తెలుగుదేశం పార్టీపై అధినేత చంద్రబాబు పట్టు తప్పుతోందా? దాదాపు పాతికేళ్లుగా పార్టీలో ఏకఛత్రాధిపత్యాన్ని కొనసాగించిన చంద్రబాబు కు ఇప్పుడు పార్టీ పట్టు చిక్కడం లేదా? ఒకవేళ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు స్థాపించినది అయితే ఆయన పట్టు ఇప్పుడు కూడా తప్పేది కాదేమో!
ఎంత కాదన్నా.. తెలుగుదేశం వ్యవస్థాపకుడు చంద్రబాబు కాదు! ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని చంద్రబాబు గుంజుకున్నారు. దానిపై ఎన్నేళ్లే ఆధిపత్యం చేసినా.. పార్టీ నాయకత్వం ఎంతగా ఆయనను నెత్తికెత్తుకున్నా.. అంతిమంగా అది గుంజుకున్న పార్టీనే కానీ, సొంత పార్టీ కాదు కదా! ఆ ప్రభావమే ఇప్పుడు కనిపిస్తున్నట్టుగా ఉంది.
ఇటీవలే బుచ్చయ్య చౌదరి ఎపిసోడ్ టీకప్పులో తుపానులా ముగిస్తే.. అనంతపురం ఎపిసోడ్ తో పార్టీ పరువు రోడ్డున పడింది. తెలుగుదేశం నేతల బాగోతాన్ని తెలుగుదేశం నేతలే బయటపెట్టుకునే పరిస్థితి వచ్చిందక్కడ.
మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డికి రెండు వందల యాభై ఎకరాల మేరకు ఆస్తులున్నాయని, వాటిని కాపాడుకోవడానికి ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలతో కుమ్మక్కయ్యారని జేసీ వర్గం ఫేస్ బుక్ కు ఎక్కి కూస్తోంది. కియా కంపెనీ ఏర్పాటు సమయంలో పల్లె చేతివాటం చూపించారనే ఆరోపణలు పాతవే. వాటినే ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి ఫేస్ బుక్ దళం హైలెట్ చేసింది.
ఇక జేసీపై తెలుగుదేశం వాళ్లు కౌంటర్ అటాక్ ఇచ్చారు. నువ్వు పార్టీలోకి ఎప్పుడొచ్చావ్? అంటూ మొదలుపెట్టారు. తద్వారా జేసీకి కూడా తత్వం బోధపడాల్సిందే, తాము ఎన్నేళ్లు టీడీపీలో ఉన్నా.. పరాయివాడిగానే చూస్తారనే క్లారిటీ ఆయనకూ వచ్చి ఉండొచ్చు. ఇలా టీడీపీ నేతలు పరస్పరం విమర్శలు చేసుకోవడం ఆ పార్టీనే బజారున పెడుతూ ఉంది. ఈ విమర్శల విషయంలో కూడా రోడ్డుకెక్కారు.
మరి ఇంత జరుగుతుంటే చంద్రబాబు ఏం చేస్తున్నట్టు? అంటే.. ఏమీ లేదు! చంద్రబాబు చేయడానికి ఏమీ మిగులుతున్నట్టుగా లేదు. అంతా టీడీపీ నేతలే ఒకరికొకరు చేసుకుంటున్నారు. చంద్రబాబు కేరాఫ్ హైదరాబాద్ అన్నట్టుగా మారారు. లోకేషేమో తిరుగుతున్నారు కానీ, ఆయన తిరగడంలో నిజాయితీ లేదు.
తను తిరుగుతున్నట్టుగా అనిపించుకోవడానికి తిరుగుతున్నారు. అలాంటి లోకేష్ పార్టీపై పట్టు బిగిస్తాడనుకోవడం కేవలం భ్రమ మాత్రమే. ఈ పరిస్థితుల్లో పార్టీ నేతలు నువ్వెంత అంటే.. నువ్వెంత అని హెచ్చరించుకుంటున్నారు. ఒకరి బాగోతాన్ని మరొకరు బయటపెట్టుకుంటున్నారు.
ఇది ఇంతటితో అయిపోయిందనుకోవడానికి కూడా ఏమీ లేదు. ముందు ముందు ఈ రచ్చలు మరింతగా రేగడం, ఇప్పటికే ఒకరిపై ఒకరు లోలోపల కత్తులు దూసుకుంటున్న నేతలు రచ్చకెక్కడం జరుగుతుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.