తిరుమల తిరుపతి దేవస్థాన ధర్మకర్తల మండలిలో సభ్యత్వం అంటేనే ఎమ్మెల్యే పదవితో సమానంగా చాలామంది భావిస్తారు. రకరకాల కారణాల వలన ఎమ్మెల్యే స్థాయి ఉన్నప్పటికీ తమ నియోజకవర్గాలలో టికెట్ పార్టీ కోసం త్యాగం చేసినవారు, ఎమ్మెల్యే స్థాయిని మించి పార్టీ కోసం నిత్యం పాటుపడుతూ ఉండేవారు… ఇలాంటి వారిలో చాలామంది నామినేటెడ్ పోస్టుల వ్యవహారం వస్తే టిటిడి బోర్డు సభ్యత్వాన్ని కోరుకుంటారు. ప్రభుత్వాలు ఎంతగా సర్దుబాటు చేసినప్పటికీ ప్రతిసారి కనీసం పదిమంది అయినా, సభ్యత్వం దొరకకుండా అసంతృప్తితో మిగిలిపోతూ ఉంటారనేది సత్యం.
ఇకపై అలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు. టీటీడీ బోర్డు సభ్యుల సంఖ్యను 50 శాతానికి పైగా పెంచుతూ జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ బుధవారం నిర్ణయం తీసుకుంది. ఇన్నాళ్లు 16 మంది సభ్యులతో ఉన్న టిటిడి బోర్డులో, ఇక మీదట 25 మంది సభ్యులు ఉంటారు. వీరు కాకుండా స్థానిక ఎమ్మెల్యే టీటీడీ ఈవో తుడా చైర్మన్ తదితర ఎక్స్ అఫిషియో సభ్యులు అదనం. తిరుమల తిరుపతి దేవస్థాన ధర్మకర్తల మండలికి జంబో బోర్డు ఏర్పాటు కానున్నది.
అధికారంలోకి వచ్చిన వెంటనే నామినేటెడ్ పోస్టులు విషయంలో కూడా త్వరితగతిన నిర్ణయాలు తీసుకుంటూ… ఆశావహులు నిరీక్షణ పర్వంలో ఎక్కువకాలం వేచిఉండే అవసరం రాకుండా, జగన్మోహన్ రెడ్డి దూకుడు ప్రదర్శిస్తున్నారు. అధికారంలోకి రాగానే ఆయన టీటీడీ చైర్మన్ గా వైవి.సుబ్బారెడ్డిని నియమించారు. చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్న వెంటనే ఎల్ వన్, ఎల్ టు దర్శనాలు రద్దు దగ్గరనుంచి అనేకానేక సంచలన నిర్ణయాలను సుబ్బారెడ్డి తీసుకుంటున్నారు.
అయితే ఇప్పటిదాకా పూర్తిస్థాయి బోర్డు మాత్రం ఏర్పాటు కాలేదు. ఇవాళో రేపో బోర్డు సభ్యుల నియామకం ప్రకటన వస్తుందంటూ రెండు వారాలుగా పుకార్లు పుడుతూనే ఉన్నాయి. అయితే జగన్ సర్కారు బోర్డు సభ్యుల సంఖ్యను 25కు పెంచలదలచుకున్నదని కూడా వార్తలు వచ్చాయి. అందుకు చట్ట సవరణ అవసరం కావడంతో.. బుధవారం నాటి భేటీలో క్యాబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. బోర్డు సభ్యుల నియామకం పై జగన్ కసరత్తు ఇప్పటికే పూర్తయిందని, నేడు రేపు బోర్డు ప్రకటన కూడా ఉంటుందని అమరావతి వర్గాల ద్వారా తెలుస్తోంది.