Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‍: మణిపూర్‌లో భూవివాదాలు

ఎమ్బీయస్‍: మణిపూర్‌లో భూవివాదాలు

‘‘మణిపూరులో పలు కోణాలు’’ అనే వ్యాసం చివర్లో తమను ఎస్టీలుగా గుర్తించమని మైతేయీలు అడగడానికి కారణం ఆ హోదా వలన వచ్చే ఉద్యోగాలు, సీట్లు కాదని, మూలకారణం భూమి కోసమని రాశాను. దాని గురించి యీ వ్యాసంలో వివరిస్తాను. కితం వ్యాసంలోనే మణిపూరు మొత్తం విస్తీర్ణం 22,327 చ.కి.మీ. అని, 60% జనాభా (వీరిలో మైతేయీలు ఎక్కువ) నివాసముండే ఇంఫాల్ లోయ 1864 చ.కి.మీ.లని, మరో లోయ జిరిబిమ్ విస్తీర్ణం 232 చ.కి.మీలు అనీ రాశాను. తక్కిన కొండ ప్రాంతంలో జనాభాలో 40% ఉన్న గిరిజనులు ఉంటారు. దాని విస్తీర్ణం దాదాపు 20 వేల చ.కి.మీ.లన్నమాట. అది అటవీ ప్రాంతం కాబట్టి గిరిజనేతరులు భూమి కొనడానికి వీల్లేదు. ఇలాటి రక్షణలు తక్కిన రాష్ట్రాలలో కూడా ఉంటాయి. మన భద్రాచలంలో కూడా గిరిజనుల భూమి గిరిజనేతరులు కొనడానికి వీల్లేదు.

మైతేయీల బాధ ఏమిటంటే జనాభాలో 53% ఉన్న తాము రాష్ట్రంలో 90% విస్తీర్ణమున్న పర్వతప్రాంతంలో భూమి కొనడానికి వీలు లేదు కానీ, పర్వత ప్రాంతీయులు తామున్న లోయప్రాంతంలో భూమి కొనగలరు. ఇది అన్యాయం అనుకున్నారు. వినడానికి మనకూ 47% వాళ్లకు 90% భూమి, 53% వాళ్లకు 10% భూమి మాత్రమే అనడం వింతగా, అన్యాయంగానే తోస్తుంది. కానీ జనసాంద్రత లెక్క వేసుకుని చూస్తే సరైన చిత్రం గోచరిస్తుంది. ప్రస్తుతం మణిపూరు రాష్ట్రం మొత్తం మీద జనసాంద్రత ఎంతో తెలుసా? చ.కి.మీ.కి 130! 650 చ.కి.మీ. విస్తీర్ణం, 68 లక్షల జనాభా ఉన్న ఉన్న గ్రేటర్ హైదరాబాదులో జనసాంద్రత చ.కి.మీ.కి 10,477 మంది! మణిపూరు లోయ మాత్రమే తీసుకుని లెక్క వేసి చూదాం. ఇప్పటి జనాభా 32 లక్షలనుకుంటే దానిలో 60% లోయలో ఉంటారు కాబట్టి లోయ జనాభా 19.20 లక్షలు. లోయల విస్తీర్ణం 2000 చ.కి.మీ.లు కాబట్టి జనసాంద్రత చ.కి.మీ.కి 960 అయింది.

రాబోయే రోజుల్లో అది పెరిగి వెయ్యో, పదిహేను వందలో అయినా హైదరాబాదుతో పోలిస్తే ఎంత తక్కువో చూడండి. అందువలన మైతేయీలకు లోయలో చోటు చాలక కటకట లాడిపోతున్నారని అనుకోవడానికి లేదు. వాళ్లకు కావలసినది పర్వతప్రాంతంలో కూడా భూమి కొనగలగడం. ఆర్టికల్ 371సి ప్రకారం మణిపూరులో హిల్ ఏరియాస్ కమిటీ (ఎచ్ఎసి) ఏర్పరచారు. అసెంబ్లీలోని 19 మంది ఎస్టీ ఎమ్మెల్యేలతో కూర్చిన కమిటీ అది. అది 13 అంశాలపై ప్రభుత్వానికి అదేశాలివ్వ గలుగుతుంది. పర్వత ప్రాంతాల నిర్వహణ కూడా వాటిలో ఒకటి. మైతేయీలతో సహా ఎవరైనా పర్వత ప్రాంతాల్లో భూమి కొనాలంటే ఈ ఎచ్ఎసి అనుమతి తప్పనిసరి. ఎవరైనా ఎస్టీ కులస్తుడు తన భూమిని కోఆపరేటివ్ సొసైటీకి తాకట్టు పెట్టవచ్చు, అమ్మాలంటే సాటి ఎస్టీకే అమ్మాలి. ఎస్టీ కానివాడికి అమ్మాలంటే డిప్యూటీ కమిషనర్ లిఖితపూర్వకమైన అనుమతి తీసుకుని అమ్మాలి. ఈ ఎచ్ఎసికి చైర్మన్‌, వైస్‌చైర్మన్‌గా కమిటీ సభ్యులే ఉండాలి. కానీ మణిపూరు ప్రభుత్వం దాన్ని తమ చెప్పుచేతల్లో ఉంచుకోవడానికి ఆ పదవుల్లో కమిటీ సభ్యులు కానివారిని కూడా నియమిస్తూ వచ్చారని గిరిజనులు ఎత్తి చూపారు.

