దుబ్బాకలో కూడా తమది కాని సీటును వారు గెలిచారు. కానీ వారికి హుజూరాబాద్ గెలుపు చాలా పెద్దది. ఈటలను ఓడించడానికి కేసీఆర్ దళాలు కంకణం కట్టుకుని పనిచేసిన నేపథ్యంలో ఆ ఎన్నిక చాలా ప్రతిష్ఠాత్మకంగా మారింది. కానీ బిజెపి విజయం సాధించింది. ఆ విజయాన్ని భారతీయ జనతా పార్టీ తమ ఘనతగా చాటుకుంది. ఎవరైనా అలాగే చేస్తారు. వాపును బలుపుగా ప్రచారంచేసుకోవడం రాజకీయాల్లో చాలా సహజం. కానీ.. వాపును బలుపుగా ఆ పార్టీ నమ్మింది. తమకు నిజంగానే తెలంగాణలో బలం పెరిగిపోయిందని మురిసిపోయింది. హుజూరాబాద్ లో ఈటలకు పడిన ఓట్లెన్ని, మోడీకి పడిన ఓట్లెన్ని అనేది అంచనా వేసుకోలేకపోయింది.
అక్కడినుంచి మునుగోడు విషయానికి వచ్చేసరికి, వారి కాన్ఫిడెన్స్ ఓవర్ డోసేజీలోకి వెళ్లింది. జనరల్ అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు ఉప ఎన్నిక తీసుకురావాల్సిన ఆవశ్యకత ఏమిటో ఎవ్వరికీ అర్థం కాదు. కోమటిరెడ్డికి కమలప్రేమ ఉంటే గనుక.. ఎంచక్కా కండువా కప్పుకోకుండా సకల పార్టీ కార్యకలాపాల్లోనూ పాల్గొంటూ ఈ ఏడాదిని సాగదీసి ఉండవచ్చు. కానీ బిజెపి అంచనా వేరు. సిటింగ్ ఎమ్మెల్యేకు ఎంత లేదన్నా ఎంతో కొంత బలం ఉంటుంది. పైగా బరిలోకి దింపితే కోట్లకు కోట్ల రూపాయలు విచ్చలవిడిగా ఖర్చు పెట్టగల స్తోమత ఉన్న నాయకుడు. డబ్బు వెదజల్లగలడు.
అలా ఏదో ఒక మార్గంలో తమ ఖాతాలో మరొక సీటును పెంచుకుంటే.. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా తమ పార్టీకి నిరంతరాయంగా బలం పెరుగుతూనే ఉన్నదని చాటుకోవచ్చు. నాగార్జున సాగర్ ఎన్నిక రూపంలో పరాజయం పలకరించిన నల్గొండ జిల్లాలోనే.. తమ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని మాయచేయవచ్చు.టముకువేసుకోవచ్చు అనుకున్నారు. కేవలం రాజగోపాల్ రెడ్డి డబ్బును నమ్ముకుని బరిలోకి దిగారు. కానీ.. ఇప్పుడు పాఠం నేర్చుకోవాల్సి వచ్చింది.
ఇప్పటికైనా వారు ఈ ఓటమి పాఠాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. దుబ్బాక, హుజూరాబాద్ లలో గెలుపు బిజెపి కాదు.. ఆయా అభ్యర్థులది. మునుగోడులో తాము ఎంచుకున్న సిటింగ్ ఎమ్మెల్యే బలం.. కంప్లీట్ గా అతడొక్కడిదీ కాదు. అతడికి ఆ పదవిని కట్టబెట్టిన కాంగ్రెస్ పార్టీకి కూడా చాలా వాటా ఉంది. పోనీ రాజగోపాల్ రెడ్డి ని తమ జట్టులోకి లాక్కున్న తరవాత.. అతడికి కాంగ్రెస్ ద్వారా పోయిన బలాన్ని, అదేస్థాయిలో బిజెపి ‘ఫిల్’ చేయలేకపోయింది.
అంటే మునుగోడులో.. బిజెపికి (కోమటిరెడ్డిని మినహాయిస్తే) కాంగ్రెస్ కు ఉన్న బలమైనా ఉన్నదా లేదా అని చెక్ చేసుకోవాలి. కానీ.. గెలుపు గురించి చాలా డప్పు కొట్టుకుంది.కానీ ప్రజల తీర్పు వచ్చేసరికి చతికిలపడింది. తెలంగాణలో తక్షణం, వచ్చే ఏడాది ఎన్నికల్లోనే అధికారంలోకి వచ్చేయబోతున్నాం అనే ప్రగల్భాల మాటలకు ప్రస్తుతానికి తెరపడుతుంది. అది కూడా నిజంగా వాళ్లు పాఠం నేర్చుకున్న పక్షంలో.. ఇంకా బుకాయింపు మార్గంలో ఉంటే ఎవ్వరూ ఏమీ చేయలేరు.