ఏంటమ్మా అంటూనే హీరో శ్రీకాంత్‌ను 'మా' అధ్యక్షుడు నరేశ్ దెప్పి పొడిచారు. సున్నితంగానే తీవ్ర హెచ్చరిక చేయడం టాలీవుడ్లో సంచలనం రేకెత్తిస్తోంది. 'మా' ఎన్నికల హడావుడి మొదలైనప్పటి నుంచి సినీ పరిశ్రమలో నిత్యం ఏదో ఒక వివాదం చెలరేగుతూనే ఉంది. 'మా' ఎన్నికల్లో ప్రయోజనాలు పొందేందుకు కొన్ని సంఘటనలను కొందరు తమకు అనుకూలంగా మలుచుకునే క్రమంలో వివాదాలు సృష్టిస్తున్నారనే అభిప్రాయాలు లేకపోలేదు.
తాజాగా తనను ఉద్దేశించి హీరో శ్రీకాంత్ చేసిన వ్యాఖ్యలపై నరేశ్ తనదైన స్టైల్లో గట్టిగా హితబోధ చేశారు. యువ హీరో సాయిధరమ్ తేజ్ ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నరేశ్ సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో విడుదల చేశారు.
సాయిధరమ్ తేజ్, తన కుమారుడు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్పారు. ప్రమాదం జరిగిన కొన్ని గంటల ముందు తమ ఇంటి నుంచే సాయిధరమ్ తేజ్ వెళ్లినట్టు నరేశ్ వెల్లడించారు. ఈ సందర్భంగా కోట శ్రీనివాసరావు, బాబు మోహన్ కుమారులు ఇలాగే బైక్ ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోవడం గురించి నరేశ్ ప్రస్తావించారు.
దీనిపై హీరో శ్రీకాంత్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ''బైట్ ఇచ్చేటప్పుడు ఓసారి ఆలోచించి మాట్లాడండి. నరేష్ ఇచ్చిన బైట్ కరెక్ట్ కాదనిపించింది. ఎందుకనో ఈ టైమ్‌లో చనిపోయిన వారి గురించి ప్రస్తావించకుండా ఉంటే బాగుండేదేమో.. అని నాకు అనిపించింది'' అని శ్రీకాంత్ ఇచ్చిన బైట్పై నరేశ్ దీటైన సమాధానం ఇచ్చారు.
''శ్రీకాంత్ ఏంటమ్మా బైట్ అలా ఇచ్చావ్. సాయిధరమ్ తేజ్ ఆ సమయంలో స్పీడ్‌లో లేడు. బురద ఉండడం వల్ల జారిపడ్డాడు. నేను చెప్పిన బైట్‌లో తేడాను సరిదిద్దుకున్నాను. బైట్స్ ఇచ్చేటప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండు. నేను చనిపోయినవాళ్ల గురించి మాట్లాడలేదు. జనరల్‌గా ఇండస్ట్రీలో జరిగిన వాటి గురించి మాట్లాడాను. బైక్‌లను మనం చాక్లెట్స్లాగా పిల్లలకు ఇవ్వం. ప్రమాదాలు ఎవరికైనా జరుగుతాయి. కానీ నువ్వ ఇచ్చిన బైట్ వల్ల హర్ట్ అయ్యాను. నా కళ్ల ముందు నువ్వు హీరోగా వచ్చి మంచి సినిమాలు చేసి ఎదిగావ్. మా ఎన్నికల్లో నా ఎదురు ప్యానల్ ద్వారా పోటీ చేసి ఓడిపోయావ్? దయచేసి ఇంకోసారి ఇలాంటి బైట్స్ ఇవ్వవద్దు'' అని నరేశ్ స్పందించారు.
నరేశ్ తాజా బైట్పై శ్రీకాంత్ అభిమానులు, ప్రకాశ్‌రాజ్ ప్యానల్ సభ్యులు రగిలిపోతున్నారు. నరేశ్ హెచ్చరికపై ప్రతి స్పందన ఎలా వుంటుందో చూడాలి.