లోయలో కూడా భూలావాదేవీలు నియంత్రించడానికి ఆర్టికల్ 371సి తో పాటు మణిపూర్ ల్యాండ్ రెవెన్యూ అండ్ ల్యాండ్ రిఫార్మ్స్ (ఎమ్‌ఎల్ఆర్ఎల్ఆర్) చట్టం, 1960 కూడా ఉంది. 1972లో మణిపూర్‌కు రాష్ట్ర హోదా వచ్చేందుకు ముందు ఈ చట్టాన్ని 1960లో పార్లమెంటులో చేశారు. కానీ యిది మణిపూర్ పర్వతప్రాంతాలకు మాత్రం వర్తించదు. ఇది మైతేయీలకు కంటగింపుగా ఉంది. దాన్ని అక్కడకు కూడా వర్తింప చేస్తే తామూ అక్కడ భూములు కొనవచ్చు కదాని వాళ్ల ఊహ. అది జరగటం లేదు కాబట్టి యీ చట్టంలోనే మార్పులు తెచ్చి లోయ ప్రాంతాలను తమ కోసమే రిజర్వ్ చేసుకుందామని తలపెట్టారు. రాజకీయంగా బలం ఉన్నవారు కాబట్టి 2015లో మణిపూర్ అసెంబ్లీలో 1960 నాటి చట్టానికి సవరణ చట్టం చేయించుకున్నారు. 60% మంది జనాభా 10% విస్తీర్ణంలో ఉండవలసి రావడం చేత రాబోయే రోజుల్లో నివేశన స్థలాలకు కొరత వస్తుంది కాబట్టి లోయ ప్రాంతాల్లోని భూమిని మణిపురీయులు కాని వారికి అమ్మకుండా నియంత్రిస్తామని ఆ చట్టంలో ఉంది.

ఇక్కడ ఉన్న మెలిక ఏమిటంటే మైతేయీలనే మణిపురీయులంటారు. వాళ్ల మాతృభాష మణిపురీ. కుకీలది తాడో-చిన్. నాగాలది ఇన్‌పుయీ లేదా పుయ్‌రోన్. నాగాలు, కుకీలు యితర రాష్ట్రాలలో కూడా విస్తరించి ఉన్నారు. కుకీలైతే మయన్మార్, బంగ్లాదేశ్ లలో కూడా ఉన్నారు. తాము మాత్రమే అచ్చమైన మణిపురీయుల మని మైతేయీల భావన. ఇటీవలి కాలంలో విదేశాల నుంచి అక్రమంగా వలస వచ్చిన కుకీలతో పాటు వేలాది సంవత్సరాలుగా తమతో కలిసి ఉన్న కుకీలను కూడా కట్టకట్టేసి, కుకీలంటేనే బయటి నుంచి వచ్చినవారు అనే ముద్ర వేయడానికి కొందరు చూస్తున్నారు. ఈ బిల్లులో మణిపురీయులు కానివారు భూమి కొనడానికి వీల్లేదు అనడంతో గిరిజనులకు భయం వేసింది. ప్రభుత్వాధికారులు తమ మీద కూడా పరాయి ముద్ర కొట్టేసి భూమి కొననీయరేమోనని.

ప్రాంతీయవాదమే ప్రమాదకరం అనుకుంటే ఉపప్రాంతీయవాదం యింకా ప్రమాదకరం. తెలంగాణ ప్రాంతంలో ఆంధ్రమూలాల వారి అవస్థ చూస్తే యిది విదితమౌతుంది. ఏ దేశంలోనైనా పౌరసత్వం కావాలంటే ఫలానా యిన్నేళ్లు నివాసం ఉండాలి అనే నియమం ఉంటుంది. ఆ రూలు ప్రకారం పౌరసత్వం వస్తుంది. తెలంగాణలో ముల్కీ రూల్స్ ఉండేటప్పుడు 15 సం.లు నివాసం ఉంటే ముల్కీ సర్టిఫికెట్టు యిచ్చి స్థానికుడిగా గుర్తించేవారు. కెసియార్ తెలంగాణ ఉద్యమకాలం నుంచి యిక్కడే పుట్టి, యిక్కడే పెరిగి, యిక్కడే ఉద్యోగం చేసి, యిక్కడే సంపాదించి, యిక్కడే చచ్చినా స్థానికుడిగా గుర్తింపు ఉండటం లేదు. మీ తాతతండ్రులు ఆంధ్ర నుంచి వచ్చారు కాబట్టి, నువ్వు ఎప్పటికీ ఆంధ్రుడివే అంటున్నారు.

పైగా అసహ్యకరమైన ‘సెటిలర్’ అనే పదాన్ని ఉపయోగిస్తున్నారు. ఎక్కడో వేరే దేశం నుంచి కాందిశీకుల్లా యిక్కడకు వచ్చి తలదాచుకున్నట్లు! సొంత రాష్ట్రంలోనే ఉంటూ ఉపాధి కోసం జిల్లా మారామంతే అన్నా వినిపించుకోవటం లేదు. రాష్ట్రం ఏర్పడ్డాక కూడా యీ నినాదం సజీవంగానే ఉంది. రాజకీయంగా ఏదైనా విమర్శించాలన్నా, ‘ఆంధ్రా కాంట్రాక్టరుకి యిచ్చారు’, ‘ఆంధ్రా పూజారిని పిలిచారు’, ‘ఆ నాయకుడి వ్యక్తిగత సిబ్బంది అంతా ఆంధ్రావాళ్లే’ యిలాటి మాటలు వినబడుతూనే ఉన్నాయి. గ్లోబల్ టెండర్ పిలిచి దుబాయివాడికి యిచ్చినా తప్పు లేదు కానీ ఆంధ్రా కాంట్రాక్టరుకి యిస్తే మాత్రం నేరం, ఘోరం! ఇప్పటికైనా ఒక రూలు పెట్టి, యిన్నేళ్లు నివాసముంటే తెలంగాణవాడిగా గుర్తిస్తాం అని అంటే ఎవరు తెలంగాణయో, ఎవరు కాదో తెలిసిపోతుంది. లేకపోతే ఆంధ్రమూలాల వారు ఎప్పటికీ ‘సెటిలర్’ ముద్ర మోస్తూనే తిరగాలి.

