మణిపూర్ మూణ్నెళ్లగా మండుతూనే ఉంది. ఎక్కడో ప్రారంభమై ఎక్కడెక్కడికో వెళ్లిపోయి, యిప్పుడు దేశమంతా అదే చర్చగా నడుస్తోంది. దీనికి మూలకారణం మైతేయీలకు షెడ్యూలు ట్రైబ్ హోదా యిమ్మనమని మణిపూర్ హైకోర్టు సిఫార్సు చేయడమే అని చెప్పేసి ఊరుకుంటే చాలదు. ఏనుగును ఐదుగురు గుడ్డివాళ్లు వర్ణించినట్లు మణిపూర్ అనగానే అది హిందూ-క్రైస్తవ ఘర్షణ అని కొందరు, గంజాయి పెంపకం దారుల ఆగడాలనీ కొందరు, సీమాంతర ఉగ్రవాదమని కొందరు, విదేశీ వలసదారుల అఘాయిత్యమని కొందరు, భూమి తగాదాలని కొందరు, రాజకీయ కారణాలని కొందరు యిలా పాక్షిక దృష్టితో చెప్తున్నారు. నిజానికి యివన్నీ కలిసే మణిపూర్‌ను యీ స్థితికి తెచ్చాయి. వాటి గురించి సమాచారం సేకరించి, మూడు వ్యాసాలలో మీకు అందిస్తున్నాను. అవి చదివి సమగ్రమైన, స్పష్టమైన రూపం తోచాక మీరు వ్యాఖ్యానిస్తే సబబు. ఈ మధ్యలో ఫాక్చువల్ ఎర్రర్స్ ఉంటే చెప్పండి.
మణిపూరులో అల్లర్లను పట్టించుకోకుండా అమిత్ షా కర్ణాటక ఎన్నికల సమరంలో మునిగి తేలుతున్నారని రాసినప్పుడు కొందరు పాఠకులు యిది హిందూ-క్రైస్తవ ఘర్షణ అంటూ ఏదో రాయబోయారు. కారణాల గురించి అప్పుడు చర్చించడం అప్రస్తుతం. ఇప్పుడు సమయోచితం. నేను అప్పుడు రాసిన వ్యాఖ్య గురించి చెప్పాలంటే, కర్ణాటకలో మే 10న ఎన్నికలు జరిగాయి. మే4న మణిపూర్‌లో జరిగిన సంఘటన వీడియో ద్వారా యిప్పుడు దేశమంతా తెలిసింది. సమర్థుడైన కేంద్ర హోం మంత్రిగా అమిత్‌కు అప్పుడే తెలిసి ఉంటుంది. కానీ ఆయన ప్రాధాన్యతలు వేరని యిప్పుడు రుజువైంది. మోదీదీ అంతే. కానీ ఆయన ప్రధాని కాబట్టి వేరే బాధ్యతలుంటాయని సర్ది చెప్పుకోవచ్చు. కానీ హోం మంత్రికి అలాటి మినహాయింపులు ఉండవు.
మణిపూర్ సంక్షోభం గురించి తెలుసుకోబోయే ముందు మనం ఒకటి అర్థం చేసుకోవాలి. ఈనాడు అక్కడ డబుల్ ఇంజన్ సర్కారు ఉంది కాబట్టి కేంద్ర, రాష్ట్ర బిజెపిలను నిందించడం సులభం. కానీ మనం గుర్తించాల్సింది, రాష్ట్రంలో, కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా సరే అరణ్య ప్రాంతాలలో శాంతిభద్రతలు కాపాడడం బహు క్లిష్టం. అక్కడే కాదు, అనేక గిరిజన ప్రాంతాల్లో యిదే సమస్య. వాళ్లు అనేక తెగలు, తెగలుగా చీలి ఉంటారు. ఒకరిపై మరొకరికి అపనమ్మకం. అందరికీ కలిపి మైదాన ప్రాంతాల వారంటే పరమ అపనమ్మకం. దానికి తగ్గట్టే మైదాన ప్రాంతాల నుంచి వెళ్లిన వ్యాపారులు, కాంట్రాక్టర్లు అందరూ వాళ్లని మోసం చేస్తూ ఉంటారు. వాళ్లే కాదు సోషియాలజీ, ఆంత్రపాలజీ అంటూ వెళ్లిన అకడమీషియన్స్ కూడా వాళ్లకు అన్యాయం చేస్తారు.
మా కజిన్ ఆంత్రపాలజీలో రిసెర్చి చేశాడు. ఓ సారి చెప్పాడు. కొన్ని తెగల వాళ్లు మనలాటి వాళ్లను దగ్గరకు రానివ్వరట. విల్లంబులతో, విషబాణాలతో చంపేస్తారట. అలాటి ఒక తెగ వాళ్లను మచ్చిక చేసుకుని, విశ్వాసం చూరగొని ఒక సోషియాలజిస్టు బ్యాచ్ వాళ్లకు చేరువై వాళ్ల జీవితవిధానంపై అధ్యయనం చేసి పుస్తకం వెలువరించింది. అంతవరకు బాగానే ఉంది కానీ, యీ క్రమంలో కొందరు ఆ గిరిజన యువతులను లోబరుచుకుని గర్భవతులను చేశారు. దాంతో నెక్స్‌ట్ బ్యాచ్ వాళ్లు యింకో అధ్యయనం అంటూ రాగానే ఆ గిరిజనులు విల్లెక్కుపెట్టారు. మన దేశంలో అనే కాదు, ప్రపంచమంతా గిరిజనులతో యిలాటి వ్యవహారమే నడుస్తుంది. అండమాన్, నికోబార్ దీవుల్లో, అమెజాన్ అడవుల్లో కొన్ని తెగలు యిప్పటికీ ‘నాగరిక’ జీవితానికి దూరంగానే ఉన్నాయి. వాళ్ల జీవిత విధానాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించే బదులు మన విధానాలను వారిపై రుద్దడానికి ప్రయత్నించి వాళ్లకు మరింత దూరమౌతాం.
