఉండే తీవ్రవాదులు ఈ నార్కో వ్యాపారంలో ఉన్నారని చెప్పారు. తమ అధీనంలో ఉన్న క్యాంపుల్లో ఉన్నవారు స్వేచ్ఛగా ఆయుధాలు ధరించి సంచరిస్తూ, డ్రగ్ వ్యాపారంలో మునిగి తేలుతూ ఉంటే ప్రభుత్వం ఏం చేస్తోందన్న ప్రశ్న వస్తుందా రాదా? మే3 నాటి సంఘటన జరుగుతుందని, ఘటన జరిగిన గంటన్నర కల్లా ప్రభుత్వాఫీసులు తగలబెడతారని ప్రభుత్వానికి ముందస్తు సమాచారం లేకపోతే అతి సెన్సిటివ్ సరిహద్దు రాష్ట్రంలో ఉన్న యింటెలిజెన్స్ వర్గాలు ఎంత సమర్థవంతంగా పని చేస్తున్నాయో తెలుస్తోంది. సోషల్ మీడియాలో ప్రభుత్వ వ్యతిరేక వ్యాఖ్య పెట్టినా, ఫేక్ ఫేస్‌బుక్ ఖాతాలు తెరిచినా, ప్రభుత్వం సమర్థవంతంగా వాళ్లని ట్రాక్ డౌన్ చేస్తోంది కదా! ఈ విషయంలో యింత ఉదాసీనంగా ఉందంటే దాని అర్థం, యిది కావాలని జరగనిచ్చినట్లే కదా!’
గసగసాల సాగు చేస్తే ఆ పంటలను తగలబెట్టాలి. 2017, 18లలో 18,664 ఎకరాల గసగసాల పంటను నాశనం చేసింది రాష్ట్రప్రభుత్వం. అప్పుడు ప్రజలు హర్షించి, బిజెపికి మళ్లీ పట్టం కట్టారు కదా. ఇప్పుడు రూల్సును మరింత కఠినతరం చేయాలి. రైతులను తీసుకెళ్లి జైల్లో పెట్టాలి. చేతనైతే వెనక్కాల ఉన్న పెద్ద తలకాయలను పట్టుకోవాలి. అంతేకానీ వాళ్ల కొంపలు బుల్‌డోజర్లతో కూల్చడమేమిటి? యుపిలో ఆదిత్యనాథ్ కనిపెట్టిన కొత్త ఫార్ములా యిది. ఎవరైనా గూండాగిరీ చేస్తే సంబంధిత సెక్షన్లతో అతని మీద కేసు పెట్టాలి. ఆధారాలతో కోర్టులో నిరూపించాలి. అది మానేసి, బుల్‌డోజర్‌తో అతని యిల్లు కూల్చేయడమేమిటి? పోలీసుల సాయంతో గ్రామాలకు గ్రామాలు ఖాళీ చేయించడమేమిటి?
నేరం చేసినది ఆ కుటుంబంలో ఒక వ్యక్తి అయితే అతన్ని జైలుకి పంపడం సబబు. అంతేకానీ కుటుంబం మొత్తాన్ని పిల్లాపాప, ముసలీముతకాతో సహా రోడ్డున పడేయడం ఏ ధర్మం అంగీకరిస్తుంది? ఏ చట్టం అంగీకరిస్తుంది? బీరేన్‌కు ఆదిత్యనాథ్ ఆదర్శపురుషుడు అయ్యాడు. అంతేకాదు, సాగు జరుగుతోందన్న అనుమానం ఉన్న ప్రాంతాలకు నీరు, విద్యుత్ సరఫరాను ఆపేస్తున్నాడు. నేరం చేసిన వారిని పట్టుకోవడానికి ప్రభుత్వానికి యంత్రాంగం ఉంది. దాన్ని ఉపయోగించు కోకుండా కొందరు నేరస్తులను చూపి, జాతి యావత్తుపై నేరస్తుల ముద్ర వేయడం హేయమైన పని. ఇప్పుడీ అల్లర్ల పేరు చెప్పి డ్రగ్ మాఫియా వారు అటవీ కార్యాలయాలన్నిటినీ తగలబెట్టారు. ఎక్కడెక్కడ మత్తుమందు సాగు జరుగుతోందన్న వివరాలున్న రికార్డులన్నీ దగ్ధమయ్యాయి.