పైన చెప్పిన సవరణ బిల్లులో ‘రెగ్యులేట్ ద సేల్ ఆఫ్ ల్యాండ్ టు నాన్-మణిపూర్ పెర్శన్స్’ అనడం వివాదమైంది. నాన్-మణిపూర్ అనే బదులు మణిపూర్ నివాసులు కానివారికి అని ఉంటే మణిపూర్‌లో తాము యిప్పటిదాకా కడుతున్న పన్ను రసీదులు అవీ చూపించి తమకు ఆ చట్టం వర్తించదని క్లెయిమ్ చేయవచ్చు. అయినా కశ్మీరు విషయంలో ఆర్టికల్ 370 కింద యిలాటి నియమం ఉందనే కదా దేశమంతా గగ్గోలు పెట్టింది. ‘కశ్మీరువాడు మన దగ్గర ఎకరాల స్థలం కొనవచ్చు కానీ, మనం కశ్మీరులో మాత్రం అంగుళం కొనలేమట’ అని కదా మనమంతా రెచ్చిపోయాం. మరి మణిపూరులో మాత్రం స్థానికులే కొనాలని అంటే ఎలా? అసెంబ్లీ యిలాటి చట్టం ఎలా చేయగలుగుతుంది? కానీ చేసింది, అదీ మైతేయీల పట్టు! ఈ సవరణ బిల్లు పాసయిన 2015లో కేంద్రంలో బిజెపి ఉన్నా, రాష్ట్రంలో కాంగ్రెసు ప్రభుత్వమే ఉందని మనం గుర్తించాలి. అందువలన మైతేయీలను బిజెపి ఒక్కటే వెనకేసుకుని వస్తోందని, కాంగ్రెసు గిరిజనులను పరిరక్షించేస్తోందని అనుకోవడానికి లేదు.

ఈ బిల్లు పాస్ కాగానే పర్వత ప్రాంతీయులు ఆందోళన చేశారు. ఎందుకంటే అందరికీ కావలసినది లోయలోని భూమే. కొండల్లో నివాసయోగ్యం కాని భూమి ఎంత ఉంటే మాత్రం ఉపయోగం ఏముంది? అందుకే గిరిజనులు కూడా లోయలోనే వచ్చి ఆస్తులు కొనుక్కుంటున్నారు. ఈ బిల్లు పాసయితే, అది యికపై కుదరక పోవచ్చు. తమ అభ్యంతరాలు లెక్క పెట్టకుండా మైతేయీలు తమ పలుకుబడి ఉపయోగించి, బిల్లు పాస్ చేయించుకున్నారనే ఆగ్రహంతో నిరసన ప్రదర్శనలు చేశారు. కుకీలకు స్థావరమైన చూర్‌చందాపూర్‌లో పోలీసు కాల్పుల్లో 9 మంది చచ్చిపోయారు. మృతులను ఖననం చేయడానికి ఆందోళనకారులు నిరాకరించారు. మణిపూరు గవర్నరు అప్పుడు బిల్లును రాష్ట్రపతి అంగీకారానికై పంపించాడు.

బిల్లును వ్యతిరేకిస్తున్న ప్రజా సంస్థలన్నీ దిల్లీ వెళ్లి అప్పటి హోం మంత్రి రాజనాథ్ సింగ్‌ను కలిసి, తమ అభ్యంతరాలను తెలిపాయి. ఆయన వీళ్ల వాదనలు విని, యీ బిల్లును, దీనితో పాటు పాస్ చేసిన మరో రెండు బిల్లులు (ప్రొటెక్షన్ ఆఫ్ మణిపూర్ పీపుల్స్ బిల్, మణిపూర్ షాప్స్ అండ్ బిజినెస్ ఎస్టాబ్లిష్‌మెంట్ (సెకండ్ ఎమెండ్‌మెంట్) బిల్)ను ప్రస్తుతానికి ఆపి, సంబంధిత సమూహాలందరినీ (స్టేక్ హోల్డర్స్) సంప్రదించి అప్పుడు పాస్ చేయిస్తామని హామీ యిచ్చాడు. ఆ బిల్లు ఆగిపోవడంతో మైతేయీలకు యింకా కడుపు మండింది. లోయలో గిరిజనులు స్థలం కొనుక్కోనీయకుండా ఆపలేక పోయాం, పర్వత ప్రాంతంలో మనం స్థలం కొనుక్కోనీయకుండా అడ్డుపడుతున్న రూల్సు ఎత్తివేయించాలి అనుకున్నారు. కానీ అది సాధ్యపడే విషయం కాదు. దేశం మొత్తంలో అటవీ ప్రాంతాల విషయంలో అటువంటి రక్షణలు ఉన్నాయి. దాన్ని నిర్వీర్యం చేయడానికి ఉన్న ఉపాయమేమిటంటే, తమను కూడా ఎస్టీలుగా పరిగణించమని కోరడం.

అందుకే యిన్నాళ్లూ గిరిజనులమని చెప్పుకోవడానికి సిగ్గుపడిన మైతేయీలు, తమకు ఎస్టీ గుర్తింపు కావాలని అడగడం. స్వాతంత్ర్యం వచ్చాక 64 ఏళ్ల పాటు ఊరుకున్న మైతేయీలు (అందరూ కాదు, వారిలో కొందరు మాత్రమే) 11 ఏళ్ల క్రితమే యీ డిమాండు లేవనెత్తారంటేనే యిది సామాజిక కారణం కాదని అర్థం చేసుకోవచ్చు. సడన్‌గా వాళ్లు తమ కాపురాన్ని కొండల్లోకి మార్చేయలేదు. వస్త్రధారణ మార్చేయలేదు. మామూలు వ్యవసాయం మానేసి పోడు వ్యవసాయంలోకి దిగలేదు. ఆ గుర్తింపుతో అడవుల్లో భూమి కొనాలి, అదే లక్ష్యం. ఈ విషయాన్ని ఒక మైతేయీ ఎమ్మెల్యే నిశికాంత్ సపామ్ కరణ్ థాపర్‌కు యిచ్చిన యింటర్వ్యూలో చెప్పేశాడు కూడా ‘‘జాబ్ యీజ్ అనదర్ థింగ్, ద మెయిన్ థింగ్ యీజ్ ల్యాండ్’ అన్నాడు.

