నటి కంగనా కోర్టు విషయంలో కూడా తనదైన ధోరణిని అవలంభిస్తున్నట్టుగా ఉంది. తన సాటి నటీమణులను కించపరచడానికి కానీ, అడ్డగోలుగా మాట్లాడటానికి కానీ వెనుకాడని కంగనా ఇప్పటికే రకరకాలుగా విమర్శలను ఎదుర్కొంటూ ఉంది. తనను తాను అభినవ జయలలితగా అభివర్ణించుకుంటున్న కంగనా తన నోటి తీటతో కోర్టు కేసులను కూడా ఎదుర్కొంటూ ఉంది.
రచయిత జావేద్ అక్తర్ ముంబై కోర్టులో కంగనాపై ఒక పిటిషన్ దాఖలు చేసి కొంతకాలమైంది. ఒక ఇంటర్వ్యూలో ఆమె అకారణంగా తనపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై జావేద్ పిటిషన్ దాఖలు చేశారు. అది విచారణ అయితే జరుగుతోంది కానీ, కంగనా మాత్రం కోర్టుకు హాజరు కావడం లేదు.
ఇప్పటికే కోర్టు నోటీసులు జారీ చేసినా.. కంగనా మాత్రం హాజరు కాలేదు. తాజాగా ఆ పిటిషన్ మరోసారి విచారణకు రాగా.. ఆ సమయంలో కంగనా న్యాయవాది స్పందిస్తూ, ఆమెకు కరోనా సింప్టమ్స్ ఉన్నాయంటూ కోర్టుకు విన్నవించాడు.
తలైవి సినిమా ప్రమోషన్ కోసం కంగనా చాలా చోట్లకు తిరిగిందని, ఈ నేపథ్యంలో ఆమెకు కరోనా సింప్టమ్స్ కనిపిస్తున్నాయని, అందుకే ఆమె కోర్టుకు హాజరుకావడం లేదని తెలిపాడు. మరో ఏడురోజుల గడువును కోరాడు. అయితే కంగనా తీరుపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణకు హాజరు కాకపోవడంపై తీవ్రంగా స్పందించింది. తదుపరి విచారణకు హాజరు కాకపోతే.. అరెస్టుకు ఆదేశించాల్సి ఉంటుందంటూ కోర్టు హెచ్చరించింది.
ఈ నెల 20వ తేదీన తదుపరి విచారణ జరుగుతుందని, ఆ రోజున కంగనా కోర్టుకు హాజరు కావాల్సిందేనని, లేకపోతే అరెస్టు ఆదేశాలను ఇస్తామని కోర్టు వ్యాఖ్యానించింది. ఇలా కంగనా తన గైర్హాజరీతో కోర్టు ఆగ్రహానికి గురయినట్టుగా ఉంది. మరి అనుచితంగా మాట్లాడటం ఒక ఎత్తు అయితే, కోర్టు విచారణకు హాజరు కాకపోవడం మరో హైట్ లాగుంది. మరి ఈ వ్యవహారాన్ని కంగనా ఎలా డీల్ చేస్తుందో!