విశాఖ బౌద్ధులకు అతి ముఖ్య కార్యక్షేత్రం. ఇప్పటికి మూడు వేల సంవత్సరాలక్రితం బౌద్ధం విశాఖ తీరంలో భాసిల్లింది అని చారిత్రక ఆధారాలు ఎన్నో ఉన్నాయి. విశాఖ జిల్లాలో అనకాపల్లి దగ్గర బొజ్జన్నకొండతో పాటు భీమిలీ సమీపంలోని తొట్ల కొండ బావికొండలలో బౌధ్ధ బిక్షువులు విడిది చేసి తమ ప్రస్థానాన్ని సాగించారు అని చరిత్ర చెబుతోంది. ఇదిలా ఉంటే ఏపీ టూరిజం ఇపుడు బుద్ధం శరణం గచ్చామీ అంటోంది.
విశాఖలో ఎన్నో ప్రాకృతిక అందాలు ఉన్నాయి. అలాగే ఎన్నో పుణ్య క్షేత్రాలు కూడా ఉన్నాయి. వాటితో పాటు బౌద్ధ క్షేత్రాలను కూడా వెలుగులోకి తీసుకురావడం ద్వరా పర్యాటకానికి కొత్త సొబగులు అద్దాలని ప్రణాళికలు రచిస్తున్నారు. భీమిలీ బీచ్ రోడ్డులోని తొట్లకొండ మీద కట్టడాలని పునరుద్ధరిస్తున్నారు.
ఇందుకోసం కొన్ని నిర్మాణ పనులను చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ తొట్ల కొండను ప్రసిద్ధ టూరిజం స్పాట్ గా మారుస్తామని వెల్లడించారు. ఆర్టీసీ బస్సులను కూడా విశాఖ నగరం నుంచి తొట్ల కొండ దాకా నడుపుతామని కూడా ప్రకటించారు.
అంతే కాదు టూరిజం స్పాట్స్ గా విశాఖలోని గుర్తించిన ప్రాంతాలకు రవాణా సదుపాయం కల్పిస్తామని చెప్పారు. ఇక ఏపీవ్యాప్తంగా ఉన్న పర్యాటక క్షేత్రాల వివరాలతో ప్రత్యేక యాప్ ని కూడా తయారు చేస్తున్నట్లుగా మంత్రి చెప్పారు. మొత్తం మీద చూసుకుంటే బౌద్ధ రామాలను కూడా టూరిజం స్పాట్స్ గా చేసుకుని పర్యాటక శాఖకు కొత్త కళ తేవాలని ఆ శాఖ భావిస్తోంది.