అసలు మైతేయీల బాధేమిటో నాకు అర్థం కావటం లేదు. తెలంగాణ ఉద్యమకారులు ప్రత్యేక రాష్ట్రం అడిగినప్పుడు ఆడ్వాణీ గారు ‘‘రాజధానికి దూరంగా ఉన్న ప్రాంతం వాళ్లు మా దగ్గర అభివృద్ధి జరగటం లేదు, మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలి అని అడుగుతారు.  మీకేమిటి, రాజధాని ఉంది, అభివృద్ధి ఉంది. ఇంకా ఏం కావాలి?’’ అని అంటూ వీళ్ల డిమాండు ఒప్పుకోలేదు. వీళ్లు యితరుల దగ్గరకు వెళ్లి ‘రాజధాని ఉంది కానీ మాకు నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో అన్యాయం జరుగుతోంది’ అని మొత్తుకున్నారు. అసలు బాధేమిటంటే, ఉమ్మడి రాష్ట్రం ఉన్నంతకాలం మెజారిటీ అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలు ఆంధ్రవే. అక్కడి వారే ముఖ్యమంత్రులుగా చాలాకాలం ఉంటున్నారు. రాష్ట్రం విడిపోతే తప్ప తమకు ముఖ్య పదవులు రావు. నిజమే కదా, రాష్ట్రం విడిపోకపోతే కెసియార్ ఎప్పటికైనా ముఖ్యమంత్రి అయ్యేవారా?

మైతేయీల వద్దకు వస్తే వీటిలో ఏవీ కారణాలు కావు. రాజధాని ఇంఫాల్ వాళ్ల దగ్గరే ఉంది, 60 మంది ఎమ్మెల్యేలలో 40 మంది ఆ ప్రాంతం వాళ్లే. ముఖ్యమంత్రులు మైతేయీలే. వాళ్లకు డబ్బు, అధికారం, పలుకుబడి అన్నీ ఉన్నాయి. ప్రత్యర్థులనుకున్న గిరిజనులు రెండు ప్రధాన వర్గాలుగా విడిపోయి కొట్టుకుంటూ ఉంటారు. నివాసానికి అతి యోగ్యంగా ఉన్న లోయ ప్రాంతంలో వీళ్లు యథేచ్ఛగా ఆస్తులు కొనుక్కోవచ్చు, అమ్మవచ్చు. గిరిజనులు వచ్చి కొనుక్కున్నా వీళ్లకు కావలసినంత చోటుంది. ఇక గిరిజనులుండే పర్వత ప్రాంతంలో స్థలం కొని తీరాలన్న పట్టుదల దేనికి? ఉన్న పరిశ్రమలన్నీ లోయలోనే ఉన్నాయి. అక్కడి ఉద్యోగాల్లో గిరిజనుల ప్రాతినిథ్యం అతి తక్కువ. కొండల్లో ఉన్న వారికి ఆదాయవనరులు లేవు. పోనీ అక్కడి జీవనప్రమాణాలు లోయలో కంటె మెరుగ్గా ఉన్నాయా?

మంచి నీటి సరఫరా ఉన్న యిళ్లు లోయలో 85% ఉంటే  కొండల్లో 60% ఉన్నాయి. క్లీన్ కుకింగ్ ఫ్యూయల్ ఉన్న యిళ్లు లోయలో 79% కొండల్లో 43%! ఆసుపత్రుల్లో అయ్యే ప్రసవాలు లోయలో 82%, కొండల్లో 55%! టీకాలు పడిన పిల్లలు లోయలో 74% కొండల్లో 58%, ఎదుగుదల సరిగ్గా లేని పిల్లలు లోయలో 19% కొండల్లో 28%! ఇక అక్కడవాళ్లు ఏం బావుకుంటున్నారని వీళ్లు అక్కడి భూమి కొనాలి? ఇన్నాళ్లూ ఆ కొండల కోసం లేని తహతహ యీ మధ్యే ఎందుకు వచ్చింది?

ఒక వ్యాసంలో చదివాను. అటవీ ప్రాంతంలో ఖనిజాలు చాలా ఉన్నాయిట. అక్కడ భూమి కొని ఆ ఖనిజాలు వెలికి తీసి, అమ్ముకునే ఉద్దేశం ఉందట. ఖనిజాలు వెలికి తీసే పని మామూలు వాళ్ల వలన సాధ్యపడదు. పెద్ద సంస్థలేవో చేయాల్సిందే. అలాటి సంస్థలే మైతేయీలకు చేయూత నిచ్చి వాళ్ల చేత స్థలాలు కొనిపించి, తవ్వుదామని చూస్తున్నారట. మామూలుగా అయితే యిలాటి తవ్వకాలు ఏం మొదలుపెట్టినా వనవాసులు అడ్డుకుంటారు. పర్యావరణ వేత్తలు దిగిపోతారు. సామాజికవేత్తలు వాళ్ల నిర్వాసితులై పోతారంటూ ఆందోళనలు చేపడతారు. అందరూ కలిసి చేపట్టని కంపెనీని (సాధారణంగా విదేశీ కంపెనీల భాగస్వామ్యం కూడా ఉంటూంటుంది), అనుమతులిచ్చిన ప్రభుత్వాన్ని దుమ్మెత్తి పోస్తారు. కానీ స్థలం సొంతదారులే ‘డెవలప్‌మెంట్‌’కు యిస్తామంటే యిక ఎవరూ ఏమీ చేయలేరు కదా!  అందువలన మైతేయీలు పర్వతప్రాంతంలో స్థలాల కొనుగోలుకి పట్టుబడుతున్నారని రాశారు. అయితే కావచ్చు.

