గులాబీ దళపతి ఫుల్ జోష్ మీద ఉన్నారు. అయితే ఈ జోష్ తర్వాతి ఎఫెక్ట్ ఎలా ఉండబోతోంది. ఇవాళో రేపో బిఆర్ఎస్ అనే జాతీయ పార్టీ పేరు, గుర్తింపు కూడా వచ్చేస్తాయి. ఆ తర్వాత కేసీఆర్ అడుగులు ఎలా వేయబోతున్నారు? మోడీ పతనానికి కంకణం కట్టుకున్నట్టుగా జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కేసీఆర్.. గుజరాత్ ఎన్నికలను అందుకు మొదటి మెట్టుగా వాడుకుంటారా? లేదా? అనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో మొదలైంది.
గుజరాత్ లో తెలుగువారుండే ప్రాంతాలు కూడా ఉంటాయి. అంతో ఇంతో వారి ప్రాబల్యమూ ఉంటుంది. ఇప్పటికే తెరాసకు మిత్రపక్షంలాగా వ్యవహరించే ఎంఐఎం గుజరాత్ ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ సీట్లలో పోటీచేయడానికి డిసైడ్ అయింది. మోడీకి ఝలక్ ఇవ్వాలంటే తాము కూడా గుజరాత్ బరిలో దిగాలని, కావలిస్తే.. ఆ రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఎంఐఎం తో సీట్ల సర్దుబాటు చేసుకుంటే కూడా బాగుంటుందని పార్టీలో కొన్ని ప్రతిపాదనలు వినిపిస్తున్నాయి.
అయితే గులాబీ దళపతి ఆలోచన వేరే విధంగా ఉన్నదని సమాచారం. తొలి అడుగు వేయడమే చాలా జాగ్రత్తగా ఉండాలని ఆయన ఆలోచిస్తున్నారు. గుజరాత్ లో అక్కడక్కడా తెలుగు ఓట్లు ఉండ వచ్చు గానీ.. ఏకపక్షంగా ఎమ్మెల్యే సీట్లు దక్కేంత ప్రాబల్యం ఉండకపోవచ్చుననేది ఆయన అంచనా. అందుకే బిఆర్ఎస్ తరఫున పోటీకి దిగడం కాకుండా.. స్థానికంగా ఇతర పార్టీలు ఎవరైనా వచ్చి తనను సాయం అడిగితే.. వారికి మద్దతుగా వెళ్లి ప్రచారం చేయాలనే కోరిక మాత్రం ఆయనకు ఉంది. అలాంటిది జరిగితే.. జాతీయ స్థాయిలో ఇతర పార్టీలు తనను జాతీయ నేతగా గుర్తిస్తున్నట్టుగా కూడా ఒక బిల్డప్ వస్తుందని ఆయన భావిస్తున్నారు.
ఆప్ చాలా సీరియస్ గా గుజరాత్ ఎన్నికల్లో తలపడుతోంది. కేజ్రీవాల్ తో కేసీఆర్ కు సత్సంబంధాలే ఉన్నాయి. గతంలో ఢిల్లీ వెళ్లి ఆయనను కలిసిన సందర్భాలూ ఉన్నాయి. వాటన్నింటినీ పురస్కరించుకుని.. కావలిస్తే ఈ ఎన్నికల వరకు ఆప్ తరఫున ప్రచారం చేయవచ్చునని ఆయన కోరిక. కాకపోతే.. అందుకు ఆయనే వచ్చి తనను అడిగితేనే వెళ్లిప్రచారం చేయాలని ఆలోచన.
తానుగా వెళ్లి నేను ప్రచారం చేస్తా అని అడిగితే చులకన అయిపోతాం అని భయం. అయితే.. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో కూడా పాగా వేయాలని తలపోస్తున్న ఆమ్ ఆద్మీ అధినేత కేజ్రీవాల్, తనంతగా సంప్రదించడం కాదు కదా.. కేసీఆర్ వెళ్లి అడిగినా సరే, ఆయన సాయాన్ని తీసుకోడానికి ఇష్టపడతారా? అనేది ఇంకో మీమాంస. గుజరాత్ ఎన్నికలు- గులాబీ దళపతి కేసీఆర్- జాతీయ రాజకీయాల వ్యూహాలు ఇంకెన్ని మలుపులు తిరుగుతాయో చూడాలి.