ఉన్నట్లుండి.. తెలుగు జనాలు రామోజీతో వున్నారనే అర్థం వచ్చేలా ఓ హ్యాష్ ట్యాగ్. దాన్ని పట్టుకుని సోషల్ మీడియా హ్యాండిల్స్ లో పోస్టులు. ఆ పై ఆ పోస్టులను వాట్సాప్ లో చలామణీ చేయడం. ఈ తెలుగు అనే పదం చాలా చిత్రమైనంది.
తెలుగు రాష్ట్రాల్లోనే పది కోట్ల మంది ప్రజలకు అది వర్తిస్తుందని అందరూ అనుకుంటారు. కానీ ‘తెలుగు జాతి’.. ’తెలుగు బిడ్డ’.. ’తెలుగు పంచెకట్టు’..’తెలుగు రైతు కుటుంబం’ ఇలాంటివి అన్నీ తమకే స్వంతం అని ఒక వర్గం చాలా సగర్వంగా భావిస్తుంటుంది. పైగా కొన్ని పత్రికలు కూడా ఆ వర్గాన్ని అన్యాపదేశంగా ప్రస్తావించడానికి ఇలాంటి పదాలు వాడుతుంటుంది.
సరే, ఆ సంగతి ఇప్పుడెందుకు అంటే… అగ్రీ గోల్డ్ మీదో, మరో ఇతర సంస్థ మీదో కేసులు పెడితే అక్కడ తెలుగు అన్న పదం రాదు. రామోజీ కనుక తెలుగు పదం కచ్చితంగా జోడించాల్సిందే.
మార్గదర్శి వేరు.. ఈనాడు వేరు.. రామోజీ వేరు.. ఇది లీగల్‌గా వాస్తవం. కానీ ఇక్కడ ఎలా వుంటుంది అంటే అవసరం అయితే వేరు వేరు అంటారు.. అవసరం అయితే అంతా ఒకటే అంటారు. మార్గదర్శి మీద కోట్ల లాభాలు వస్తున్నాయి ఈనాడు అని ఎవరైనా అన్నారు అనుకోండి. ఈనాడు.. మార్గదర్శి ఒకటి ఎలా అవుతాయి. అవి వేరు వేరు కంపెనీలు అంటారు. లేదూ మార్గదర్శిలో సోదాలు అనుకోండి.. ఈనాడు మీద దాడి అంటారు.
ఒక వ్యక్తి కి సంఘంలో గౌరవ పలుకుబడులు వున్నాయి. పదవులు వుండొచ్చు. బిరుదులు వుండొచ్చు. అలాంటి వ్యక్తికి ఓ హోటల్ వ్యాపారం వుంటే, దాని మీద రెయిడింగ్ జరిగితే అది ఆ వ్యక్తి మీద దాడి అంటూ చిత్రీకరిస్తారా? అంటే ఆ హోటల్ లో అక్రమ కార్యకలాపాలు జరిగినా వదిలేయాల్సిందేనా?
అసలు అర్థం కాని విషయం ఏమిటంటే.. ఓ పక్క న్యాయస్థానాల్లో ఫైట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు వచ్చిన ప్రతి ఆదేశం మార్గదర్శికి అనుకూలంగానే వుంది. మరోపక్క కేసులు వాదనల్లో వున్నాయి. ఇక ఎందుకు ఈ ‘తెలుగు యాగీ’ అంతా. పేజీలకు పేజీలు నింపడం. అంటే అమరావతి స్కీము మాదిరి గానేనా ఇది కూడా. అంటే ఇలాంటి ప్రచారం ద్వారా ఇటు ప్రజలను అటు కోర్టులను ప్రభావితం చేయాలనుకుంటున్నారా?
ఈనాడు ఎందుకు రాస్తోంది అన్నది జనాలకు చెప్పాలన్నది జగన్ ప్లాన్.
జగన్ ఎందుకు చేస్తున్నారన్నది జనాలకు తెలియాలన్నది ఈనాడు ఆలోచన.
ఇదో తరహా యుద్దం. ఈ యుద్దంలోకి తెలుగుగౌరవం.. తెలుగు గర్వకారణం.. తెలుగుజాతి అనే పదాలు ఎందుకు వస్తున్నాయి.. ఎందుకు అవసరం పడుతున్నాయి అన్నది అనుమానం.
ఇక్కడ ఒకటే అనుమానమే. జగన్ మొండివాడు కన్నా బలవంతుడు. ఒక్కరోజైనా లోపల పెట్టి పగ తీర్చుకుంటాడేమో అనే భయం. అలాంటి దారుణమైన పరిస్థితి రాకూడదనే ప్రయత్నమా ఇదంతా. ఎందుకంటే ఇప్పటి వరకు పత్రికలోనే రాస్తూ వచ్చారు. పొలిటికల్ పార్టీ హ్యాండిల్స్ మాత్రం కాస్త ట్వీట్ లు వేసేవి.
ఇప్పుడు దాన్ని దాటి వాట్సాప్ ల్లో కి ఈ ‘తెలుగు తనానికి..తెలుగు జాతికి..తెలుగు గౌరవానికి’ మద్దతు అనే వరకు వచ్చింది.
లాభం లేకుండా ఎవరూ ఏ పనీ చేయరు. అందుకే ఇంత హడావుడి చేయడం వెనుక సమ్ థింగ్.. సమ్ థింగ్ అని అనుమానపడాల్సి వస్తోంది.