మాట వరసకు అన్నాడు అంతే …. ఆ పని చేయడు

రాజకీయ నాయకులు పొద్దునే లేస్తే అనేక మాటలు చెబుతారు. వారు అన్నవన్నీ నిజమని నమ్మిన వారు బకరాలనే అనుకోవాలి. అధికారంలోకి రావడానికి, వచ్చాక కూడా ప్రజలకు అనేక హామీలు ఇస్తారు. అవన్నీ తీరుస్తారని నమ్మితే…

రాజకీయ నాయకులు పొద్దునే లేస్తే అనేక మాటలు చెబుతారు. వారు అన్నవన్నీ నిజమని నమ్మిన వారు బకరాలనే అనుకోవాలి. అధికారంలోకి రావడానికి, వచ్చాక కూడా ప్రజలకు అనేక హామీలు ఇస్తారు. అవన్నీ తీరుస్తారని నమ్మితే మనంత వెధవాయిలు ఎవరూ ఉండరు. రాజకీయ నాయకులు సమయానికి తగినట్లు మాట్లాడతారు. తమంత నిజాయితీపరులు మరొకరు ఉండరు అన్నట్లుగా మాట్లాడతారు. తాము నిప్పు రవ్వలవంటి వారమని, మిగతా వారంతా బొగ్గులని మాట్లాడతారు. ప్రత్యర్థుల మీద సవాళ్లు విసురుతారు. బండారం బయట పెడతామంటారు. నిజాలను బయటకు తీస్తామంటారు. నిరూపించలేకపోతే పదవికి రాజీనామా చేస్తానని, రాజకీయాలనుంచి తప్పుకుంటానని అంటారు. అవన్నీ నమ్మితే మనంత చవటలు ఉండరు. 

మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో బీజేపీ అభ్యర్థి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక మాట చెప్పాడు. ఆ వీడియోను టీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. కానీ ఆ వీడియోలో చెప్పిన పని ఆయన చేయడు. ఇంతకూ ఆ వీడియోలో రాజగోపాల్ రెడ్డి ఏం చెప్పాడు? మనుగోడు ఉప ఎన్నికలను టీఆర్ఎస్ -బీజేపీ పార్టీలు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని పోటీ చేశాయో మన అందరం చూసాం.. గత కొద్ది రోజుల క్రితం నుండి మీడియా లో ఈ ఉపఎన్నికల గురించే చర్చ..తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అంతతి ఉత్కంఠ భరితమైన వాతావరణం ఏర్పర్చిన ఈ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ విజయం సాధించింది. అధికార పార్టీ కి బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి గట్టిపోటీని ఇచ్చాడు. 

కానీ చివరికి ఓడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఎన్నికల ప్రచారం లో ఆయన ‘టీఆర్ఎస్ పార్టీ నాపైన గెలిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా ..ఛాలెంజ్ అంటూ మీడియాలో సవాల్ చేశాడు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎన్నికల నోటిఫికేషన్ రాకముందు నుండి నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తూ ప్రజల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆయన మునుగోడు ప్రజలు తనకు ఓటు వేస్తారని ధీమాను వ్యక్తం చేశారు. ఈ ధీమాతోనే ఆయన, మునుగోడు లో తన విజయం పక్కా అని, ఒకవేళ మునుగోడులో ఓటమి పాలైతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సంచలన వ్యాఖ్యలు చేశారు. 

ఇక ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ చేతిలో ఓటమి పాలైన రాజగోపాల్ రెడ్డి మాటకు కట్టుబడతారా? చెప్పిన మాట ప్రకారం రాజకీయ సన్యాసం తీసుకుంటారా? అంటూ టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రచారం లో మాట్లాడిన వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇక వీటిని టార్గెట్ చేస్తున్న టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి రాజగోపాల్ రెడ్డి రాజకీయాలు వదిలేయాలని సూచిస్తున్నారు.

కానీ రాజకీయాలు వదిలేయడానికి రాజగోపాల్ రెడ్డి పిచ్చోడు కాదు. రాజకీయ అండ ఉంటేనే ఆయన వ్యాపారాలు నడుస్తాయి. తీవ్ర అనారోగ్యం పాలై మంచాన పడితే  తప్ప ఏ రాజకీయ నాయకుడూ రాజకీయాలు వదిలి పెట్టడు. టీఆర్ఎస్ కు బీజేపీ తీవ్రమైన పోటీ ఇచ్చింది కాబట్టి ఆ పార్టీ నాయకత్వం వచ్చే ఎన్నికల్లోనూ ఆయన్నే తన అభ్యర్థిగా నిలబెడుతుందేమో. రాజకీయ సన్యాసం తీసుకుంటామని రాజకీయ నాయకులు మాటవరసకు అంటారు అంతే.