మత కోణం – ఇలాటి ఆర్థిక పరమైన, సామాజిక అంశాలు అనేకం ఉండగా మతకోణంలోనే మొత్తం మణిపూరు సమస్యను చూడడం అవివేకం. ఇదేదో హిందూ-క్రైస్తవ మతకలహంగా చిత్రీకరించడం, ప్రచారం చేయడం విషాదకరం. నాగాలలో 98 శాతం క్రైస్తవులే. అయినా వారు కుకీలతో కలవకుండా తటస్థంగా ఉన్నారెందుకు? బిజెపికి ఆత్మీయంగా ఉన్నారెందుకు? కుకీలు, నాగాలు యిద్దరూ క్రైస్తవులే ఐనా 1993 నుంచి ఒకరి గ్రామాలు మరొకరు తగలబెట్టుకుంటున్నారు. గత 30 సంవత్సరాలుగా ఒకరిపై మరొకరు సామూహిత హత్యాకాండ, జాతి విధ్వంసంలో మునిగి తేలుతున్నారు. హిందువులైన మైతేయీలు, క్రైస్తవులైన కుకీలు వేల సంవత్సరాలుగా కలిసి ఉన్నారు. ఇప్పుడే గొడవలెందుకు వస్తున్నాయి? నాగాల విషయంలో రాని క్రైస్తవం మాట కుకీల విషయంలోనే ఎందుకు వస్తోంది? ఆ పేరు చెప్పి వారిని పరాయివారిగా ఎందుకు ముద్ర కొడుతున్నారు? కుకీలు మైతేయీల చర్చిలను తగలబెట్టడాన్ని, మైతేయీలు కుకీల చర్చిలను తగలబెట్టడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?
‘క్రైస్తవులైన కుకీలు ఎస్టీలు ఎలా అవుతారు? పైగా మైతేయీలలో వారి కంటె పేదలున్నారు.’ అంటూ ఆరెస్సెస్ వారి ‘‘జాగృతి’’ పత్రికలో ఓ వ్యాసకర్త అడిగారు. పాఠకులలో కొందరు దాని ఫార్వార్డ్‌ను చదివారో ఏమో యిదే ప్రశ్న అడుగుతున్నారు. ఎస్సీ, ఎస్టీలకు పేదరికం క్లాజ్ వర్తించదు. బిసిలకైతేనే క్రీమీ లేయర్ ఉంది. ఎస్సీ, ఎస్టీలు ఐఏఎస్‌లైనా, కోటీశ్వరులైనా వాళ్ల పిల్లలకు రిజర్వేషన్ సౌకర్యం ఉంది. ఇక మతం సంగతి చెప్పాలంటే, హిందువులు, శిఖ్కులలో కులవివక్షత ఉంది కాబట్టి ఎస్సీలు ఆ యా మతాలకు చెంది ఉండాలన్న నిబంధన ఉంది కానీ ఎస్టీలకు అలాటిది లేదు. ఏ మతం వారైనా సరే, వారి జీవనవిధానాన్ని బట్టి ఎస్టీ హోదా దక్కుతుంది. ఈశాన్య రాష్ట్రాలలో బిజెపి మిత్రపక్షాలైన పార్టీల నేతలు క్రైస్తవులు కాదా? ఎస్టీ హోదా అనుభవించటం లేదా? కుకీల విషయంలోనే యీ సందేహాలు ఎందుకు వస్తున్నాయి? అన్ని విషయాలు పరికిస్తే, మణిపూరు అల్లర్లలో మతం అనేది అంశం కాదని, ఇది జాతుల మధ్య గొడవ మాత్రమేనని, దానికి మూలకారణం ఆర్థికమని బోధపడుతుంది.