మా బ్యాంకింగ్ సెక్టార్‌లో జోకు లాటి వాస్తవం ఉంది. ఊళ్లలో రైతులకు యిచ్చినట్లు గానే కొండప్రాంతం వాళ్లకు ఋణాలపై గేదెలిచ్చి, పాడి పెంచుకుని అప్పు తీర్చండి అన్నారట. ఆర్నెల్లు పోయాక వెళ్లి గేదెలెలా ఉన్నాయని అడిగితే, ‘రుచిగా ఉన్నాయి’ అన్నారట. అదేమిటంటే వాళ్లకు పాలు తీయడం, వెన్న చేయడం వంటివి రావు. కోసుకుని తినేశారు. బాంకువాళ్లు ఘొల్లుమన్నారు. ఇదే కాదు, ఏదైనా నదీ ప్రాజెక్టు ఉందనుకోండి. గిరిజనులతోనే వస్తుంది గొడవ. కొండల్లో పారే నదికి ఆనకట్ట కడితే మైదాన ప్రాంతాల వారికి లాభం. కానీ కట్టేటప్పుడు కొన్ని గిరిజనులకు నష్టం. వాళ్ల గ్రామాలు మునిగి, వాళ్లు నిర్వాసితులవుతారు. మీకు యిళ్లు కట్టిస్తాం అని ప్రభుత్వం హామీ యిచ్చి మర్చిపోతుంది. కొత్త ప్రాజెక్టు కడతామనగానే వాళ్లు ఆయుధాలతో అడ్డుపడతారు. సందట్లో సడేమియా అన్నట్టు మావోయిస్టులు వాళ్లకి అండగా నిలుస్తారు. ప్రాజెక్టు ముందుకు సాగదు. ఆలస్యమౌడంతో ప్రాజెక్టు ఖర్చు పెరుగుతుంది. పోలవరం విషయంలో కూడా యిప్పటిదాకా ఆర్అండ్ఆర్ (రీహేబిలిటేషన్ అండ్ రీసెటిల్‌మెంట్) ఖర్చు ఎవరు పెట్టుకుంటారో తేలలేదు.
ఇలాటి గిరిజనులతో బ్రిటీషు వారు ఎలా వేగారు? సంతాలులతో చేదు అనుభవమైన తర్వాత వాళ్లు పర్వతప్రాంతాలను వాటి దారిన వాటిని వదిలేశారు. వాళ్లను అతి తక్కువగా పాలించారు. వాళ్ల సంస్కృతులను, సంప్రదాయాలను, గిరిజన ఆచారాలను మన్నిస్తూ, తెగ పెద్దలను ఆదరిస్తూ కాలక్షేపం చేశారు. వాళ్ల ప్రాంతాల్లో రైలు మార్గాలు వేసినప్పుడు, రోడ్లు వేసినప్పుడు ఆ పని కాంట్రాక్టర్లకు అప్పగించేవారు. ఆ కాంట్రాక్టర్లు గూడెం పెద్దలను ఖుషామత్ చేసి, గిరిజనులను దోపిడీ చేసినా, ప్రభుత్వం పట్టించుకునేది కాదు. మైదాన ప్రాంతాల్లో విద్య, వైద్యం, తపాలా, రవాణా అందిస్తున్నా వీటికి అందించేవారు కారు. ఆధునిక వ్యవసాయ రీతులు కూడా వీరికి నేర్పించలేదు. అందువలన వాళ్లు తరతరాలుగా వెనకబడి ఉండిపోయారు.
మన ప్రభుత్వం వచ్చాక వారిపై దృష్టి సారించి, జనజీవనంలో కలుపుదామని చూడడం జరిగింది. ఆ క్రమంలో చాలా యిబ్బందులు వచ్చాయి. వారి బాగు కోసం పంపిన ప్రభుత్వోద్యోగులు, కాంట్రాక్టర్లు, ఫారెస్టు ఆఫీసర్లు అందరూ దోపిడీకి పాల్పడి గిరిజనుల ఆగ్రహాన్ని పెంచారు. వీళ్ల దోపిడీని అరికడతామంటూ నక్సలైట్లు చొరబడి, అటవీ ప్రాంతాలను తమ స్థావరాలుగా మార్చుకుని, వాళ్ల తరహా దోపిడీ వారూ చేశారు. నక్సలైట్లు, పోలీసుల మధ్య గిరిజనులు నలిగారు, యిప్పటికీ నలుగుతున్నారు. దరిద్రంలోనే ఉండిపోయారు. ఇది దేశం మధ్యలో ఉన్న అటవీ ప్రాంతాల కథ అయితే, దేశసరిహద్దులలో ఉన్న అటవీ ప్రాంతాలకు విదేశీయుల వలసలు, అక్రమ రవాణాదారుల తాకిడి, వేర్పాటువాదం వంటి అదనపు సమస్యలున్నాయి.
