ఆన్లైన్లో సినిమా టికెట్ల అమ్మకంపై మంత్రి పేర్ని నాని బాంబు పేల్చారు. ఆన్లైన్లో సినిమా టికెట్లను ప్రభుత్వమే అమ్మాలనే విషయమై అధ్యయనానికి ఓ కమిటీ వేసింది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు నానాయాగీ చేస్తున్నాయి. దీంతో మంత్రి పేర్ని నాని ప్రతిపక్షాల విమర్శలకు దీటైన సమాధానం ఇచ్చారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సంచలన విషయాలు చెప్పారు.
ఆన్లైన్లో ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్లు విక్రయించాలని అనుకోవడంపై విపక్ష నేతలు అనవసర విమర్శలు చేస్తున్నారన్నారు. సినిమా టికెట్లను ప్రభుత్వమే అమ్మాలనే విషయంపై ఇంత వరకు ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని పేర్ని నాని స్పష్టం చేశారు. ఈ అంశంపై కమిటీలు వేశామని.. అధ్యయనం జరుగుతోందని మంత్రి చెప్పారు.
ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయడమే టీడీపీ పనిగా పెట్టుకుందని మంత్రి పేర్ని నాని విమర్శించారు. ప్రభుత్వం టిక్కెట్ల వ్యాపారం చేస్తుందని ప్రతిపక్షం నోటికొచ్చినట్లు మాట్లాడుతోందని మండిపడ్డారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ఆన్లైన్లో టికెట్ల అమ్మకం జరగాలని స్పష్టం చేశారు. ప్రజలకు మంచి చెయ్యడం కోసమే ప్రభుత్వం ఈ ఆలోచన చేసిందన్నారు.
ఆన్లైన్లో టికెట్ల అమ్మకాలపై దుష్ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు. రాష్ట్ర ప్రభుత్వం మంచి పని ఏది చేపట్టినా విషం చిమ్మడానికి కొందరు తయారయ్యారని విరుచుకుపడ్డారు. మనిషి బలంగా ఉంటే బాహుబలి అంటున్నారని, అదే తెలివి ఎక్కవ వుంటే మేధోబలి అనాలేమో అని వ్యంగ్యంగా అన్నారు.
త్వరలో సినీ పరిశ్రమ పెద్దలతో సమావేశమై వారి సలహాలు, సూచనలు తీసుకుంటామన్నారు. మరీ ముఖ్యంగా ఆన్లైన్లో సినిమా టికెట్లు అమ్మాలని సినీ ప్రముఖులే కోరారని ఆయన బాంబు పేల్చారు. సినీ పెద్దల సూచనలనే ప్రభుత్వం పరిశీలించిందని మంత్రి తేల్చి చెప్పారు.
ఆన్లైన్లో ప్రభుత్వం సినిమా టికెట్ల అమ్మకంతో బ్లాక్ టిక్కెట్లు అరికట్టొచ్చన్నారు. ఈ విషయమై చర్చించేందుకు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యజమానులతో త్వరలోనే చర్చిస్తామని మంత్రి నాని వెల్లడించారు.