తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న తాజా పరిణామాలు చూస్తుంటే లోకేష్ ని చంద్రబాబు పూర్తిగా పక్కన పెట్టినట్టు కనిపిస్తోంది. పార్టీలో అన్నీ తానై వ్యవహరిస్తున్న చంద్రబాబు కనీసం లోకేష్ కి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వడంలేదు. కేవలం ట్విట్టర్ కే పరిమితం చేసి, ఐదేళ్లు తానే పోరాటం చేయాలని డిసైడ్ అయ్యారు. ఐదేళ్లపాటు కొడుకుకి వ్యూహాత్మక విరామం ప్రకటించారు చంద్రబాబు.
ఎన్నికల ఫలితాల తర్వాత జనంలోకి వెళ్లి లోకేష్ ఏమైనా మెరుగుపడతాడని అనుకున్నా అది సాధ్యంకాదని తేలడంతో.. తానే పార్టీని మోయాలని నిర్ణయించుకున్నారు బాబు. పార్టీలో జరుగుతున్న కీలక సమావేశాలకు లోకేష్ మొక్కుబడిగా హాజరవుతున్నారే కానీ.. కనీసం తన ఉనికి చాటే ప్రయత్నం చేయడంలేదు. పార్టీ విషయాలను చెప్పడానికైనా, ప్రతిపక్షాన్ని విమర్శించడానికైనా లోకేష్ కి మైకివ్వడంలేదు. చంద్రబాబే ఆ పని పూర్తి చేస్తున్నారు.
లోకేష్ ని బాబు వ్యూహాత్మకంగానే వచ్చే ఎన్నికల వరకు పక్కనపెట్టారని తెలుస్తోంది. అధికారంలో ఉండి ఎన్ని తప్పులు చేసినా, ఎంత అవినీతికి పాల్పడినా ఇప్పుడు చంద్రబాబుని చూస్తుంటే అయ్యో పాపం అనిపించక మానదు. ఓవైపు పార్టీ తన జీవితకాల దారుణ పరాభవాన్ని ఎదుర్కోవడం, మరోవైపు అందివస్తాడనుకున్న కొడుకు పనికిరాడని తేలిపోవడంతో చంద్రబాబుకు కష్టంగా మారింది. అధికారంలో ఉన్నప్పుడు పార్టీని నడపడం ఒకఎత్తు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీని నెట్టుకురావడం మరోఎత్తు. దీంతో ఈ ఐదేళ్లకాలం చంద్రబాబుకి అగ్నిపరీక్షలా మారబోతోంది.
అదే సమయంలో కొడుకుని భావి నేతగా ప్రొజెక్ట్ చేయాలనుకున్న ఆలోచన కూడా చంద్రబాబుకి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. అధికారంలోకి వచ్చినా రాకపోయినా ఈ ఎన్నికల తర్వాత లోకేష్ కి పార్టీ పగ్గాలు అప్పగించాలని అనుకున్నారు చంద్రబాబు. అయితే చినబాబు అంతటి సమర్థుడు కాడని అప్పుడే తేలిపోయింది. అధికారంలో ఉన్న పార్టీ, అందులోనూ స్వయానా మంత్రి… కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోవడం దారుణమైన పరాభవం.
అయితే బలవంతంగా పార్టీపై లోకేష్ ని రుద్దడం పెద్ద పనేంకాదు, ఆ పనిచేస్తే అసలుకే మోసం వచ్చే పరిస్థితి. అందులోనూ ప్రతిపక్షంలో కూర్చుని పార్టీని నడపడం మాటలుకాదు. అందుకే వయసు, ఆరోగ్యం సహకరించకపోయినా చంద్రబాబు కాడె మోస్తున్నారు. ఏదేమైనా వచ్చే ఎన్నికల వరకు లోకేష్ టీడీపీలో ట్రైనీనే.