అక్రమంగా వలస – కొందరు కుకీలు మయన్మార్ నుంచి అక్రమంగా వలస వచ్చారని ఎత్తి చూపుతున్నారు సరే, నాగాలు కూడా మయన్మార్ ప్రాంతంలో ఉన్నారు కదా! మయన్మార్‌లో సైనిక పాలన భరించలేక నుంచి సరిహద్దులు దాటి కుకీలు మాత్రమే వచ్చారా? మయన్మార్ నాగాలు అక్కడే ఉండిపోయారా? ఇటు రాలేదా? కామన్‌సెన్స్ ఉపయోగిస్తే యిరు జాతుల వాళ్లూ వచ్చి ఉంటారని అర్థమౌతుంది. గొడవలైనప్పుడు ప్రాణరక్షణ కోసం సరిహద్దులు దాటడం పరిపాటి. ప్రస్తుతం మణిపూరు గొడవల్లో మైతేయీలు కొందరు సరిహద్దు దాటి మయన్మార్‌లో ఉన్నారట. ‘‘100 రోజులుగా యిక్కడే క్యాంపు వేసుకుని ఉన్నాం. తిరిగి వచ్చేందుకు సాయం చేయండి.’’ అంటూ పత్రికల వారికి ఫోన్లు చేశారని వార్త వచ్చింది. కుకీల గురించి మాత్రమే మాట్లాడితే వివక్షత చూపిస్తున్నారని సులభంగా అర్థమౌతుంది.
శరణార్థుల విషయంలో నా వ్యక్తిగత అభిప్రాయాలను గతంలో కూడా రాశాను. పొరుగు దేశంలో కల్లోలం చెలరేగి, కొందరు సరిహద్దు దాటి వచ్చి ఆశ్రయం కోరితే, మహా అయితే ఆర్నెల్లపాటు భరించాలి. ఆ తర్వాత వెనక్కి పంపేయాలి. ‘ఇది మేం కష్టపడి నిర్మించుకున్న దేశం. మా దేశపౌరులకే సౌకర్యాలు అమర్చలేక మా ప్రభుత్వం అష్టకష్టాలు పడుతోంది. శరణంటూ వచ్చావు కాబట్టి, మానవతా దృక్పథంతో ఆర్నెల్లు భరించాం. ఇక వెనక్కి వెళ్లి అక్కడి పరిస్థితులతో సర్దుకో, లేకపోతే పోరాడు. ఏదో ఒకటి చేయి. ఇక్కణ్నుంచి మాత్రం కదులు.’ అని చెప్పాలి.
భారీ వర్షాలు పడి, మన యింటి పక్కనున్న కాలనీలో యిళ్లు మునిగితే, అక్కడి వాళ్లకు మన పెరట్లో చోటిస్తాం. తలదాచుకోవడానికి, వండుకోవడానికి అనుతిస్తాం. ఎన్నాళ్లు? ఓ వారం. తర్వాత నీళ్లు తగ్గినట్లున్నాయి, వెళ్లండి నాయనా, ఇళ్లు కొట్టుకుపోతే ప్రభుత్వం వేరే చోటు చూపిస్తుంది. ఇక్కడ మాత్రం బిచాణా వేయకండి.’ అని చెప్తాం. వారిలో మన మతస్తులున్నా, కులస్తులున్నా మన జవాబు యిదే! పరదేశం నుంచి వచ్చిన వాళ్ల విషయంలోనూ మన జవాబు యిలాగే ఉండాలి. సరిహద్దు దాటి వచ్చినవారిని గుర్తు పట్టి, పంపించి వేయాలి. శరణార్థిగా వచ్చినవాడు ప్రమాదకరమైన పనులు చేయడానికి, నేరాలు చేయడానికి వెనకాడడు. ఇది దేశభద్రతకు, టెర్రరిజానికి, నార్కో వ్యాపారానికి సంబంధించిన విషయం. వెంటనే చేపట్టవలసిన పని. అంతమంది వచ్చి ఉండవచ్చు వంటి కాకుల లెక్కలు కుదరవు. వెంటనే ఏరివేత మొదలుపెట్టాలి. రికార్డులు దగ్ధమై ఉంటే, వేరే విధంగా వెరిఫై చేసుకోవాలి. ఘర్షణలు చల్లారాక ఉదాసీనత చూపకూడదు.
ఇక ఘర్షణల గురించి ‘‘మణిపూర్ ఘర్షణలు’’ అనే వ్యాసంలో వివరిస్తాను. (ఫోటో – గసగసాల పైరును ధ్వంసం చేస్తున్న దృశ్యం, ఇన్‌సెట్‌లో గోల్డెన్ ట్రయాంగిల్ మ్యాప్)
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఆగస్టు 2023)