అసలు అభ్యర్థులు ఉన్నారా చంద్రబాబూ?

‘లేస్తే మనిషిని కాను..’ అన్న సామెత చందంగా ఉన్నాయి చంద్రబాబు ప్రగల్భాలు. తెలంగాణ ఎన్నికలలో ఈసారి తాము ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోవడం లేదని, తెలంగాణ వ్యాప్తంగా ఒంటరిగా మాత్రమే పోటీ చేస్తామని చంద్రబాబు…

‘లేస్తే మనిషిని కాను..’ అన్న సామెత చందంగా ఉన్నాయి చంద్రబాబు ప్రగల్భాలు. తెలంగాణ ఎన్నికలలో ఈసారి తాము ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోవడం లేదని, తెలంగాణ వ్యాప్తంగా ఒంటరిగా మాత్రమే పోటీ చేస్తామని చంద్రబాబు నాయుడు చాలా ఆర్భాటంగా ప్రకటిస్తున్నారు. 

నిజానికి చంద్రబాబు నాయుడు ఎవరితోనూ పొత్తు పెట్టుకోను అనే సంగతి ఏమోగానీ, ఆయనతో చేయి తెలపడానికి తెలంగాణలో ఎవ్వరూ సంసిద్ధంగా లేరు అనేది స్పష్టం. 2018 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పతనాన్ని నిర్దేశించిన తర్వాత ఐరన్ లెగ్ అనే ముద్ర చంద్రబాబు మీద సుస్థిరంగా పడిపోయింది. 

ఇటీవల కాలంలో కాసాని జ్ఞానేశ్వర్ పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత కాస్త హడావుడి చేస్తున్నారు. దానిని నమ్ముకుని తెలంగాణలో ఒంటరిగానే పోటీ చేస్తాం.. అన్ని చోట్ల పోటీ చేస్తాం అని చంద్రబాబు అనగలుగుతున్నారు గాని, నిజానికి తెలుగుదేశానికి తెలంగాణలో కనీసం 119 మంది అభ్యర్థులు ఉన్నారా అనేది ప్రజలలో సందేహంగా మిగులుతోంది.

భారత రాష్ట్ర సమితి సారధి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చాణక్య తెలివితేటలకు తెలుగుదేశం పార్టీ దాదాపుగా ఖాళీ అయిపోయింది. పార్టీ మారితే తమ తమ నియోజకవర్గాలలో ఎమ్మెల్యే టికెట్లు పొందడానికి అవకాశం లేని కొందరు నాయకులు మాత్రమే ఎటూ ఫిరాయించలేక తెలుగుదేశంలో కొనసాగుతున్నారు. వారిలో ఏ ఒక్కరైనా సరే ఖచ్చితంగా విజయాన్ని నమోదు చేసే గెలుపు గుర్రం అని చెప్పడానికి అవకాశం లేదు. 

ప్రస్తుతం రాష్ట్ర శాసనసభలో తెలుగుదేశం ప్రాతినిధ్యం సున్నా. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా తెలుగుదేశం తరఫున గెలిచిన వారంతా భారాసలో చేరిపోయిన తర్వాత.. రేవంత్ రెడ్డి లాంటి మరికొందరు కాంగ్రెసు తీర్థం పుచ్చుకున్న తర్వాత.. తెలుగుదేశం పరిస్థితి దిక్కులేకుండాపోయింది. ఇప్పుడు ఒంటరిగా పోటీచేస్తాం అనే మాట చంద్రబాబు అనడం కామెడీగా ఉంది.

నిజానికి తెలంగాణలో తెలుగుదేశం అంత ఘోరంగా కాకపోయినా.. భారతీయ జనతా పార్టీకి కూడా రాష్ట్రవ్యాప్తంగా సమానమైన బలం లేదు. జనసేన తెలుగుదేశం కంటె ఘోరం. ఈ పార్టీలు వారికి తెలంగాణ కంటె బెటర్ గా బలమున్న ఏపీలో పొత్తులు పెట్టుకోవడానికి ఉత్సాహపడుతున్నాయే గానీ.. తెలంగాణ ఎన్నికల గురించి పట్టించుకోవడం లేదు. ఇక్కడ కలవాలని అనుకోవడం లేదు. 

ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని ప్రతిజ్ఞలు చేస్తున్న పవన్ కల్యాణ్.. తెలంగాణలో తమ పార్టీ ఖచ్చితంగా పోటీచేస్తుందని అంటున్నారు గానీ.. తెలుగుదేశంతో జట్టుకట్టే ఆలోచన వారికి లేదు. 

ఏపీలో తెలుగుదేశం బలాన్ని పవన్ కల్యాణ్ వాడుకోవాలనుకుంటున్నారరే తప్ప అది ప్రేమ, బాబు గారి సామర్థ్యం మీద నమ్మకం కాదు. అలాంటి నమ్మకమే అయిఉంటే తెలంగాణలో కూడా కలిసి పోటీచేసేవారే. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు తాము ఒంటరిగా పోటీచేస్తాం అని అనడం తప్ప గత్యంతరం లేదు. కాకపోతే.. ఆయనకు 119 మంది అభ్యర్థులున్నారా? అనేదే డౌటు!