ఓవర్ ది టాప్ (ఓ.టి.టి.) ప్లాట్‌ఫామ్స్‌లో సినిమాలు డైరెక్ట్‌గా రిలీజ్ చేయడం హాలీవుడ్‌లో ఎప్పట్నుంచో వుంది. స్టూడియోల సాయం లేని ఇండిపెండెంట్ సినిమాలను నెట్‌ఫ్లిక్స్ ద్వారా విడుదల చేస్తున్నారు. ఇండియన్ సినిమాకి థియేట్రికల్ బిజినెస్ పరంగా లోటు లేదు కనుక ఇంతకాలం అటువైపు చూడలేదు. అమెజాన్, నెట్‌ఫ్లిక్స్ లాంటి సంస్థలు ఒరిజినల్ కంటెంట్ ప్రొడ్యూస్ చేసినా కానీ సినిమాలు డైరెక్ట్‌గా ఓటిటిలో రిలీజ్ అవడం లాక్‌డౌన్‌లోనే సాధ్యపడింది.
ఇంకా తెలుగు చిత్ర సీమ నుంచి పెద్ద సినిమాలు డిజిల్ రిలీజ్‌పై మొగ్గు చూపడం లేదు. థియేట్రికల్ రిలీజ్ ఎప్పుడు వీలవుతుందనేది తెలియకపోయినా కానీ కొన్ని చిత్రాల నైజాం హక్కులు అమ్ముడయిపోయాయంటూ ప్రకటనలిస్తూ తాము డిజిటల్ రిలీజ్‌కి సిద్ధంగా లేమనే సంకేతాలను నిర్మాతలిస్తున్నారు. అయితే ఓటిటి గేమ్‌లో మిగిలిన భాషల చిత్రాలు చూపించిన దూకుడు తెలుగు చిత్రాలు మొదట్లో చూపించలేకపోయాయి.
మన సినిమాల కాంటెంట్ బాగుండడం లేదనే విమర్శలొచ్చాయి. అయితే ‘కృష్ణ అండ్ హిజ్ లీల’, ‘భానుమతి అండ్ రామకృష్ణ’ చిత్రాలు యూత్‌కి కావాల్సిన స్టఫ్‌తో రూపొంది ప్రశంసలు అందుకున్నాయి. ఇప్పటికీ ‘47 డేస్’ లాంటి డల్ థ్రిల్లర్స్ వస్తున్నా కానీ ఎక్కువ మందికి రీచ్ అయ్యే చిత్రాలను తెలుగు సినిమా కూడా అందించగలదని రుజువైంది. ఇంకా ఓటిటి కోసమని కాంటెంట్ ప్రొడ్యూస్ చేయకుండానే ఇంప్రెస్ చేస్తోన్న టాలీవుడ్ ఇక అచ్చంగా డిజిటల్ రిలీజ్ కోసం కాంటెంట్ సిద్ధం చేస్తే అది ఖచ్చితంగా మరింత క్వాలిటీతో రూపొందే అవకాశముంది.