ఎంత పోలీసు ఫోర్సు ఉన్నా, సైన్యం ఉన్నా ఆ పరిస్థితులను చక్కదిద్దడం సాధ్యం కాదు. ఎందుకంటే దుర్గమమైన ఆ అడవుల్లో దారులు తెలుసుకోవడం, అరణ్యవాసుల పోరాట శైలిని అర్థం చేసుకోవడం యివన్నీ చాలా కష్టం. ‘‘పుష్ప’’ సినిమాలో పోలీసులను, ఫారెస్టు ఆఫీసర్లను స్మగ్లర్లు ఎలా మోసం చేస్తారో చూపించారు కదా. స్మగ్లర్ వీరప్పన్ రెండు రాష్ట్రాల పోలీసులను దశాబ్దాల పాటు వణికించిన విషయం గుర్తుండి ఉంటుంది కదా! అందువలన ఏమీ చేయలేక చేతులు ముడుచుకుని వదిలేద్దామంటే అటవీ సంపద తక్కువేమీ కాదు. ప్రభుత్వం పరిరక్షించుకోక పోతే స్మగ్లర్లు దోచుకుంటారు. జంతువులను వేటాడి చంపుతారు. ఎవరైనా సిన్సియర్ ఆఫీసరు పరిస్థితి చక్కదిద్దబోతే రాజకీయ నాయకులు పని చేయనీయరు. వాళ్లూరుకున్నా, మావోయిస్టులు చంపివేస్తారు. మావోయిస్టులు గిరిజనులను వాడుకుంటారు తప్ప వారికి సాయపడరు. వారికి ఆయుధాలిచ్చి, తమ స్థావరాలకు కాపలాదారులుగా చేస్తారు. ఎవరైనా తిరగబడితే చేతులూ, కాళ్లూ నరికేస్తారు.
చెప్పవచ్చేదేమిటంటే, దేశంలో గిరిజన ప్రాంతాలు ఎప్పుడూ అన్‌మేనేజబుల్‌గానే ఉంటాయి. మతపరంగా కూడా చిక్కులుంటాయి. ప్రతీ తెగకూ వాళ్లవాళ్ల ఆరాధనా పద్ధతులుంటాయి. వాటి పుట్టలో వేలు పెడితే కరవక మానరు. ఇది గ్రహించి, ఇంగ్లీషు వాళ్లు ప్రభుత్వపరంగా కాకుండా, మతపరంగా క్రైస్తవ సన్యాసులను వాళ్ల దగ్గరకు పంపారు. వాళ్లు విద్య, వైద్యం పేరుతో వాళ్లను మంచి చేసుకుని, క్రైస్తవంలోకి మారమని ప్రోత్సహించారు. క్రైస్తవంలోకి మారినా తమ ప్రాచీనాచారాలను కొనసాగించ వచ్చని నచ్చచెప్పారు. అందుకే వాళ్లు స్టాండర్డ్ క్రైస్తవుల్లా ఉండరు. ఆ మాటకొస్తే స్టాండర్డ్ క్రైస్తవం అనేది ఎక్కడా లేదు. ప్రపంచమంతా వ్యాపించేందుకు క్రైస్తవులు స్థానికంగా ఉన్న ఆచారాలను కూడా ఆమోదిస్తూ పోయారు. అందుకే ఎన్నో భిన్నభిన్న మార్గాలు, వర్గాలు. గత 20, 30 ఏళ్లగా ఆరెస్సెస్ ‘వనవాసీ కళ్యాణ్’ వంటి కార్యక్రమాలతో క్రైస్తవ ఫాదిరీలకు దీటుగా అరణ్య ప్రాంతాల్లోకి విస్తరిస్తోంది. అందువలననే యిటీవల గిరిజన ప్రాంతాల్లో కూడా బిజెపి ఓట్లు తెచ్చుకుంటోంది. ఈశాన్య ప్రాంతాలలో బిజెపి ఎదుగుదలకు యీ విస్తరణ ఉపయోగ పడిందనుకోవచ్చు. అప్పటికే పాతుకుపోయిన క్రైస్తవ వర్గాలకు యిది రుచించక, ఘర్షణలకు దిగడం కూడా అర్థం చేసుకోవచ్చు.
ఇక్కడే యింకో మాట చెప్పాలి. వాళ్ల దైవారాధన విధానాలు మనకు అర్థం కావు. సనాతన మతం అని ఒక్క ముక్కలో అనేస్తాం కానీ ఒక్కో తెగది ఒక్కో పద్ధతి. నేను కలకత్తా బ్రాంచ్‌లో ఉండగా కొత్తగా చేరిన ఒకబ్బాయి మతం గురించి రికార్డు చేయవలసి వచ్చింది. అతను ఉత్తర బెంగాల్‌కు చెందిన గిరిజనుడు. నీ మతం ఏమిటంటే, ఏదో పేరు చెప్పాడు. ఆ పేరుతో కాలమ్ లేదు, హిందూ అని రాస్తామని అంటే నేను హిందువుని, క్రైస్తవుణ్ని ఏదీ కాదంటాడు. ఏం చేయాలని నన్ను అడిగారు. విగ్రహారాధన ఉందా అని అడిగాను. లేదన్నాడు. అయితే హిందూ అని రాయలేము, అదర్స్ అని రాయండి అన్నాను. మూడేళ్ల క్రితం ఆర్యసమాజ్ దయానంద సరస్వతి గారి పుస్తకం చదువుతూంటే ఒరిజినల్ హిందూమతంలో విగ్రహారాధన లేదని, అది జైనుల నుంచి వచ్చిందని తెలిసింది. అర్థమయ్యేదేమిటంటే, వాళ్లను అర్థం చేసుకోవడం మనకు సాధ్యమయ్యే పని కాదు.
