ఆంధ్రప్రదేశ్‌లో ఆయన ఎమ్మెల్యే కాదు. కానీ త్వరలో ఏర్పాటు చేయనున్న జగన్ కేబినెట్‌లో ఆయనకు మంత్రి పదవి ఫిక్స్ అయిందనే వార్తలు వైసీపీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు అత్యంత సన్నిహితుడైన ఆయనకు ఈ దఫా మంత్రి వర్గ విస్తరణలో సముచిత స్థానం కల్పించనున్నారని సమాచారం.
జగన్ ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని ప్రజలకు వివరించడంలో ఆయన మొదటి వరుసలో వున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే జగన్ ప్రభుత్వానికి ఆయన కర్త, కర్మ, క్రియ అని చెబుతుంటారు. ప్రభుత్వ జీతం తీసుకుంటూ, రాజకీయాలు మాట్లాడ్డం ఏంటనే విమర్శలను ఎదుర్కొంటున్న ఆ నేత ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
మరోవైపు ఇవే ఆరోపణలను సాకుగా తీసుకుని ఆయనపై ఇటీవల న్యాయస్థానంలో పిటిషన్ కూడా వేశారు. దీంతో భవిష్యత్‌లో అలాంటి అడ్డంకుల నుంచి విముక్తి కలిగించేందుకు సదరు నేతకు జగన్ మంత్రి పదవి కట్టబెట్టనున్నారనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది.
రెండున్నరేళ్ల తర్వాత మంత్రి వర్గంలో మార్పలు చేస్తానని గతంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మొదటి విడత కేబినెట్ పదవీ కాలం ముగింపు సమీపిస్తోంది. దీంతో కొత్త కేబినెట్‌పై ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధే కాని “సజ్జనుడి” పేరు తెరపైకి రావడం ఆసక్తికర పరిణామంగా చెప్పొచ్చు.