కశ్మీరులో ఆర్టికల్ 370 కారణంగా కశ్మీరేతరులు ఎవ్వరూ భూమి కొనడానికి వీలుండేది కాదు. కానీ అక్కడ ఆస్తులు కొందామనుకున్నవారు పట్టుబట్టడంతో 370 ఎత్తేసింది బిజెపి ప్రభుత్వం. కొందరు ధైర్యం చేసి కొన్నా, స్థానికుల ఆందోళనల కారణంగా స్వాధీనం చేసుకోలేక పోయారని చదివాను. కేంద్రం ఆధీనంలో ఉన్నా కశ్మీరులో యింకా ప్రశాంతత నెలకొనలేదు. అక్కణ్నుంచి సైన్యం కదలలేదు. ఉగ్రవాదం తగ్గకపోవడంతో 370 తీసేసినా ప్రయోజనం సమకూరలేదు. అదే మణిపూరులో అయితే జనాభాలో మెజారిటీ, చేతిలో అధికారం గల ప్రజలు సుముఖంగా ఉన్నారు కాబట్టి వారిని భాగస్వాములను చేసుకుంటామంటూ బయటివారు పెట్టుబడులు సులభంగా పెట్టవచ్చు. ఈ కోణం ఫార్-ఫెచ్డ్‌గా అనిపించినా గమనించ దగినదే.

దీనితో పాటు పరిగణనలోకి తీసుకోవలసిది కేంద్రం ఆలోచనావిధానం. కేంద్రం ఈశాన్య ప్రాంతంలో పామ్ ఆయిల్ ప్లాంటేషన్ ప్రాజెక్టులు చేపట్టడానికి సంకల్పించి, దానికి వీలు కల్పించడానికి పార్లమెంటులో మార్చి 29న ఫారెస్ట్ కన్సర్వేషన్ (ఎమెండ్‌మెంట్) బిల్లు, 2023 పాస్ చేసింది. దానిపై వచ్చే వ్యాసంలో విపులంగా రాస్తాను. ప్రస్తుతానికైతే గ్రహించవలసినది ఏమిటంటే కేంద్రం కూడా మణిపూరు అరణ్యప్రాంతాలలో పామ్ ఆయిల్‌పై పెట్టుబడులు పెట్టడాన్ని ప్రోత్సహిస్తోందని. గిరిజనులైతే యిలాటి వాటిని అడ్డుకుంటారు. మైదాన ప్రాంతం వారికి అక్కడి భూములు కొనే వెసులుబాటు కల్పిస్తే వాళ్లు పెట్టుబడులు పెట్టి, ప్రాజెక్టులు చేపడతారు. ఓ పక్క అడవుల్లో భూములను కొనేందుకు మైతేయీలు చేసే ప్రయత్నాలకు మద్దతిస్తూ, మరో పక్క అరణ్యప్రాంతాల నుంచి కుకీలను వెళ్లగొడుతున్న రాష్ట్రప్రభుత్వాన్ని కేంద్రం వెనకేసుకుని వస్తోందని కూడా యీ సందర్భంలో గుర్తు చేసుకోవాలి. కుకీలను వెళ్లగొట్టడం గురించి రాబోయే పేరాల్లో వివరిస్తున్నాను.

మైతేయీలది కొండ ప్రాంతాల్లో స్థలం గురించిన గొడవైతే, కుకీలది తమ ఆవాసాలకు సంబంధించినది. మణిపూరు ప్రభుత్వం కుకీలు రిజర్వ్‌డ్, రక్షిత అరణ్యాలలో అక్రమ నివాసాలు ఏర్పరచు కుంటున్నారంటూ వాటిని ఖాళీ చేయిస్తోంది. గతంలో కంటె వారు నివాసముండే గ్రామాల సంఖ్య పెరిగిందని, దానికి కారణం మయన్మార్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలస వస్తున్న కుకీలనీ ప్రభుత్వం అంటోంది. మైతేయీల ఎస్టీ హోదాపై హైకోర్టు తీర్పు బయటకు రావడానికి చాలా ముందే మార్చి 10న కుకీలు ఇండీజినస్ ట్రైబల్ లీడర్స్ ఫోరమ్ (ఐటిఎల్ఎఫ్) నాయకత్వంలో చురాచాంద్‌పూర్ యిత్యాది 5 పర్వత ప్రాంతంలోని జిల్లాలలో ర్యాలీ నిర్వహించారు. దేనికి? రిజర్వ్‌డ్ ఫారెస్టుల విస్తరణ పేరుతో కుకీ గ్రామాలను ప్రభుత్వం నిర్మూలించడానికి వ్యతిరేకంగా!

గ్రామాల సంఖ్య పెరగడమనేది, అడవుల్లో కొత్త గ్రామాలు వెలవడమనేది కుకీల జీవిత విధానంలో భాగమని, విదేశీ కుకీల కారణంగానే జరుగుతోందని అనడానికి లేదని కుకీ సంస్థల వాదన. పెద్దవాళ్లయ్యాక కుకీలు కుటుంబం నుంచి విడివడి వేరే ఊరిలో కాపురం పెడతారట. ప్రభుత్వం గ్రామాల సంఖ్య పెరిగినట్లు చూపుతోంది తప్ప, కుకీల జనాభా ఎంత పెరిగిందో లెక్కలు చెప్పటం లేదు. అప్పుడు పెరుగుదల సహజపరిణామమో, విదేశీయులు వచ్చి పడడం చేత పెరిగిందో తెలిసేది. అంతెందుకు యిప్పుడీ అల్లర్లలో అనేక మంది కుకీలు చచ్చిపోయారు కదా! వారిలో స్థానికులు కాకుండా విదేశీయులు ఎవరైనా ఉన్నారా? ఉంటే ప్రభుత్వం ప్రకటించవచ్చు కదా!

ఇక విదేశీ కుకీల గురించి. మయన్మార్‌లో 2021 ఫిబ్రవరిలో సైనిక కుట్ర జరిగాక అక్కణ్నుంచి బర్మా కుకీలు వలస వచ్చారనేది అందరూ ఒప్పుకోవలసిన విషయం. 1640 కి.మీల భారత-మయన్మార్ సరిహద్దులను కాపాడవలసినది, చొరబాట్లను ఆపవలసినది కేంద్ర బలగాలు, రాష్ట్ర పోలీసు వ్యవస్థ. వాళ్లు ఆ బాధ్యతను విస్మరిస్తే వాళ్లను తప్పుపట్టాలి. కానీ ఆ సాకుతో మైతేయీలు రాష్ట్రంలో ఉన్న కుకీలందరిపై విదేశీ ముద్ర కొడుతున్నారని, అందర్నీ అక్రమవాసులుగా ప్రకటిస్తున్నారని కుకీ సంఘాలు ఆవేదన చెందుతున్నాయి. కుకీలు మయన్మార్‌లో, బంగ్లాదేశ్‌లో ఉన్నంత మాత్రాన భారతీయ కుకీలను కూడా పరాయివారిగా చూడడం తప్పనే వాదన సరైనదే. తమిళనాడులో, కర్ణాటకలో కూడా పెద్ద సంఖ్యలో తెలుగువారున్నారు. మీరు ఆంధ్రలో ఎక్కణ్నుంచి వచ్చారు? అని అడిగితే మేం ఎక్కణ్నుంచీ రాలేదు, యిక్కడివాళ్లమే అంటారు వాళ్లు.