ఇప్పుడు బిజెపి ప్రభుత్వం రాబోయే జనగణనలో 6 మతాలకు (హిందూ, ముస్లిం, క్రైస్తవ, జైన్, శిఖ్కు, బౌద్ధ) మాత్రమే కాలమ్స్ యిస్తుందని, ప్రతీ వాడూ వాటిలో ఏదో ఒకదాన్ని ఎంచుకుని తీరాలని వార్త వచ్చింది. ఇది తప్పకుండా గొడవలకు దారి తీస్తుంది. జొరాస్ట్రియన్ మతాన్ని ఆచరించే పార్శీలు ఏ ఆప్షన్ యిస్తారు? గిరిజన తెగలు యీ విషయంపై ఆందోళన చేయడం ఖాయం. ఇవన్నీ అనవసరపు గొడవలు. దారానికి మరిన్ని చిక్కుముళ్లు వేయడం. పైగా ఈశాన్య ప్రాంతాల్లోని రాష్ట్రాల్లో ఎప్పుడూ ఆందోళనలు చెలరేగుతూనే ఉంటాయి. అసాంలో చొరబాటుదారుల సమస్య, నాగాలాండ్ వాళ్లు విడిపోతామని గొడవ. మరో చోట మరో గొడవ. సైన్యబలంతో అణిచేద్దామని చూస్తే వాళ్లు తెచ్చిపెట్టే సమస్యలు యింకోలా ఉంటాయి.
ప్రతిపక్షంలో ఉండగా వీటిపై పెద్ద వివాదం లేవనెత్తే రాజకీయ పక్షాలు తాము అధికారంలోకి రాగానే మరో పల్లవి ఎత్తుకుంటాయి. మణిపూర్‌లో 2004లో సైన్యం స్త్రీలపై చేసే అరాచకాలు భరించలేక కొందరు స్త్రీలు నగ్నప్రదర్శన చేసి, తమ దుస్థితిని దేశం దృష్టికి తెచ్చారు. అప్పట్లో కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెసు ప్రభుత్వం ఉంది. బిజెపి ఘాటుగా విమర్శించింది. అంతెందుకు 2017 మార్చి వరకు పాలించిన కాంగ్రెసు హయాంలో మణిపూర్‌లో శాంతిభద్రతలకు విఘాతం కలిగినప్పుడు ప్రధాని మోదీ ‘రాష్ట్రంలో శాంతిని కాపాడలేని వారికి మణిపురను పాలించే అర్హత లేదు’ అంటూ ట్వీట్ చేశారు. మార్చిలో ప్రభుత్వం మారి బిజెపి ప్రభుత్వం వచ్చింది. కేంద్రంలోనూ బిజెపియే. ఇప్పుడు శాంతిభద్రతల స్థితి ఎలా ఉందో వేరే చెప్పనక్కరలేదు. ఇప్పుడు మోదీ మాట్లాడటం లేదు. ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. రేపు వాళ్లు మళ్లీ అధికారంలోకి వస్తే మౌనం పాటిస్తారు. వీళ్లు గొంతెత్తుతారు. రాజకీయలబ్ధి కోసం వీళ్లు చూస్తూంటే రావణకాష్టంలో రాష్ట్రం రగులుతూనే ఉంటుంది.
ఇక మణిపూర్ ప్రత్యేక పరిస్థితుల గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ మూడు తెగలు ప్రధానమైనవి. మైతేయీ (దీన్ని అనేక రకాలుగా రాస్తోంది మన తెలుగు మీడియా. నేను హిందీ మీడియాలో ఎలా రాస్తున్నారో చూసి దాన్ని తీసుకున్నాను), కుకీ, నాగా! కుకీ, నాగా రెండూ గిరిజన తెగలు. పరస్పరం కొట్టుకుంటూ ఉంటాయి. ప్రస్తుతం మాత్రం కుకీలు ఒక పక్క, మైతేయీలు మరో పక్క మోహరించారు. నాగా వాళ్లు తటస్థంగా ఉన్నారు. మైతేయీలందరూ హిందువులని, కుకీలందరూ క్రైస్తవులని, మనం హిందువులం కాబట్టి మైతేయీలకు అండగా ఉండితీరాలని తీర్మానించడానికి లేదు. మణిపూరు వారిలో 53% మంది మైతేయీలు. వారిలో 83% మంది హిందువులు, 8.4% ముస్లిములు (మైతేయీ పంగల్), 1% క్రైస్తవులు, తక్కినవారు సనామాహీలు (సనాతనులు). ఇక కుకీల్లో ఎక్కువమంది బాప్టిస్టు క్రైస్తవులు, ఏనిమిజం, జుడాయిజం, ఇస్లాం అవలంబించే వాళ్లు కూడా ఉన్నారు. నాగాల్లో 90% మంది బాప్టిస్టు క్రైస్తవులే కానీ, స్థానిక ఆచారాలు కూడా కలగలసిన క్రైస్తవమది.
