విజయం ఎవరికైనా ఉత్సాహాన్ని ఇస్తుంది. అయితే మునుగోడు ఉప ఎన్నికలో విజేతగా నిలిచిన టీఆర్ఎస్‌ను మాత్రం… భవిష్యత్ భయపెడుతోంది. టీఆర్ఎస్ సర్వశక్తులూ ఒడ్డితే.. ఆ పార్టీకి వచ్చిన మెజార్టీ 10,309 ఓట్లు. ఒక్క ఓటు తేడాతో గెలిచినా గెలుపు లాంటి మాటలు చెప్పుకోడానికి, వినడానికి బాగుంటాయి. కానీ 10 వేల మెజార్టీ కూడా చిన్నదిగా కనిపించడం విశేషం.
కేసీఆర్ కేబినెట్‌లోని మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు… ఇలా చిన్నాపెద్దా అధికార పార్టీ నేతలంతా మునుగోడులో దాదాపు నెల రోజుల పాటు తిష్ట వేశారు. ఇంటింటికి తిరిగారు. ఓటు రాబట్టుకోడానికి అన్ని రకాల సమీకరణలను చేశారు. సంక్షేమం, అభివృద్ధి పేరుతో వేలాది కోట్లు అక్కడ కుమ్మరించారు. ఇక ఓటర్లను ప్రలోభ పెట్టడంలో టీఆర్ఎస్, బీజేపీ పోటీ పడ్డాయి.
ఇలా ఆర్థిక, సామాజిక, రాజకీయ సమీకరణలన్నింటినీ పకడ్బందీగా అమలు చేస్తే… చివరికి 10 వేల మెజార్టీ టీఆర్ఎస్‌కు దక్కింది. కౌంటింట్‌లో చివరి వరకూ ఉత్కంఠ కొనసాగింది. చావు తప్పి కన్నలోట పోయిందన్న సామెత చందాన, టీఆర్ఎస్ బతికి బట్ట కట్టింది. టీఆర్ఎస్ కి బలమైన ప్రత్యర్థి తామేనని మునుగోడు ఉప ఎన్నిక ఫలితంతో బీజేపీ చాటి చెప్పింది. ఇదే మునుగోడులో టీడీపీతో పొత్తులో భాగంగా పోటీ చేసిన బీజేపీకి 2014లో 27,434 ఓట్లు, 2018లో 12,725 ఓట్లు లభించాయి. నాలుగేళ్లు తిరిగే సరికి బీజేపీకి 86,697 ఓట్లు దక్కాయి. అనూహ్యంగా బీజేపీకి పెరిగిన ఓట్లు.. టీఆర్ఎస్‌కు ఎలాంటి సంకేతాలు ఇస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టీఆర్ఎస్ మెడపై కత్తి వేలాడుతోంది.
సహజంగా ఉప ఎన్నిక అధికార ఫలితం అధికార పార్టీకి అనుకూల వస్తూ వుంటుంది. తమ మెజార్టీని బీజేపీ తగ్గించగలిగిందని స్వయంగా మంత్రి కేటీఆర్ అనడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఉప ఎన్నిక ఫలితమే ఇలా వుంటే, ఇక సార్వత్రిక ఎన్నికల్లో ఎలా వుంటుందో ఊహించుకోవచ్చు. అప్పుడు ఎవరికి వారు గెలవడంపైన్నే దృష్టి వుంటుంది. చాప కింద నీరులా తెలంగాణలో బీజేపీ బలపడుతోందన్నది వాస్తవం. ఈ నిజాన్ని గ్రహించి, అందుకు తగ్గట్టుగా వ్యూహాలు రచిస్తే తప్ప బీజేపీని అడ్డుకోవడం సాధ్యం కాదు.