అప్రస్తుతం ప్రసంగం అని ఓ మాట వుంది. సాధారణంగా ఫంక్షన్లలో ఇలాంటి ప్రసంగాలు చేసే వారు ఒకరిద్దరు వుంటారు. కానీ అందరూ అప్రస్తుతం ప్రసంగం చేస్తే..? అల్లు శిరీష్ హీరోగా జిఎ 2 సంస్థ నిర్మించిన ఊర్వశివో..రాక్షసివో సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న నేపథ్యంలో సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. సినిమా కు సంబంధించిన వారు, సినిమాను ప్రమోట్ చేయాలనుకున్న హీరో అల్లు అర్జున్ తదితరులు ఫంక్షన్ కు హాజరయ్యారు.
సాధారణంగా ఇలాంటి ఫంక్షన్లలో సినిమా మంచి చెడ్డల గురించి ప్లస్ పాయింట్ల గురించి మాట్లాడి, అప్పటి వరకు సినిమా చూడని జనాలను థియేటర్ కు రప్పించాల్సి వుంటుంది. ఇలాంటి పంక్షన్ ల పర్పస్ కూడా అదే. కానీ ఊర్వశివో రాక్షసివో ఫంక్షన్ లో మాత్రం అలా జరగలేదు. స్టేజ్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఫంక్షన్ కు గెస్ట్ గా వచ్చిన అల్లు అర్జున్ ను పొగడ్తలతో కీర్తించడంతోనే సరిపోయింది.
సీనియర్ ప్రొడ్యూసర్ తమ్మారెడ్డి భరద్వాజ నుంచి దిల్ రాజు వరకు అందరూ ఇదే పని. బన్నీ పీఆర్ నుంచి నిర్మాతగా మారిన ఎస్కేఎన్ అయితే చెప్పనక్కరలేదు. అర్థం లేని ఉపమానాలు నోటికి వచ్చినట్లు వాడేసారు. బండ్ల గణేష్ ను రీప్లేస్ చేయాలని ఈ మధ్య తెగ ప్రయత్నిస్తున్నాడు. ఈ స్టేజ్ మీద కూడా బన్నీ భజన పీక్స్ లో చేసాడు. బన్నీ వాస్ సంగతి సరేసరి. ఆఖరికి తండ్రి అల్లు అరవింద్ కూడా బన్నీ గురించి మాట్లాడడమే.
అసలు సినిమా ఎలా వచ్చింది. మంచి చెడ్డలు ఏమిటి? ఏ ఏరియాలో కలెక్షన్లు ఎలా వున్నాయి? ప్లస్ పాయింట్లు ఏమిటి? ఇవేమీ అస్సలు డిస్కషన్ కే రాలేదు. ఇంత డబ్బు ఖర్చు చేసి సాధించింది ఏమిటా? అన్నీ బన్నీని పొగిడే అవకాశాన్ని అందరూ దొరకపుచ్చుకోవడం తప్ప వేరు కాదు.