పేరుకి 16 జిల్లాలు, 60 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి కానీ జనాభా చూడబోతే 28.56 లక్షలు. (2011 ప్రకారం) మన దగ్గర ఓ జిల్లా జనాభాతో సమానమనుకోవచ్చు. విస్తీర్ణం 22,327 చ.కి.మీ. 650 చ.కి.మీ. విస్తీర్ణం ఉన్న గ్రేటర్ హైదరాబాదులో 68 లక్షల జనాభా నివసిస్తారు. మరి మణిపూరులో అంత తక్కువ మంది ఎందుకుంటారు? అంటే దానిలో 90% నివాసయోగ్యం కాని పర్వతప్రాంతమే. 1864 చ.కి.మీ.లు, ఐదు జిల్లాలు ఉన్న ఇంఫాల్ లోయలోనే 60% మంది ఉంటారు. వీరిలో మైతేయీలు ఎక్కువ. తక్కిన 40% జనాభా చుట్టూ ఉన్న కొండల్లోను (పది జిల్లాలుంటాయి), 232 చ.కి.మీల విస్తీర్ణం ఉన్నన జిరిబిమ్ లోయలోను (ఇది మరొక జిల్లా) ఉంటారు.
అందుకే మొత్తం 60 నియోజకవర్గాల్లో 40 లోయలో 20 పర్వతాల్లో ఉన్నాయి. లోయలో మైతేయీలు మెజారిటీగా ఉన్నారు కానీ గిరిజనులూ ఉన్నారు. పర్వత ప్రాంతాల్లో మెజారిటీలో ఉన్నది కుకీలు. జనాభాలో మైతేయీలు 53% మంది ఉంటే, 24% మంది నాగాలు. కుకీలు 16%. యితరులు 7%. మతప్రకారం విభజించి చూస్తే హిందువులు 41%, క్రైస్తవులు 41%, సనామాహీలు 8%, ముస్లిములు 8% ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి ఇబోబి సింగ్, ప్రస్తుత ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ యిద్దరూ మైతేయీలే!
మైతేయీలందరూ బిజెపి వైపు, యితర తెగలు కాంగ్రెసు వైపు ఉన్నారన్న అర్థంలో చాలామంది మాట్లాడుతున్నారు. రాజకీయపరమైన విషయాలు తెలుసుకుంటే వాస్తవ పరిస్థితి అర్థమౌతుంది. 2002 నుంచి ఇబోబి సింగ్ ముఖ్యమంత్రిగా, 10 ఏళ్లు పాలించిన కాంగ్రెసుకు హిందువుల్లో, క్రైస్తవుల్లో ఎల్లెడలా మద్దతు వుంటూ వచ్చింది. ఇబోబిపై నాగా వ్యతిరేకి అనే ముద్ర ఉంది. ఇబోబి వృద్ధుడైనా ఎవర్నీ పైకి రానివ్వకపోవడంతో అతని ముఖ్య అనుచరుడిగా ఉన్న బీరేన్ సింగ్ తిరుగుబాటు చేసి బిజెపిలో చేరాడు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెసుకు 35% ఓట్లు 28 సీట్లు వస్తే బిజెపి 36% ఓట్లు, 21 సీట్లు తెచ్చుకుంది. మెజారిటీ 3 సీట్లు తగ్గాయని కాంగ్రెసు తటపటాయిస్తూంటే బిజెపి చాకచక్యంగా యితరులను కలుపుకుని, అధికారంలోకి వచ్చింది.
2022 వచ్చేసరికి బిజెపి సొంతంగా 32 సీట్లు గెలుచుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రతిపక్షాలకు 28 సీట్లు వచ్చాయి. మైతేయీలు మెజారిటీలో ఉన్న లోయలోని 40 స్థానాల్లో బిజెపికి 2017లో 16 వస్తే 2022లో 26 వచ్చాయి. 14 యితరులకు వచ్చాయి. కాంగ్రెసుకి వచ్చిన అయిదూ యిక్కడే వచ్చాయి. హిందువులందరూ కట్టకట్టుకుని బిజెపి వైపు ఉన్నారని, యితర మతస్తులు లేరని అనుకునేవారు 2022 ఎన్నికల సందర్భంగా జరిగిన ఇండియా టుడే-ఏక్సిస్ మై ఇండియా సర్వేను చూడాలి. దాని ప్రకారం జనాభాలో 41% ఉన్న హిందువుల్లో 52% బిజెపికి, 12% కాంగ్రెసుకు, 19% ఎన్‌పిపికి, 17% యితరులకు ఓట్లేశారు. జనాభాలో 41% ఉన్న క్రైస్తవుల్లో 33% బిజెపికి, 20% కాంగ్రెసుకు, 8% ఎన్‌పిపికి, 20% ఎన్‌పిఎఫ్‌కు, 19% యితరులకు వేశారు. జనాభాలో 8% ఉన్న ముస్లిముల్లో 9% బిజెపికి, 40% కాంగ్రెసుకు, 34% ఎన్‌పిపికి, 11% యితరులకు వేశారు. జనాభాలో 8% ఉన్న ఇతరులలో (సనామాహీలు) 47% బిజెపికి, 18% కాంగ్రెసుకు, 19% ఎన్‌పిపికి, 16% యితరులకు వేశారు.
