సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 350 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది. నార్త్ లో ఏకంగా 102 కోట్ల రూపాయల నెట్ వచ్చింది. నైజాంలో బాహుబలి-2 రికార్డులు తిరగరాసింది. ఓవర్సీస్ లో 3 మిలియన్ మార్క్ కు చేరువైంది. ఇవన్నీ మొన్నటివరకే. నిన్నట్నుంచి సాహో సినిమా చతికిలపడింది. ట్రేడ్ ఊహించినట్టే జరిగింది. గల్ఫ్ మినహాయిస్తే, వరల్డ్ వైడ్ ఈ సినిమాకు వసూళ్లు తగ్గిపోయాయి.
నార్త్ లో ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లోకి ఎంటరైంది. కానీ దీనివెనక ఆందోళన చెందాల్సిన విషయం ఒకటి ఉంది. నిన్న సాహో సినిమా హిందీ వెర్షన్ కు కేవలం 9 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చాయి. ఈరోజు నుంచి శనివారం వరకు ఇలాగే డౌన్ ఫాల్ ఉంటుందని అక్కడి ట్రేడ్ భావిస్తోంది. ఓవరాల్ గా హిందీ వెర్షన్ 200 కోట్ల మార్క్ టచ్ చేయలేదని, 150 కోట్లకు అటుఇటుగా ముగిసే ఛాన్స్ ఉందని అంచనా వేస్తోంది.
ఇక నైజాంలో కూడా ఇదే పరిస్థితి. ఇన్నాళ్లు రికార్డు వసూళ్లతో దూసుకుపోయిన ఈ సినిమాకు నైజాంలో నిన్న కేవలం కోటి 33 లక్షలు షేర్ మాత్రమే వచ్చింది. తాజా వసూళ్లతో నైజాంలో ఈ సినిమాకు దాదాపు 25 కోట్ల రూపాయల షేర్ వచ్చినప్పటికీ… రానున్న రోజుల్లో ఆక్యుపెన్సీ పెరగడం కష్టమే. నెగెటివ్ టాక్ భారీ ప్రభావం చూపిస్తోంది. అటు ఓవరాల్ గా చూసుకుంటే.. తెలుగు రాష్ట్రాల్లో సాహో సినిమాకు మంగళవారం 3 కోట్ల 56 లక్షల రూపాయల షేర్ మాత్రమే వచ్చింది.
తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను 125 కోట్ల రూపాయలకు అమ్మితే, ఇప్పటివరకు 69 కోట్ల రూపాయలు వసూలు చేసింది. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 56 కోట్ల రూపాయలు కలెక్ట్ చేయాల్సి ఉంది. ఓవర్సీస్ లో ఇప్పటికే ఈ సినిమాకు వసూళ్లు తగ్గిపోయాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది 3 మిలియన్ మార్క్ టచ్ చేస్తుంది కానీ, అంతకుమింది భారీ స్థాయిలో వసూళ్లు రావడం కష్టమంటున్నారు విశ్లేషకులు.
నిన్నటి వసూళ్లతో కలుపుకొని ఈ సినిమాకు 27 లక్షల 72వేల డాలర్లు వచ్చాయి. రెవెన్యూ పరంగా చూసుకుంటే.. ఇప్పటివరకు ఈ సినిమా 55శాతం రికవరీ అయింది. ఓవరాల్ గా రికవర్ అవ్వాలంటే సినిమా కనీసం మరో 2 వీకెండ్స్ వరకు థియేటర్లలో ఉండాలి.