దేశాన్ని సమూలంగా సంస్కరించేస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి చాలా తీవ్రమైన ప్రతిజ్ఞలే చేశారు. భారతదేశాన్ని బిజెపి విముక్త దేశంగా మారుస్తాననిన కూడా ప్రతినపూనారు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. అయితే.. బిఆర్ఎస్ రాజకీయాల గురించి మాట్లాడడం వెనుక కేసీఆర్ చిత్తశుద్ధి ఎంత అనే విషయంలో అందరికీ చాలా సందేహాలు ఉన్నాయి. ఎంత సీరియస్ గా ఆయన జాతీయ రాజకీయాలు చేస్తారనేది ప్రశ్నార్థకంగా వారికి కనిపించింది.
ఎందుకంటే.. భారతీయ జనతా పార్టీ అనేది తెలంగాణలో తన ప్రభుత్వానికి ప్రమాదకరంగా మారుతున్నదనే భావన కలిగేవరకు కేసీఆర్ జాతీయ రాజకీయాల మీద పెద్దగా దృష్టి పెట్టలేదు. ఆయన దేశోద్ధరణ డైలాగులన్నీ ఆ తర్వాత మాత్రమే వచ్చాయి. కాకపోతే.. మహాద్భుతమైన వక్త గనుక.. దేశ ప్రయోజనాలను తాను ఈ ప్రయత్నం ద్వారా ఎంత ఘాటుగా కాంక్షిస్తున్నాననే సంగతి ఆయన చాలా అందంగా చెప్పగలిగారు. అయితే ఈ ప్రయత్నాన్ని గమనిస్తున్న చాలా మందికి ఇంకోలా కనిపించింది.
తెలంగాణలో మీరు నాకు ప్రమాదకరంగా తయారైతే.. దేశస్థాయిలో నేను కూడా మీకు ప్రమాదకరంగా తయారవుతా.. ఇక్కడ మీరు నాకు నిద్రపట్టకుండాచేస్తే, ఢిల్లీలో మీకు నిద్రలేకుండా చేస్తా.. అనేది ఒక్కటే ఆయన ఎజెండాగా ముందుకు సాగుతున్నారా? అనే అభిప్రాయమూ ఏర్పడింది. అందుకే కేసీఆర్ జాతీయ రాజకీయాల డైలాగులను.. ఉత్తరాదికి చెందిన ఇతర పార్టీల సీనియర్ నాయకులు ఎవ్వరూ ఖాతరు చేయలేదు. పట్టించుకోలేదు.
కేసీఆర్ పాపం.. ఇల్లిల్లూ తిరిగి విందు సమావేశాలు కొనసాగించారు గానీ.. ఆ ఫలితం ఆయన తలపెట్టిన రాజకీయ కూటమిగా రూపాంతరం చెందలేదు. దాంతో బిజెపిని బెదిరించడానికి వేరే గతిలేనట్టుగా జాతీయ పార్టీ ప్రకటించారు. అయితే ఇలాంటి తాటాకు చప్పుళ్లకు బిజెపి బెదురుతుందా? లేదా? అనేది వేరే సంగతి.
ఇప్పుడు తాజా పరిణామాలు గమనిస్తే.. తెలంగాణలో పార్టీ విజయం సాధించింది. అది ఖచ్చితంగా ఘన విజయమే. సిటింగ్ ఎమ్మెల్యేగా రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంత బలహీనమైన ప్రత్యర్థి కాదు. సంపదపరంగా కూడా ఢీకొనగలిగిన వాడు. అయినా సరే.. ఆ స్థానాన్ని తెరాస చేజిక్కించుకుంది. ఈ విజయం తెరాసకు గొప్ప ఆత్మవిశ్వాసం ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ విజయానికి అడ్డు ఉండదని వారు భావించవచ్చు.
అసెంబ్లీ విజయం తప్ప.. కేసీఆర్ కు దేశం గురించి పెద్ద లక్ష్యాలు ఉండకపోవచ్చు. అసెంబ్లీ ఎన్నికలకు బిజెపితో పితలాటకం ఉండదనే ధీమా ఏర్పడితే.. ఆయన జాతీయ రాజకీయాల జోరు తగ్గించే అవకాశం ఉంటుందని కొందరి అంచనా. బిఆర్ఎస్ పేరుమార్పు/ గుర్తింపు వచ్చిన తర్వాత.. కొన్ని రోజులు ఏదో ఒక హడావుడి ఉంటుంది గానీ.. ఆ తర్వాత అంతా సద్దుమణుగుతుందని అనుకుంటున్నారు.