మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ దక్కక పోయినా, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి ప్రయోజనం కలిగింది. తెలంగాణలో కోమటిరెడ్డి బ్రదర్స్ మొదటి నుంచి రేవంత్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో వుంటూ కాంగ్రెస్ అగ్ర నాయకులపై నోరు పారేసుకున్న రేవంత్‌రెడ్డిని పార్టీలో చేర్చుకోవడం ఏంటంటూ కోమటిరెడ్డి బ్రదర్స్ వెంకటరెడ్డి, రాజగోపాల్‌రెడ్డి వ్యతిరేకిస్తూ వచ్చారు.
రేవంత్‌ను పార్టీలో చేర్చుకోవడంతో పాటు టీపీసీసీ బాధ్యతలు అప్పగించడాన్ని కోమటిరెడ్డి బ్రదర్స్ జీర్ణించుకోలేకపోయారు. తమ అసంతృప్తి, ఆగ్రహాన్ని వారు బహిరంగంగానే వ్యక్తపరిచారు. గాంధీభవన్‌కు వెళ్లే ప్రసక్తే లేదని ఎంపీ వెంకటరెడ్డి శపథం చేశారు. ఆ తర్వాత మనసు మార్చుకున్నారాయన. రేవంత్‌తో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సర్దుకున్నట్టే కనిపించింది. మళ్లీ ఏమైందో తెలియదు కానీ, రేవంత్‌రెడ్డి నాయకత్వంపై నిప్పులు చెరిగారు.
కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మాత్రం రేవంత్‌పై వ్యతిరేకతతో కాంగ్రెస్‌కు దూరంగా వుంటూ వచ్చారు. ఇదే సందర్భంలో బీజేపీకి దగ్గరయ్యారు. ఆకస్మికంగా ఆయన అమిత్‌షాను కలవడం, బీజేపీలో చేరాలని నిర్ణయించుకోవడం చకచకా జరిగిపోయాయి. కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లారు. ఇటు రక్తం పంచుకు పుట్టిన తమ్ముడు, అటు తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ….కోమటిరెడ్డి వెంకటరెడ్డికి రాజకీయంగా ఇరకాట పరిస్థితి.
మరోవైపు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు అద్దంకి దయాకర్ వేర్వేరు సందర్భాల్లో కోమటిరెడ్డి బ్రదర్స్‌పై ఘాటు విమర్శలు చేశారు. పార్టీకి నష్టం కలుగుతుందన్న ఉద్దేశంతో వెంకటరెడ్డికి బేషరతుగా క్షమాపణలు చెప్పారు. కానీ వెంకటరెడ్డి పట్టించుకోలేదు. తమ్ముడికి ఓటు వేయాలంటూ వెంకటరెడ్డి ఆడియో లీక్ కావడం రాజకీయంగా సంచలనం సృష్టించింది. దీంతో కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీసు ఇచ్చింది.
ఇంకా వివరణ ఇవ్వాల్సి వుంది. ఈ మొత్తం ఎపిసోడ్‌కు మునుగోడు ఉప ఎన్నిక కారణమైంది. కాంగ్రెస్ పార్టీలో వెంకటరెడ్డి ఉన్నప్పటికీ, అంటరాని వాడయ్యారు. ఇదే రేవంత్‌రెడ్డి కోరుకున్నది కూడా. తన నాయకత్వంపై తరచూ ఘాటు విమర్శలు చేసే కోమటిరెడ్డి బ్రదర్స్‌ను మునుగోడు ఉప ఎన్నిక కాంగ్రెస్‌కు దూరం చేసిందని రేవంత్‌రెడ్డి, ఆయన అనుచరులు సంబరపడుతున్నారు. అందుకే మునుగోడు ఉప ఎన్నికలో డిపాజిట్ దక్కకపోయినా, మరో రకంగా రేవంత్‌రెడ్డికి రాజకీయ ప్రయోజనాన్ని కలిగించింది.