సీబీఐ కోర్టును నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు అవమానించారా? అంటే ఔననే సమాధానం వస్తోంది. జగన్, విజయ సాయిరెడ్డి బెయిల్ రద్దుపై సీబీఐ కోర్టు తీర్పు ఇవ్వడానికి ఒక్కరోజు ముందు ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.
సీబీఐ కోర్టు తీర్పు ఇవ్వకుండా నిరోధించాలని, మరో కోర్టుకు బదిలీ చేయాలని రఘురామకృష్ణంరాజు కొత్త పల్లవి అందుకున్నారు. ఈ మేరకు ఆయన తెలంగాణ హైకోర్టులో మంగళవారం పిటిషన్ దాఖలు చేయడం చర్చకు దారి తీసింది.
జగన్, విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ రఘురామకృష్ణరాజు వేర్వురుగా పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్లపై సీబీఐ కోర్టు విచారణ పూర్తి చేసింది. తీర్పును రిజర్వ్ చేసింది. రేపు తీర్పు వెలువరిస్తానని ప్రకటించింది. అయితే ఈ కేసుపై విచారణ జరుగుతుండగానే తన పిటిషన్‌ను కొట్టివేశారంటూ ముఖ్యమంత్రి జగన్ సొంత పత్రిక సాక్షిలో వార్తలు ప్రచారం కావడంపై రఘురామ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దానిపై విచారణ జరగాల్సి ఉంది.
ఈ నేపథ్యంలో బెయిల్ రద్దు పిటిషన్లపై సీబీఐ కోర్టు రేపు ఉత్తర్వులు ఇవ్వకుండా ఆదేశాలు జారీ చేయాలని ఆయన తెలంగాణ హైకోర్టును కోరారు. కేసును హైదరాబాద్, తెలంగాణలోని ఇతర క్రిమినల్ కోర్టుకు బదిలీ చేయాలని.. దీనిపై మధ్యంతర ఆదేశాలు ఇవ్వాలని న్యాయస్థానాన్ని విజ్ఞప్తి చేశారు.
ఇదిలా వుండగా సీబీఐ కోర్టును కాదని, ఇతర క్రిమినల్ కోర్టుకు బదిలీ చేయాలని రఘురామ పిటిషన్ వేయడంపై న్యాయవర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.
సాక్షికి న్యాయస్థానం ముందే లీక్ చేసిందని రఘురామ నమ్ముతున్నట్టుగా ఉందని, ఆయనే పిటిషనే చెబుతోందని అంటున్నారు. తన పిటిషన్‌తో సీబీఐ కోర్టుపై అనుమానాన్ని క్రియేట్ చేసేలా రఘురామ వ్యవహరిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పిటిషన్‌పై కోర్టు ఎలా స్పందిస్తుందో కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది.