టికెట్ ఇచ్చినా కూడా వికెట్ పడేలాగా ఉందే..!

మైనంపల్లి హనుమంతరావు లాంటి నాయకుడిని ఏ పార్టీ కూడా అంత సులభంగా వదులుకోవడానికి ఇష్టపడదు. ఏకంగా 70 వేల పైచిలుకు మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తిని వదులుకోవడానికి ఎవరు మాత్రం సుముఖంగా ఉంటారు. ఆయన…

మైనంపల్లి హనుమంతరావు లాంటి నాయకుడిని ఏ పార్టీ కూడా అంత సులభంగా వదులుకోవడానికి ఇష్టపడదు. ఏకంగా 70 వేల పైచిలుకు మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తిని వదులుకోవడానికి ఎవరు మాత్రం సుముఖంగా ఉంటారు. ఆయన ప్రస్తుతం భారత రాష్ట్ర సమితి తరఫున మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 

అయితే కల్వకుంట్ల చంద్రశేఖర రావు తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించడానికి కేవలం కొన్ని గంటల ముందు మైనంపల్లి ఎగరేసిన తిరుగుబాటు బావుటా, ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. భారాసలో ఒక కీలక నాయకుడు అయిన హరీష్ రావును ఎడాపెడా దూషించిన మైనంపల్లి, తన కొడుకుకు మెదక్ టికెట్ ఇవ్వకపోతే తాను కూడా పోటీ చేసేది లేదని తేల్చి చెప్పారు. సిటింగ్ ఎమ్మెల్యేగా ఆయన పేరును కేసీఆర్ మళ్ళీ ప్రకటించారు కానీ, ఆయన కోరుకున్నట్టుగా కొడుకుకు టికెట్ దక్కలేదు. ఆయన ఇప్పుడు ఏమి చేస్తారనేది ప్రశ్నార్ధకంగా మారుతోంది.

మైనంపల్లి హనుమంతరావు తన కొడుకు మైనంపల్లి రోహిత్ కు మెదక్ ఎమ్మెల్యే టికెట్ కావాలని కోరుకున్నారు. అయితే అక్కడ పద్మాదేవేందర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆమెను తప్పించి మరీ తన కొడుకుకు టికెట్ ఇస్తారని ఆయన ఎలా ఊహించారో తెలియదు కానీ చాలా గట్టిగానే పట్టుబట్టారు.

మధ్యలో హరీష్ రావుతో ఏర్పడిన విభేదాల పర్యవసానంగా ఆయనపై తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. హరీష్ రావు మెదక్ లో పెత్తనం చేస్తున్నారని, డిక్టేటర్లా ప్రవర్తిస్తున్నారని ఒకప్పట్లో ఆయన గతిలేనితనం గురించి ఎగతాళి చేస్తూ మైనంపల్లి మాట్లాడడం వివాదాస్పదం అవుతోంది. 

అలాగే సిద్దిపేటలో హరీష్ రావును ఓడించేందుకు ప్రయత్నిస్తానని, ఇంకొకసారి ఎన్నికల్లో సిద్దిపేట నుంచే పోటీ చేస్తానని కూడా హనుమంతరావు అంటున్నారు. ఈ ఎన్నికలలో తన కొడుక్కి టికెట్ ఇవ్వకపోతే తామిద్దరం ఇండిపెండెంట్లుగా బరిలోకి దిగుతామని ఆయన హెచ్చరించారు.

ఆయన మాటలేవీ అసలు చెవిన వేసుకోనట్లుగా గులాబీ దళం జాబితా విడుదల జరిగిపోయింది. సిటింగ్ ఎమ్మెల్యేగా ఆయనకు టికెట్ ధృవీకరించిన కేసీఆర్, ఆయన కొడుకు రోహిత్ గురించి పట్టించుకోలేదు. మెదక్ లో పద్మాదేవేందర్ రెడ్డి కే మళ్లీ టికెట్ కేటాయించారు. ఈ నేపథ్యంలో మైనంపల్లి తన ప్రతిజ్ఞకు కట్టుబడి తండ్రీ కొడుకులు ఇద్దరూ ఇండిపెండెంట్లుగా బరిలోకి దిగుతారా.. ఆయన సిద్దిపేట నుంచి పోటీ చేసి హరీష్ ను ఓడించడానికి ప్రయత్నిస్తారా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది. 

జాబితాలు వెలువడిన తర్వాత టికెట్ దక్కని నాయకులు తిరుగుబాటు ప్రకటించి ఫిరాయించడం సహజం. అయితే మైనంపల్లి హనుమంతరావు విషయంలో టికెట్ దక్కినా కూడా ఆయన ఫిరాయిస్తారేమో అనే అభిప్రాయం ప్రజలకు కలుగుతోంది.