మీ వాళ్లు తమిళనాడులో, కర్ణాటకలో ఉన్నారు కాబట్టి మీరూ అక్కడివారే అని ఎవరైనా మనతో అంటే ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది? అలాగే వేలాది సంవత్సరాలుగా మణిపూరులో ఉంటూ 1917-19 నాటి ఆంగ్లో-కుకీ వార్స్‌లో బ్రిటీషు వారితో యుద్ధం చేసి, నేతాజీ ఆజాద్ హింద్ ఫౌజ్‌లోను, యిప్పటికీ భారత సైన్యంలోను ఉన్న కుకీలను, పరాయివాళ్లంటే వింతగా ఉండదూ? కొంతమంది అక్రమంగా వచ్చినంత మాత్రాన స్థానికులకు కూడా అదే ముద్ర కొట్టగలరా? శ్రీలంక సంక్షోభ సమయంలో ఎల్‌టిటిఇ సభ్యులైన అనేకమంది శ్రీలంక తమిళులు తమిళనాడంతా వ్యాపించారు. స్థానిక అధికారుల, రాజకీయ నాయకుల ప్రాపు సంపాదించి ఆశ్రయం సంపాదించారు. వారిని పట్టుకుని, ఏరి పారేయవలసిన బాధ్యత ప్రభుత్వానిది. అది మానేసి స్థానిక తమిళులతో సహా అందరూ ఎల్‌టిటిఇ వారే అని తీర్మానించడం ఏ విధంగా సబబు?

అక్రమంగా చొరబడిన వారిని గుర్తించడం ఎలా? ఎన్‌ఆర్‌సి (నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్) పౌరసత్వ జాబితా తయారు చేయాలి. మైతేయీ ఆందోళన కారులు ఆ మేరకు ప్లకార్డులు కూడా ప్రదర్శిస్తున్నారు. ఎన్‌ఆర్‌సి చేపట్టవలసినది ప్రభుత్వం! దానికి కుకీలు, నాగాలు కూడా అభ్యంతరం తెలపటం లేదు. సత్వరమే చేయండి, మా మీద పరాయి ముద్ర తీసేయండి అని అడుగుతున్నారు. చొరబాటుదారులను ఆపండి అని వాళ్లూ కోరుతున్నారు. ఒకే జాతి వాళ్లు కదాని ఏ శరణార్థిని, ఏ చొరబాటుదారుణ్ని ఎవరూ ఆదరించరు. అన్నీ పోగొట్టుకుని వచ్చినవాడు ఎంత తక్కువ కూలీకైనా సిద్ధపడతాడు, ఏ నేరం చేయడానికైనా వెనకాడడు. అందువలన కుకీలు వాళ్లను స్వాగతిస్తున్నారని అనుకోవడం పొరపాటు. అక్రమ వలసలు ఉన్నాయని అంగీకరిస్తే ప్రభుత్వం తన వైఫల్యాన్ని ఒప్పుకోవాలి, వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టాలి. ఆ సాకు చెప్పి తన పౌరులనే తను వేధించకూడదు. దీని గురించి, గంజాయి సాగు గురించి మూడో వ్యాసంలో వివరిస్తాను.

ఇక గిరిజనులు అడవుల్లో ఆవాసాలు ఏర్పరచుకోవడం, నియమాలకు విరుద్ధంగా పోడు వ్యవసాయాలు చేయడం వగైరాలు దేశమంతా చూస్తూనే ఉంటాం. ఫారెస్టు ఆఫీసర్లు వాళ్లపై కేసులు పెట్టడాలు, ఆ పంటలు కాల్చేయడాలూ వగైరాలు జరుగుతూనే ఉంటాయి. ‘‘పుష్ప’’ సినిమాలో కూడా యిళ్ల కూల్చివేతను చూపించారు. అటవీ ప్రాంతాన్ని నిర్వచించడంలో ఉన్న రాజకీయాలు అవీ చూపించారు. తెలంగాణలో జులై నెలలోనే గిరిజనులపై మోపిన పోడు వ్యవసాయం కేసుల్ని ఎత్తి వేస్తామని, గిరిజనులు ఆక్రమించిన భూములను క్రమబద్ధం చేసి రైతుబంధు పథకాన్ని వాళ్లకి విస్తరిస్తామని ప్రకటించారు. కానీ మణిపూరు ప్రభుత్వ విధానం మాత్రం దీనికి విరుద్ధంగా ఉంది.

ఇక కుకీ గ్రామాల సంఖ్య పెరుగుదల గురించి, కొన్ని జిల్లాలలో వారి సంఖ్య పెరగడం గురించి చెప్పాలంటే కుకీ సంస్థలు చెప్పేదేమిటంటే, 1992, 93, 94, 97లలో నాగా-కుకీ ఘర్షణలు జరిగినప్పుడు ఉఖ్రుల్, సేనాపతి, తామెన్‌గ్లాంగ్ జిల్లాలలో నివాసముంటున్న కుకీలు చురాచాంద్‌పూర్, కాంగ్‌కోక్పి, తెంగ్‌నౌపాల్ జిల్లాలకు తరలిపోయారు. అందువలన యీ జిల్లాలలో వారి జనాభా పెరిగినట్లని పిస్తుంది. కానీ తక్కిన జిల్లాలలో తగ్గిన మాట విస్మరిస్తే ఎలా? చురాచాంద్‌పూర్ జిల్లాలో జనాభా పెరిగింది అనగానే వాళ్లంతా మయన్మార్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చి పడ్డారని తీర్మానిస్తే ఎలా?

