స్పీకర్ తమ్మినేని సీతారాంపై తాను చేసిన వ్యాఖ్యలపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు వెనక్కి తగ్గారు. ప్రివిలేజ్ కమిటీ ఎదుట విచారణకు హాజరై పరిస్థితిని కూల్ చేసేలా అచ్చెన్నాయుడు వ్యవహరించారని చెప్పొచ్చు.
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిస్థితులు తమకు అనుకూలంగా లేకపోవడంతో పాటు ఇటీవలి పరిణామాలు అచ్చెన్నాయుడిని ఆత్మ పరిశీలనలో పడేసినట్టు ఆయన తాజా పశ్చాత్తాపమే తెలియజేస్తోంది. గతంలో స్పీకర్ తమ్మినేనిపై మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అనుచిత వ్యాఖ్యలు చేయడంపై ఎమ్మెల్యే జోగి రమేష్ ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశారు.
గతంలో విచారణకు అచ్చెన్నాయుడు హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో మరోసారి ప్రివిలేజ్ కమిటీ విచారణకు నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో చైర్మన్ కాకాణి గోవర్ధన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశానికి అచ్చెన్నాయుడు హాజరయ్యారు.
స్పీకర్‌పై తన వ్యాఖ్యలకు అచ్చెన్నాయుడు క్షమాపణ చెప్పారు. ఈ విషయాన్ని సమావేశం అనంతరం ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ కాకాణి మీడియాకు చెప్పారు. అచ్చెన్నాయుడు తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారన్నారు. అచ్చెన్నాయుడి వివరణను కమిటీ సభ్యులకు పంపిస్తామని కాకాణి తెలిపారు. కమిటీ సభ్యుల అభిప్రాయం మేరకు తదుపరి నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు.
విచారణకు హాజరైన అనంతరం అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ… తన వ్యాఖ్యలు బాధకలిగించి ఉంటే విచారం వ్యక్తం చేస్తున్నట్టు తెలిపానన్నారు అదే విషయాన్ని కమిటీ ముందు చెప్పానని అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఎలాంటి బేషజాలు లేకుండా విచారం వ్యక్తం చేశానని చెప్పానన్నారు.