సతీష్ ను బ్యాన్ చేసింది నిజమేనా?

ఉత్తరాంధ్రలో చాలా కాలంగా కీలకంగా వున్న బయ్యర్లలో గాయత్రీ ఫిలింస్ సతీష్ ఒకరు. మైత్రీ మూవీస్ లాంటి పెద్ద సంస్థ సినిమాకు డిస్ట్రిబ్యూటర్ గా వున్నారు. ఉత్తరాంధ్ర మార్కెట్ నానాటికీ పెరుగుతూ వస్తోంది. ఇక్కడ…

ఉత్తరాంధ్రలో చాలా కాలంగా కీలకంగా వున్న బయ్యర్లలో గాయత్రీ ఫిలింస్ సతీష్ ఒకరు. మైత్రీ మూవీస్ లాంటి పెద్ద సంస్థ సినిమాకు డిస్ట్రిబ్యూటర్ గా వున్నారు. ఉత్తరాంధ్ర మార్కెట్ నానాటికీ పెరుగుతూ వస్తోంది. ఇక్కడ మోనోపలీ లేకుండా వుందీ అంటే ఇద్దరు ముగ్గురు బయ్యర్లు వుండడమే కారణం. ఆ సంగతి ఇండస్ట్రీ జనాలకు కూడా తెలుసు. 

ఇప్పటి వరకు ‘మంచోడు’ అని తప్ప ఏ వివాదాల్లోకి వెళ్లలేదు. ఏజెంట్ సినిమా అగ్రిమెంట్ చేసుకున్న తరువాత కూడా క్యాన్సిల్ చేసుకోమని చాలా మంది చెప్పినా, అది పద్దతి కాదు అని నిలబడ్డాడు. అందుకే నిర్మాత అనిల్ సుంకర కూడా సాఫ్ట్ కార్నర్ తో ఎనిమిదిన్నర కోట్ల వరకు వెనక్కు ఇస్తా అని ఆఫర్ ఇచ్చారు. కానీ ఆరునెలల తరువాత అనేసరికి ఆ డీల్ సెట్ కాలేదు. ఇరువైపులా ఇగోకు వెళ్లిపోయారు.

కట్ చేస్తే ఇప్పుడు సతీష్ కు సినిమాలు ఇవ్వకుండా గిల్డ్ బ్యాన్ విధించింది అంటూ వార్తలు పుట్టుకువచ్చాయి. ఇది ఊహించిందే. ఇండస్ట్రీ కింగ్ పిన్ ఒకరు ఎప్పటి నుంచో సతీష్‌ను కార్నర్ చేయాలని చూస్తూ వస్తున్నారు. సతీష్, వీరు నాయుడు ఈ ఇద్దరూ లేకపోతే విశాఖలో ఇక ఆ కింగ్ పిన్ ఆడింది ఆట, పాడింది పాట. నైజాం ఎలా తయారైందో అలా అయిపోతుంది విశాఖ కూడా. 

నిర్మాతలు అమ్ముకోలేక, నైజాంలో మాదిరిగా అడిగిన రేటుకు ఇవ్వడమో, లేదా పంపిణీకి ఇచ్చి, చేతులు కట్టుకు కూర్చోవడమో చేయాల్సిందే. కానీ ఈ వార్తలు నిజం కాదని అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. సతీష్ కు సినిమా ఇవ్వకుండా బ్యాన్ చేయడం అన్న నిర్ణయం ఏదీ గిల్డ్ ఇంకా తీసుకోలేదని టాక్. ఈ విషయం డిస్కషన్ కు పెట్టిన మాట వాస్తవం అని తెలుస్తోంది.

అయితే సభ్యులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసారని తెలుస్తోంది. నిజానిజాలు పూర్తిగా నిర్ధారణ కాకుండా నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదని కొందరు వాదించినట్లు తెలుస్తోంది. ఇలా చేస్తే ఉత్తరాంధ్రలో ఓ మంచి బయ్యర్ ను దూరం చేసుకున్నట్లు అవుతుందని కొందరు అన్నట్లు తెలుస్తోంది. ఇలా చేయడం వల్ల ఉత్తరాంధ్ర కూడా నైజాం మాదిరిగా అయిపోతుందని, నిర్మాతలు నష్టపోవాల్సి వుంటుందని, నైజాంలో వరంగల్ శ్రీనును ఓ ప్లాన్ ప్రకారం ఇలాగే కిల్ చేసారని ఇప్పుడు ఉత్తరాంధ్రలో కూడా అలాగే వ్యూహాలు రచిస్తున్నారని కొందరు భావిస్తున్నారు.

అయితే అనధికారికంగా అయితే టాలీవుడ్‌లో ఓ కట్టు వుంది కనుక, సతీష్ కు సినిమాలు ఇవ్వడం ఇకపై కష్టం కావచ్చు. ఓ పెద్ద నిర్మాత ‘గ్రేట్ ఆంధ్ర’ తో మాట్లాడినపుడు, ప్రస్తుతానికి ఒకటి రెండు సినిమాలు ఇవ్వలేకపోవచ్చు. కానీ భవిష్యత్ లో మళ్లీ ఇవ్వక తప్పదు. ఇప్పటి వరకు ఏజెంట్ వ్యవహారం తప్పిస్తే సతీష్ పై బ్యాడ్ రిమార్క్ లేదు. ఈ ఒక్కసారి ఎందుకో పక్కదారి పట్టాడు అని అన్నారు.

గిల్డ్ నుంచి సతీష్ ను బ్యాన్ చేసారని ఓ చిన్న నిర్మాత ద్వారా మీడియాకు లీక్ లు ఇప్పించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి అనధికార బ్యాన్ కావచ్చు.  అధికారికంగా కావడానికి ఇంకా చాలా వుంది.