టాలీవుడ్ లో హీరోలు గిల్లినా గిల్లించుకుని, ఇంటికెళ్లి ఏడవడం తప్ప డైరకర్లు చేసేది ఏమీ వుండదు. సినిమా మేకింగ్ లో వెళ్లుపెట్టేసి, పోస్ట్ ప్రొడక్షన్ లో కాళ్లు పెట్టేసి, ఇష్టం వచ్చినట్లు కెలికేసి, తీరా ఫ్లాపు అయితే డైరక్టర్ల మీదకు నెట్టేసే హీరోలు ఇక్కడ వున్నారు. దాని వల్ల కెరీర్ లకు ఫుల్ స్టాప్ లు పడిపోయినా, డైరక్టర్లు పెదవి విప్పలేరు. అలాంటి నేపథ్యంలో డైరక్టర్ అజయ్ భూపతి, జస్ట్ సింపుల్ గా 'చీప్ స్టార్' అని ట్వీట్ పెట్టడం అంటే చాలా ధైర్యం అనే అనుకోవాలి. అది బహుశా ఆయన తన గురువు రామ్ గోపాల్ వర్మ నుంచి నేర్చుకున్నారేమో?
సరే, ఈ చీప్ స్టార్ ఎవరు అన్న స్పెక్యులేషన్లు ఇప్పటికే ఎక్కువ సాగాయి. ఆ సంగతి అలా వుంచి జెమిని కిరణ్ నిర్మాతగా, రవితేజ హీరోగా, అజయ్ భూపతి చేయాల్సిన మహాసముద్రం ప్రాజెక్టు అయితే ఆగిపోయిందని వార్తలు వినిపించాయి. వినిపిస్తున్నాయి. ఈ విషయంలో ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం హీరో రవితేజ దే ముమ్మాటికీ తప్పు అని తెలుస్తోంది.
లైన్, స్క్రిప్ట్ విని ఓకె చేసి, ప్రోసీడ్ అని నిర్మాతను, డైరక్టర్ ను భుజం తట్టి, ఇప్పుడు పొమ్మనలేక పొగపెడుతున్నట్లు రవితేజ చేస్తున్నారన్న కామెంట్లు వినినిపిస్తున్నాయి. సినిమా ఒప్పుకున్నాక అడ్వాన్స్ తీసుకున్నా లేకపోయినా, ఓ రేటు అని అనుకోవడం కామన్. కానీ ఇప్పటి దాకా రవితేజ ఆ సంగతి ప్రసావించలేదని తెలుస్తోంది. ఎప్పుడు అడిగినా చూద్దాం అనే దాట వేసినట్లు బోగట్టా.
అలాగే స్వతహాగా మంచి డైలాగ్ రైటర్ అయిన అజయ్ భూపతిని కించపరిచేలా, ఎవరెవరో డైలాగ్ రైటర్ల పేర్లను చెప్పి, వాళ్లతో మాటలు రాయించమని, వాళ్లకు కథ చెప్పమని కిందా మీదా చేసినట్లు తెలుస్తోంది. ఒక పక్కన జెమిని కిరణ్-అజయ్ భూపతికి సినిమా చేస్తానని చెబుతూనే, మరోపక్క వేరే వాళ్ల దగ్గర ఇందుకు విరుద్దంగా చెప్పడం, ఆ మాటలు మళ్లీ ఇటు రావడం, దీంతో అంతా కన్ప్యూజన్ నెలకొనడం వంటి వ్యూహాలకు రవితేజ తెరతీసారన్నది ఇండస్ట్రీ వర్గాల బోగట్టా.
మొత్తం మీద మిగిలిన హీరోలు చేస్తాము..చేయము అన్నది క్లారిటీగా చెప్పేసి, ఓకె అంటే మాట మీద నిలబడతారని, కానీ రవితేజ మాత్రం అలా కాదని, ఇది అజయ్ భూపతి విషయంలోనే కాదని, గతంలో మరి కొంత మందికి కూడా జరిగిందని, కానీ ఎవ్వరూ పెదవి విప్పలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇవన్నీ వింటుంటే, అజయ్ భూపతి తేనె తుట్టను కదిపినట్లే వుంది.