ఇప్పటి పరిస్థితికి దారి తీసిన ఒక్కో కారణాన్ని పరిశీలిద్దాం. ఈ వ్యాసంలో ఎస్టీ (షెడ్యూల్ ట్రైబ్) హోదా గురించి రాస్తాను. తర్వాతి వాటిల్లో భూవివాదాలు, విదేశీ చొరబాట్లు, గంజాయి సాగు, ఘర్షణలు, రాజకీయ జోక్యం యిలాటి వాటి గురించి రాస్తాను. ఎస్టీ గురించి చెప్పాలంటే ఎస్సీ, ఎస్టీ గుర్తింపు అనగానే ఆర్థికంగా, సామాజికంగా వెనకబడిన వారు అనే భావం వస్తుంది. వారికి పాపం ఏదో ఒక రకమైన సహాయం చేయాలి కదా అనిపిస్తుంది. మైతేయీల విషయానికి వస్తే వీరి ప్రధానవృత్తి వ్యవసాయం. వీరిలో ధనవంతులు ఎక్కువ. రాజకీయంగా చూస్తే మొత్తం 60 మంది ఎమ్మెల్యేలలో 40 మంది వీళ్లే. అంటే జనాభాలో 53%, పదవుల్లో 67%. రాజకీయాధిపత్యం ఎక్కువ కాబట్టి వాళ్ల మాటే చెల్లుతుంది. వీళ్లను చూస్తే తక్కిన తెగల వారికి అసూయ, అపనమ్మకం.
తమకు 1949 అక్టోబరులో మణిపూర్ ఇండియన్ యూనియన్‌లో కలిసేవరకు తమకు ఎస్టీ హోదా ఉంది కాబట్టి దాన్ని పునరుద్ధరించాలని మైతేయీల డిమాండు. అప్పుడు హోదా ఉందని గట్టిగా చెప్పలేమంటున్నారు కొందరు. షెడ్యూల్డ్ అనే పదమే భారత రాజ్యాంగంతో వచ్చింది. బ్రిటిషు హయాంలో డిప్రెస్‌డ్ క్లాసెస్ పేరుతో రిజర్వేషన్లు ఉండేవి. అప్పట్లో వీరి పరిస్థితి ఏమిటో, ఎస్టీ (ఉండి ఉంటే) హోదా వలన కలిగే సౌకర్యాలు ఏముండేవో తెలియదు. ఇప్పుడు ఎస్టీ హోదా వలన కలిగే లాభమేమిటి? మణిపూరు జనాభా మన జిల్లాలంత ఉంటుందని రాశానుగా. దానిలో ప్రభుత్వోద్యోగాలు ఎన్ని ఉంటాయి? విద్యాలయాలు ఎన్ని ఉంటాయి? వాటిల్లో ఎస్టీకి రిజర్వ్ చేసిన వాటిలో వీళ్ల వాటా ఎంత పెరుగుతుంది?
ప్రస్తుతం మణిపూర్‌లో ఎస్సీలకు 2%, ఎస్టీలకు 31% (కుకీ, నాగా జాతులకు చెందిన 30 గిరిజన కులాలకు కలిపి యిది ఉంది. 2011 లెక్కల ప్రకారం వీరు జనాభాలో 41% ఉన్నారు), ఒబిసిలకు 17%, అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్లు ఉన్నాయి. ఓపెన్‌గా ఉన్నవి 40%. ఈ మైతేయీలు జనాభాలో 53% ఉన్నారు. వారిలో చాలామందికి ఒబిసి హోదా ఉంది. కొందరికి ఎస్సీ హోదా ఉంది. 53% మందికి ఎస్టీ హోదా యిచ్చేస్తే ఇక రాష్ట్రంలో ఎస్టీ కాని వాళ్లెవరో వెతుక్కోవాల్సిందే! అప్పుడు రిజర్వేషన్ పొంది ప్రయోజనం ఏముంది? ఇది వాళ్లకు తెలియదా? మైతేయీలు కొందరు కలిసి షెడ్యూల్డ్ ట్రైబ్స్ డిమాండ్ కమిటీ ఆఫ్ మణిపూర్ (ఎస్‌టిడిసిఎమ్) తమకు ఎస్టీ హోదా కావాలని 2012 నుంచి డిమాండ్ చేస్తూ వచ్చారు. ఎందుకు అంటే వాళ్ల సంస్కృతి, భాష, గుర్తింపు కాపాడ బడడానికట!
