సినిమాలకు జీ టీవీ బ్రేక్?

తెలుగు శాటిలైట్ రంగంలో జీ టీవీ ఓ సంచలనం. మిగిలిన చానెళ్లతో పోటీ పడి సినిమాలు కొనడం, డిజిటల్ కొనుగోళ్లు వచ్చిన తరువాత కూడా ఆ పోటీలో కూడా ముందుకు వెళ్లి, అమెజాన్ లాంటి…

తెలుగు శాటిలైట్ రంగంలో జీ టీవీ ఓ సంచలనం. మిగిలిన చానెళ్లతో పోటీ పడి సినిమాలు కొనడం, డిజిటల్ కొనుగోళ్లు వచ్చిన తరువాత కూడా ఆ పోటీలో కూడా ముందుకు వెళ్లి, అమెజాన్ లాంటి వాటికి దీటుగా నిలవడం జీ టీవీ ప్రత్యేకత.

జెమిని, మా, జీ లాంటి మూడు చానెళ్లు పోటీ పడుతుండడం వల్లనే తెలుగు సినిమాల శాటిలైట్ లకు మంచి రేట్లు వస్తున్నాయి. సినిమాల ప్రసారానికి ప్రత్యేకంగా ఛానెల్ కూడా ఏర్పాటు చేసుకుంది కూడా. 

అయితే ఇప్పుడు జీ టీవీ కొన్నాళ్ల పాటు సినిమాల కొనుగోళ్లకు విరామం ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి నుంచి మూడు నెలల పాటు అంటే నవంబర్, డిసెంబర్ వరకు జీ టీవీ శాటిలైట్ కొనుగోళ్లకు విరామం ఇస్తున్నట్లు ఇండస్ట్రీలో వినిపిస్తోంది. అంటే ఇక మా టీవీ, జెమిని టీవీ లతో మాత్రమే బేరసారాలు వుంటాయన్నమాట కొంత కాలం.

జీ టీవీ సినిమాల కొనుగోళ్లకు ఎందుకు విరామం ఇస్తున్నట్లో అన్నది తెలియడం లేదు. ఆర్థిక పరమైన వ్యవహారాలు ఏవో వున్నాయని, అందుకే తాత్కాలికంగా బ్రేక్ ఇస్తున్నారని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు.

మీడియా రంగంలోని అతి పెద్ద గ్రూప్ ల్లో ఒకటైన జీ టీవీ కి ఆర్థిక ఇబ్బందులు వుంటాయని అనుకోవడానికి లేదు. కానీ ఆర్థికపరమైన అడ్జస్ట్ మెంట్లు ఏవో జరుగుతున్నాయని, అందుకనే ఈ గ్యాప్ అని వినిపిస్తోంది.