ముఖ్యమంత్రి అయిన తర్వాత.. జగన్మోహన రెడ్డి దూకుడుగా తీసుకుంటున్న అనేకానేక నిర్ణయాలకు ఆయన మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. అవినీతిని ఎండగట్టడంలో గానీ, సంక్షేమం విషయంలో గానీ.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం లభించింది. బుధవారం అమరావతిలో జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
వీటన్నింటిలో ముఖ్యమైనది… పోలవరం పనుల విషయంలో తీసుకున్న నిర్ణయం. కాంట్రాక్టులను రద్దుచేస్తూ తీసుకున్న నిర్ణయానికి ఇప్పటికీ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉన్నట్లుగా కేబినెట్ తీర్మానంతో స్పష్టమైంది. హైడల్ ప్రాజెక్టు నిర్మాణానికి పిలిచిన టెండర్లను కూడా రద్దుచేశారు. ఈ విషయం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ కేబినెట్ నిర్ణయం తీసుకోవడం విశేషం. అలాగే రివర్స్ టెండర్లను ఆహ్వానించడానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. హైడల్ ప్రాజెక్టు టెండర్లను ఆపాలని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయినా సరే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాంట్రాక్టరుకు ఇచ్చిన అడ్వాన్సులను రికవరీ చేయాలని కూడా నిర్ణయించారు.
మిగిలిన నిర్ణయాల్లో మావోయిస్టులపై నిషేధాన్ని మరో ఏడాది పొడిగించారు. ఆశావర్కర్లకు మూడువేలుగా ఉన్న వేతనాన్ని పదివేలకు పెంచే నిర్ణయం కూడా పూర్తయింది. మచిలీపట్నం పోర్టుకు కేటాయించిన 412.5 ఎకరాల భూ కేటాయింపులను కూడా రద్దుచేసి.. ఆ భూమిని వెనక్కు తీసుకోవాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ పోర్టు కాంట్రాక్టును ఇదివరకే రద్దుచేసిన సంగతి కూడా తెలిసిందే.
కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయాల్లో పోలవరం టెండర్లకు సంబంధించినది మాత్రం అంతో ఇంతో వివాదానికి దారితీసే అవకాశం ఉంది. వ్యవహారం కోర్టు పరిధిలో ఉండడం దీనికి ఒకకారణం. రీటెండర్ల ప్రకటనను కూడా ఆన్‌లైన్ లో ఇప్పటిదాకా అప్‌లోడ్ చేయకుండా అదికారులు ఆగారు. సాంకేతిక కారణాల వల్ల ఆగినట్లుగా వివరణ ఇచ్చారు. 4వ తేదీ తర్వాత చేస్తామని అన్నారు.
ఇప్పుడు కేబినెట్ ఆమోదం కూడా రావడంతో ఇక టెండర్ల ప్రక్రియ మొదలయ్యే అవకాశం ఉంది. కోర్టులో మాత్రం ఈ వ్యవహారం నడుస్తూనే ఉంది. ఇది ముందు ముందు ఏ మలుపులు తిరుగుతుందో చూడాలి.