మణిపూర్‌లోని గిరిజన జాతులు మైతేయీల వాదనను ఖండిస్తూ వచ్చారు. మణిపూర్ భాషను యిప్పటికే రాజ్యాంగం 8వ షెడ్యూల్‌లో చేర్చారు. మైతేయీలలో కొందరు ఒబిసిలుగా, మరి కొందరు ఎస్సీలుగా గుర్తింప బడ్డారు. ఇంకొందరు అగ్రవర్ణ పేదల కోటాలో రిజర్వేషనూ పొందుతున్నారు. ఇక ఎస్టీ హోదా కూడా యిచ్చేస్తే వాళ్లకు రాజకీయంగా పలుకుబడి విపరీతంగా ఉంది కాబట్టి, యితర ఎస్టీలకు ఏమీ లేకుండా మొత్తమంతా తన్నుకు పోగల సమర్థులు వారు అని వీళ్ల వాదన. ఈ తేనెతుట్టను కదిపితే పెద్ద తలకాయనొప్పి అనుకుని రాష్ట్ర ప్రభుత్వాలు ఊరుకున్నాయి. 2013లో యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ ఎఫయిర్స్ మైతేయీలను ఎస్టీలుగా గుర్తించాలనే డిమాండు ప్రస్తావిస్తూ దాన్ని సమర్థించ గలిగిన సోషియో, ఎకనమిక్ డేటా పంపండి అని మణిపూర్ ప్రభుత్వానికి రాసింది. పార్లమెంటు కానీ, రాష్ట్రపతి కానీ దీనిపై ఒక నిర్ణయం తీసుకోవాలంటే యీ డేటా ఉండాలి.
కానీ కాంగ్రెసు పాలనలో ఉన్న రాష్ట్రప్రభుత్వం మిన్నకుంది. 2017లో బిజెపి ప్రభుత్వం వచ్చినా, 2022లో మళ్లీ వచ్చినా యిదే పరిస్థితి కొనసాగింది. ఎందుకంటే మైతేయీలను ఎస్టీలుగా జస్టిఫై చేయడం కష్టం. వాళ్ల చరిత్ర ఏమిటంటే చైనా నుంచి పఖాంగ్బా (క్రీ.పూ.1445-1405) అనే వీరుడు ఇంఫాల్‌కు 35 కి.మీ.ల దూరంలో ఉన్న కౌబ్రూ కొండలకు వచ్చి అక్కడ నింగ్‌తౌజా శకాన్ని ప్రారంభించాడు. తర్వాత నాలుగు శకాలను చరిత్ర గుర్తించింది. డ్రేగన్ వంటి సర్పరూపంలో ఉండే మూర్తిగా పఖాంగ్బా దేవుడిగా కొలవబడ్డాడు. మైతేయీలు హిందువులుగా మారిన తర్వాత కూడా అతని ఆరాధన మానలేదు.
మొదట్లో మైతేయీలది సనామాహీ మతమే ఐనా క్రీ.శ. 15వ శతాబ్దంలో మైతేయీ రాజ్యంలోకి హిందూమతం ప్రవేశించింది. కానీ వృద్ధి చెందినది మాత్రం 18వ శతాబ్దంలో బెంగాల్ సుల్తాన్ల ధాటికి బెదిరి అక్కణ్నుంచి వలస వచ్చిన వైష్ణవ సన్యాసుల ద్వారానే. మైతేయీలలో ఏడు తెగలున్నాయి. మూడు ప్రధాన కులాలున్నాయి. మొదటిది బామన్లు అనే బ్రాహ్మణులు. వీళ్లు భారతదేశంలోని యితర ప్రాంతాల నుంచి వలస వచ్చి స్థానికులను పెళ్లాడి పూజారులుగా, ఉత్సవ సమయాల్లో వంటవాళ్లుగా స్థిరపడ్డారంటారు. రెండోది క్షత్రియులు. వీళ్లు సాధారణంగా సింగ్ అని పేరు చివర చేర్చుకుంటారు. రాజవంశీకులు మాత్రం రాజకుమార్ అని చేర్చుకుంటారు. ఇక తక్కిన కులాలు లోయిలీ, చక్పాలు. వీళ్లలో హిందువులు ఉన్నారు, సనామాహీలు ఉన్నారు. హిందువులకైతే ఎస్సీ గుర్తింపు ఉంది. మైతేయీలలో అగ్రవర్ణస్తులకు ఎస్టీ గుర్తింపు యిష్టం లేదు. ఇలాటి నేపథ్యం ఉన్న మైతేయీలను ఎస్టీల్లో చేర్చమని ఏ ప్రభుత్వం మాత్రం కన్విన్సింగ్ డేటా పంపగలదు?
ప్రభుత్వం నిరాసక్తత చూసి మైతేయీ ట్రైబల్ యూనియన్ (ఎమ్‌టియు) సభ్యులు కొందరు హైకోర్టులో పిటిషన్ పడేశారు. ఈలోగా 2022 సెప్టెంబరులో ఛత్తీస్‌గఢ్, తమిళనాడు, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్‌లలోని ఒక్కో కులానికి యీ హోదా యిచ్చింది కానీ మైతేయీలకు యివ్వలేదు. ఎమ్‌టియు వారు వేసిన పిటిషన్‌ను విచారించిన మణిపూరు హైకోర్టు మార్చి 27న ప్రభుత్వానికి ఆదేశాన్ని జారీ చేసింది. మైతేయీలు 2013 నుంచి దీని కోసం అడుగుతున్నా అడుగు ముందుకు పడటం లేదని, వారి విజ్ఞాపనలను రాష్ట్ర ప్రభుత్వం ట్రైబల్ ఎఫయిర్స్ మినిస్ట్రీకి పంపి చేతులు దులుపుకుంటోందని, యిప్పటికైనా గట్టి సిఫార్సు చేయాలని, అది కూడా నాలుగు వారాల్లో చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనికి కారకుడు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న ఎంవి మురళీధరన్. తమిళుడైన యీయన మద్రాసు హైకోర్టులో న్యాయవాదిగా పనిచేసి, 2016లో మద్రాసు హైకోర్టులో జజ్ అయి, 2019లో మణిపూర్ హైకోర్టుకి జజ్‌గా బదిలీ అయ్యాడు. ప్రస్తుతం తాత్కాలిక చీఫ్ జస్టిస్‌గా ఉన్నాడు. ఏప్రిల్ 19న బహిర్గతం అయిన యీ తీర్పును సుప్రీం కోర్టు తీవ్రంగా తప్పుపట్టడంతో వివాదంలో చిక్కుకున్నాడు.
