సరిలేరు నీకెవ్వరు సినిమా నిర్మాణంలో భాగస్వామిగా వున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. హీరోగా రెమ్యూనిరేషన్ కు బదులు, భాగస్వామిగా వుంటూ, నాన్ థియేటర్ హక్కులు తీసుకుంటున్నారన్నది ఇండస్ట్రీ వర్గాల బోగట్టా. గతంలో మహేష్ సినిమాకు 45 నుంచి 46 కోట్ల వరకు నాన్ థియేటర్ హక్కులు వచ్చాయి. ఆ లెక్కన సరిలేరు నీకెవ్వరు సినిమాకు మహేష్ కు మంచి ఆదాయమే వస్తుందని, 50 కోట్ల వరకు వుండొచ్చని వార్తలు వినిపించాయి.
లేటెస్ట్ సమాచారం ప్రకారం ఇంకా ఎక్కువే వస్తోందని తెలుస్తోంది. కేవలం శాటిలైట్ అమౌంట్ నే 17 కోట్ల వరకు వస్తున్నట్లు తెలుస్తోంది. ఇదికాక డిజిటల్, హిందీ డబ్బింగ్, అడియో రైట్స్ వుండనే వుంటాయి. ఇప్పుడున్న పరిస్థితులు, మార్కెట్ రీత్యా 53 కోట్ల వరకు రావచ్చని తెలుస్తోంది.
ఇదిలావుంటే కేవలం మహేష్ సినిమానే కాదు, బన్నీ-త్రివిక్రమ్ సినిమా కూడా దాదాపు ఇదే రేంజ్ లో నాన్ థియేటర్ హక్కులు రాబడుతున్నట్లు బోగట్టా. శాటిలైట్ ను జెమినికి ఇస్తున్నారు. బన్నీ-త్రివిక్రమ్ కాంబో అల వైకుంఠపురములో కూడా 17 కోట్లకే ఇస్తున్నట్లు, అంతకు రూపాయి తక్కువైనా ఇచ్చే ప్రసక్తి లేదని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.
పైగా బన్నీకి హిందీ డబ్బింగ్ రైట్స్ కింద మంచి మొత్తమే వస్తుంది. అందువల్ల ఆ సినిమాకు కూడా 52 కోట్ల నుంచి 55 కోట్ల వరకు నాన్ థియేటర్ హక్కుల ఆదాయం వస్తుందని తెలుస్తోంది.