2017 నుంచి 2022 వరకు ముఖ్యమంత్రిగా ఉండే రోజుల్లో బీరేన్ సింగ్ గిరిజన పక్షపాతిగా పేరు తెచ్చుకున్నాడు. పర్వతప్రాంతాలలో కొన్ని చోట్ల నాగాలు, మరి కొన్ని చోట్ల కుకీలు అధికసంఖ్యలో ఉన్నారు. వీళ్లందరి మధ్య ఘర్షణలు జరుగుతూ ఉంటాయి. ఇతర ప్రాంతం నుంచి తమ ప్రాంతానికి రాకుండా దిగ్బంధాలు (బ్లాకేడ్) చేస్తూంటారు. 2017 ఎన్నికలకు ముందు ఏడు కొత్త జిల్లాల ఏర్పాటును వ్యతిరేకిస్తూ యునైటెడ్ నాగా కౌన్సిల్ వారు నాలుగు నెలలపాటు ఆర్థిక దిగ్బంధం నిర్వహించారు. అయితే బిజెపి ప్రభుత్వం వచ్చి బీరేన్ ముఖ్యమంత్రి అయ్యాక ఒక్క దిగ్బంధం కూడా జరగలేదు. నాగాలు అధిక సంఖ్యలో ఉండే ఉఖ్రుల్ జిల్లాకు వెళ్లినపుడు అతనికి అద్భుత స్వాగతం లభించింది. అంతకు ముందు కాంగ్రెసు ముఖ్యమంత్రి వస్తే నిరసనలే ఉండేవి.

2017-22 మధ్య బిజెపి ప్రభుత్వం సాధించిన విజయాల్లో మొదటగా చెప్పవలసినది టెర్రరిజం సంబంధిత సంఘటనల సంఖ్య బాగా తగ్గిపోవడం. గతంలో రాజధాని ఇంఫాల్‌తో సహా అనేక ఊళ్లలో చీకటి పడిందంటే బయటకు రావడం భయంగా ఉండేది. ఆ ఐదేళ్లలో శాంతిభద్రతలు బాగా పెరిగి, ప్రజలు ధైర్యంగా తిరగాడసాగారు. అందుకే 2022 ఎన్నికలలో బిజెపి లోయలో 26 సీట్లు గెలుచుకోవడంతో పాటు నాగాలు అధికసంఖ్యలో ఉన్న పర్వతప్రాంతంలోని 12 సీట్లలో 2 గెలిచింది., దానితో పొత్తు పెట్టుకున్న ఎన్‌పిఎఫ్‌కి 5 వచ్చాయి. కుకీలు అధికంగా ఉన్న పర్వతప్రాంతంలోని 7 సీట్లలో 4 బిజెపికి, 3 ఇతరులకు వచ్చాయి. బిజెపి సొంత మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

కానీ 2022 మార్చిలో తిరిగి ముఖ్యమంత్రి అయిన తర్వాత బీరేన్‌లో మార్పు వచ్చింది. మొదటి టెర్మ్‌లో ‘గో టు హిల్స్’, ‘గో టు విలేజెస్’ అని ప్రచారం చేసిన ఆయన తిరిగి నెగ్గగానే అటవీ సంరక్షణ, రిజర్వ్ ఫారెస్టుల విస్తరణ అంటూ దానిపై పడ్డాడు. మంచిదే కానీ అది తమను లక్ష్యంగా చేసుకుని సాగుతోందని కుకీల ఆరోపణ. ఎందుకంటే వారు చాలా ఏళ్లుగా నివాసముంటున్న గ్రామాలను బుల్‌డోజర్లతో నిర్మూలించేస్తున్నారు. దానికి తగిన నష్టపరిహారం యివ్వటం లేదు, పునరావాసం కల్పించటం లేదు. ఇది ఫారెస్ట్ యాక్ట్‌కు విరుద్ధంగా ఉందని వాదిస్తూ యీ విషయంపై కుకీ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ 2022 నుంచి శాంతియుతంగా నిరసనలు తెలుపుతూ, ప్రభుత్వానికి విజ్ఞప్తులు పంపుతూ వచ్చింది. కానీ ప్రభుత్వం ఒక్కసారి కూడా దాన్ని చర్చలకు పిలవలేదు.  

2022 నవంబరు 7న చురాచాంద్‌పూర్‌-ఖౌపుమ్ రక్షిత అటవీ ప్రాంతంలో నివాసాలపై అప్పటిదాకా ఉన్న ప్రభుత్వ చట్టాలన్నిటినీ ఒక్క జిఓతో ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ రద్దు చేసేసింది. ఎందుకంటే ‘పాత ఆదేశాలన్నీ లోపభూయిష్టమైనవి, అమోదయోగ్యం కానివి, తప్పుడువిట’. (ఇమ్‌పెర్‌ఫెక్ట్, డిఫెక్టివ్, ఎరోనస్ అండ్ అన్‌యాక్సెప్టబుల్). దేని ఆధారంగా యిలాటి అభిప్రాయానికి వచ్చారో, సంబంధింత శాఖలతో సంప్రదించారో లేదో దేవుడికి ఎరుక. పాత ప్రభుత్వపు ఆదేశాలంటే, ఐదేళ్లగా అదే ప్రభుత్వం కొనసాగుతోందిగా, దాని ఆదేశాలూ తప్పుడువేనా? ఈ జీవో విషయం నేను ‘‘ఔట్‌లుక్ జూన్ 1, 2023 సంచికలో ప్రొఫెసర్ టి.హావోకిప్ రాసిన వ్యాసం ద్వారా తెలుసుకున్నాను.