ఏ కులాన్నయినా ఎస్టీ జాబితాలో చేర్చాలన్నా, తీసివేయాలన్నా ఆ అధికారం పార్లమెంటుకి, రాష్ట్రపతికి ఉంది తప్ప యిలాటి ఆదేశాలు యిచ్చే హక్కు హైకోర్టుతో సహా వేరెవరికీ లేదు అని సుప్రీం కోర్టు ‘‘స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర వెర్సస్ మిలింద్’’ (2000) తీర్పును ఉటంకించింది. చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ హైకోర్టు తీర్పును ‘కంప్లీట్లీ ఫాక్యువల్లీ రాంగ్’ అన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 342 ను విస్మరించింది అన్నారు. ప్రతీ రాష్ట్రంలోను ఎస్టీలు ఎవరో రాష్ట్రపతి నోటిఫై చేస్తారని ఆర్టికల్ 342(1) చెప్పింది. ఆ నోటిఫికేషన్ తర్వాత ఎస్టీ జాబితాలో చేర్చే లేదా తీసివేసే అధికారం పార్లమెంటుకి ఉందని ఆర్టికల్ 342(2) చెప్పింది. ఎవర్ని చేర్చాలో, మానాలో నిర్ణయించే అధికారం రాష్ట్రప్రభుత్వానికి లేదు. వాళ్లను ఆదేశించడం హైకోర్టు చేసిన పొరపాటు అన్నారు చంద్రచూడ్.
ఇలా అంటూనే హైకోర్టు డివిజన్ బెంచ్ దగ్గర రివిజన్ పిటిషన్ పెండింగులో ఉంది కాబట్టి, సింగిల్ జజ్ యిచ్చిన ఆదేశంతో నష్టపోయినవారు వారివారి వాదనలను వినిపించవచ్చు అని మే 17న ఆదేశం యిచ్చారు. దాంతో ఎంటియు వారు రివ్యూ పిటిషన్ వేశారు. దాన్ని ఆధారం చేసుకుని మణిపూరు హైకోర్టు జూన్ 19న రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు దీనిపై మీ అభిప్రాయం చెప్పండి అంటూ నోటీసులు పంపింది.
1953లో కాకా కాలేల్కర్ నేతృత్వంలో మొదటి బ్యాక్‌వర్డ్ క్లాసెస్ కమిషన్ ఏర్పడింది. ఏయే కులాల వారు ఎలాటి గుర్తింపు కోరుకుంటున్నాయో చెప్పాలని అన్ని రాష్ట్రాలను కోరడం జరిగింది. కమిషన్ అంటరానితనం ఆధారంగా ఎస్సీ హోదా యిచ్చింది. మణిపూరు మైతేయిలలో కొందరు ద్విజులు తమను అంటరు కాబట్టి ఎస్సీ హోదా యివ్వాలని అడిగారు, పొందారు కూడా. ఎస్టీల విషయానికి వస్తే ఏ మతాన్ని ఆచరించినా సరే, కొండల్లో నివాసమున్నా, మైదాన ప్రాంతాల్లో ఉన్నా సరే ప్రధాన జీవనస్రవంతిలో కలవకుండా తమదైన ప్రత్యేక జీవనవిధానం కలిగి ఉండాలనే కమిషన్ నియమం పెట్టింది. ఆ విధంగా చూస్తే మైతేయీల జీవనవిధానం మైదాన ప్రాంతాల వారిలాగానే ఉంటుంది తప్ప భిన్నంగా ఏమీ ఉండదు. అప్పుడు మైతేయీలు ఎస్టీ హోదా కోరుకోలేదు.
నిజానికి మైతేయీలు గిరిజనులను చిన్నచూపు చూస్తారు. మణిపూరు భాషలో గిరిజనులను ‘హావో’ అంటారు. మైతేయీలను గిరిజనులను తీసిపారేయడానికి ‘హావో తూ’ అనే పదాన్ని ఉపయోగిస్తారట. అలాటిది యిప్పుడు వారే తమకు హావోలుగా గుర్తింపు కావాలని అడగడం చిత్రంగా ఉందంటున్నారు, గిరిజనులు. ప్రస్తుత సమస్య ప్రజ్వరిల్లడానికి కారణభూతమైన అగ్గిరవ్వ మైతేయీలను షెడ్యూల్ కాస్ట్‌గా గుర్తించడం అనుకుంటే, దానికోసం యింత మొండిపట్టు ఎందుకు అనే ప్రశ్న ఉత్పన్నమౌతుంది. వాళ్లు ఎస్టీ హోదా అడిగేది సీట్ల కోసమో, ఉద్యోగాల కోసమో కాదు. భూమి కోసం! దానికి సంబంధించిన సంగతులన్నీ ‘‘మణిపూర్‌లో భూవివాదాలు’’ అనే వ్యాసంలో చెప్తాను.
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఆగస్టు 2023)