ఏమైతేనేం, దాని ప్రకారం అనేక కుకీ గ్రామాలు అనుమతి లేనివి (అనాథరైజ్డ్) అయిపోయాయి. అక్కడ నివసించేవారు ఆక్రమణదారులై పోయారు. మీవి చట్టవిరుద్ధమంటూ 38 గ్రామాలకు నోటీసులు యిచ్చి 38 వేల మందిని నిర్వాసితులను చేయడానికి ప్రభుత్వం సంకల్పించింది. కుకీలు అడవులను ఆక్రమిస్తే ఊరుకోవాలా అని వాదించేవారు, వారిని ఆక్రమణదారులుగా మార్చిన యీ జీఓ గురించి అధ్యయనం చేయాలి. ఈ జీఓ అమలులో కూడా ప్రభుత్వం పక్షపాత వైఖరి చూపించింది. (నాగాల ప్రాంతాలను ఉపేక్షించడం చేత కాబోలు వారు ప్రస్తుత ఆందోళనలో తటస్థంగా ఉన్నారు) రాష్ట్రంలోని 14 ఫారెస్ట్ డివిజన్లలో 36 రిజర్వ్‌డ్ ఫారెస్టులు, 22 ప్రొటెక్టెడ్ ఫారెస్టులు ఉంటే ప్రభుత్వం కుకీలు ఎక్కువగా ఉన్న చురాచాంద్‌పూర్‌, కాంగ్‌పోక్పీ డివిజన్లు, చురాచాంద్‌పూర్‌ జిల్లాపై మాత్రమే దృష్టి పెట్టింది. అంతేకాదు, అక్కడున్న ఆరు డివిజన్లలోని ఫారెస్టు గార్డులకు ఆయుధాలు సమకూర్చింది. వారికి పంగైలోని మణిపూరు పోలీసు ట్రైనింగ్ కాలేజీలో శిక్షణ కూడా యిప్పించిందని 2023 మార్చిలో బయటకు వచ్చిన రిపోర్టులు చెప్పాయి.

1988 నాటి ఫారెస్ట్ చట్టం ప్రకారం ఫారెస్ట్ మేనేజ్‌మెంటులో ఫారెస్ట్ అధికారులతో పాటు గిరిజనులకు కూడా భాగస్వామ్యం ఉండాలి. కానీ మణిపూరు ప్రభుత్వం దాన్ని తుంగలో తొక్కి ఫారెస్ట్ గార్డులకు మాత్రమే ఆయుధాలలో ప్రత్యేక శిక్షణ యిప్పించింది. కబ్జాల పేరుతో గ్రామస్తులను తొలగించడం కొన్నాళ్లగా సాగుతున్నా 2023 ఫిబ్రవరి 20న చురాచాంద్‌పూర్ జిల్లాలోని కె.సాంగ్‌జాగ్ అనే గ్రామంలోని 16 కుకీ కుటుంబాలను తరిమివేయడం వివాదానికి దారి తీసింది. వాళ్లు 37 ఏళ్లగా తాము అక్కడే ఉన్నామని మొత్తుకున్నా వినలేదు. నవంబరు నాటి జీవో చూపించి వాళ్లను నిర్వాసితులను చేశారు.

ఇది ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్, 1927, ఫారెస్ట్ రైట్స్ యాక్ట్, 2006కు విరుద్ధంగా సాగుతోందంటూ, దీనికి నిరసన తెలుపుతూ మార్చి 10న కుకీలు ఇండీజినస్ ట్రైబల్ లీడర్స్ ఫోరమ్ (ఐటిఎల్ఎఫ్) నాయకత్వంలో చురాచాంద్‌పూర్ యిత్యాది 5 పర్వత ప్రాంతంలోని జిల్లాలలో ర్యాలీ నిర్వహించారు.  అన్ని చోట్లా శాంతియుతంగానే జరిగింది కానీ కాంగ్‌పోక్పి అనే చోట గుమిగూడదంటూ పోలీసులు ప్రదర్శనకారులపై బలప్రదర్శన చేయడంతో అక్కడ హింసాయుతంగా మారి, 20 మంది గాయపడ్డారు. ఇలాటివి జరిగినప్పుడు పాలకుడన్నవాడు ప్రదర్శనకారులను చర్చలకు పిలిచి, తాము చేసేది సక్రమమైనదే అని, నిజమైన సొంతదారులపై చర్యలుండవని హామీ యిస్తాడు.

కానీ బీరేన్ ఘర్షణ మార్గాన్ని ఎంచుకున్నాడు. హింసాత్మక సంఘటన ఒక్క చోటే జరిగినా కొండ జిల్లాలన్నిటిలో సెక్షన్ 144 విధించాడు. అన్నిటికన్నా ఘోరమైనది కుకీ తీవ్రవాద సంస్థలతో 2008లో గతంలో కుదుర్చుకున్న ఎస్ఓఓ (సస్పెన్షన్ ఆఫ్ ఆపరేషన్స్) నుంచి ఏకపక్షంగా ప్రభుత్వం తప్పుకుంటోందని ప్రకటించాడు. అదీ ఆ సంఘటన జరిగిన మార్చి 10 రాత్రే! (ఈ త్రైపాక్షిక ఒప్పందంలో కేంద్రం కూడా భాగస్వామే. అది ఒప్పుకోకపోవడంతో యీ ప్రతిపాదన ఆగిపోయింది). అయినా భూనిర్వాసితుల సమస్యకు, తీవ్రవాద సంస్థలతో ఒప్పందానికి సంబంధం ఏముంది?  ఇక్కణ్నుంచే ముఖ్యమంత్రి మిస్‌‌హాండలింగ్ ప్రారంభమైంది. ఎస్ఓఓ గురించి, యితర సమస్యల గురించి గురించి వచ్చే వ్యాసంలో చెప్తాను. ఈ సంఘటనలన్నీ మైతేయీల ఎస్టీ హోదా తీర్పు రావడానికి ముందే జరిగాయని పాఠకులు గమనించాలని కోరుతున్నాను. (ఫోటో – కబ్జా చేశారంటూ  కుకీ గ్రామాలను ఖాళీ చేయిస్తున్న దృశ్యం)

– ఎమ్బీయస్ ప్రసాద్ (ఆగస్టు 2023)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?