ఫ్లారెన్సులో జియానీ అనే ఓ వ్యాపారస్తుడు వుండేవాడు. అతనికి పాటలు, కీర్తనలు పాడే పిచ్చి. చర్చికి వెళ్లి కీర్తనలు పాడుతాననేవాడు. అతని గొంతు బాగుండకపోయినా చర్చిలో పూజారులు అతన్ని ప్రోత్సహించి పాడిస్తూ వుండేవారు. ఎందుకంటే అతనో వెర్రిమాలోకం. తన కీర్తనలు మెచ్చుకున్న పూజారులకు విందులిప్పించేవాడు. వాటిని మరిగి వాళ్లు యితన్ని మరీమరీ పాడమనేవారు. నీ అంతటి భక్తుడు లేడని ప్రశంసలు కురిపించేవారు.
తన మొగుడు యిలా ఒళ్లూపై తెలియకుండా ఖర్చు పెట్టడం అతని భార్య మోనాకు నచ్చేది కాదు. ఆమె చాలా తెలివైనది, సరసురాలు. తనకు యిలాటి అయోమయం భర్త దొరికినందుకే బాధపడుతూ రోజులు నెట్టుకు వస్తూ వుంటే గత అయిదారేళ్లగా యీ కీర్తనల పిచ్చి పట్టుకోవడంతో చిర్రెత్తిపోయింది. వసంతకాలం మూడు నెలలూ పల్లెటూరిలో తమకున్న వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి వుంటానంది. సంసారం అనే లంపటం లేకపోతే మరిన్ని కొత్త కీర్తనలు నేర్చుకోవచ్చు కదాని జియానీ సరేనన్నాడు.
ఆ పల్లెటూరిలో మోనాకు ఫెడిరిగో అనే అందమైన యువకుడు తారసిల్లాడు. ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. కానీ కలవాలంటే ఇంట్లోని వంటమనిషి భార్యకు, పనిపాటలు చూసేతని భార్యకు తెలియకుండా వ్యవహారం నడపాలి. అది కాక జియానీ మధ్యమధ్యలో హఠాత్తుగా వూరునుంచి వచ్చేస్తూంటాడు. అందువలన ఏ రోజు అనువైనదో తెలుసుకోవడానికి ఫెడిరిగోకు తెలియడానికి వాళ్లు సంకేతం పెట్టుకున్నారు.
మోనా యింటి పక్క పొలంలోని దిష్టిబొమ్మ మొహం తూర్పువైపుకి తిరిగి వుంటే జియానీ వూళ్లో లేడని అర్థం. అప్పుడు ఫెడిరిగో అర్ధరాత్రి వచ్చి అలికిడి కాకుండా తలుపును మూడుసార్లు గోకాలి. అప్పుడు మోనా తనే స్వయంగా పనివాళ్లకు మెలకువ రాకుండా మెల్లగా తలుపు తీసి ఫెడిరిగోను పడకగదిలోకి తీసుకెళుతుంది. దిష్టిబొమ్మ పడమటివైపుకి తిరిగి వుంటే రాకూడదని అర్థం. ఈ విధమైన ఏర్పాటుతో వాళ్ల రాసలీలలు నిరాఘంటంగా సాగిపోతున్నాయి.
ఒక రోజు మధ్యాహ్నం వంటమనిషి, అతని భార్య సామాన్లతో బండికోసం ఎదురుచూస్తూ ఫెడిరిగోకు కనబడ్డారు. సంగతేమిటని అడిగితే తమ బంధువులు పోయారని అందువలన వూరు వెళుతున్నామని చెప్పారు. 'మరి యీ రెండు, మూడు రోజులు మీ యజమానురాలు తనే స్వయంగా అన్నీ పనులూ చేసుకోవాలేమో పాపం' అన్నాడు ఫెడిరిగో.
'అవును, ఎవర్నీ ఏర్పాటు చేయలేకపోయాం. అయినా ఫర్వాలేదు వెళ్లి రమ్మంది.' అన్నారు వాళ్లు. మోనా ఒక్కత్తీ వుందని తెలియగానే వెంటనే ఫెడిరిగో ఆమె యింట్లో వాలిపోయాడు. ఇతన్ని చూస్తూనే ఆమె ఆనందాశ్చర్యాలలో మునిగిపోయింది. 'నువ్వు రావడం ఎవరూ చూడలేదు కదా' అని అడిగి నిర్ధారించుకుని, అతని చేతుల్లో వాలిపోయింది.
వాళ్లు శృంగారక్రీడలో మునిగివుండగా తలుపు చప్పుడైంది. ''మోనా'' అని జియానీ గొంతు వినబడగానే యిద్దరూ వులిక్కిపడ్డారు. ''చెప్పా పెట్టకుండా నా మొగుడు దిగబడ్డాడే. ఇప్పుడెలా?'' అని ఫెడిరిగో కంగారుపడ్డాడు. ''వెనకగుమ్మంలోంచి పారిపోవాలన్నా చుట్టూ పొలాలే కాబట్టి అతని కంటపడతాను.'' అని వాపోయాడు.
''మా స్నానాల గదిలో పాతకాలం నాటి ఆవిరి స్నానాల నిలువెత్తు తొట్టి వుంది. మూతి చిన్నగా, గుండ్రంగా వుంటుంది. దానిలోకి దూరి తల లోపలకి పెట్టుకో. ఎవరికీ కనబడవు. మా ఆయన స్నానాల గదిలోకి వచ్చినా చాలా ఏళ్లగా వాడటం లేదు కాబట్టి దాని కేసి చూడడు. చీకటి పడ్డాక, వీలు చూసుకుని నిన్ను బయటకు పంపేస్తాను.'' అంది మోనా.
జియానీ ఒక్కడూ రాలేదు, ఎవర్నో వెంటపెట్టుకుని వచ్చాడు. అతన్ని గుమ్మంలో నిలబెట్టి లోపలకి వచ్చి భార్యతో ''ఎల్లుండి వద్దామనుకున్నాను కానీ యింతలో యితను తగిలాడు. మనింట్లో పడి వున్న పాత ఆవిరి స్నానం తొట్టి గురించి చెపితే తను కొంటానన్నాడు. అయిదు వెండి నాణాలు యిస్తానన్నాడు.'' అని గొప్పగా చెప్పాడు.
మోనా బుర్ర పాదరసంలా పనిచేసింది. చరచరా మొగుణ్ని స్నానాల గది వైపు తీసుకెళ్లి తలుపు తీసి, లోపలున్న ఫెడిరిగోకు వినబడేట్లా గట్టిగా అరిచింది. ''ఇంత పెద్ద తొట్టెకు ఐదు వెండినాణాలు మాత్రమేనా? మీరు వ్యాపారం ఎలా చేస్తున్నారో నా కర్థం కాదు. ఏ వ్యాపారం తెలియని నేనే ఊళ్లో ఒకడు తగిలితే ఏడుకు ఒప్పించాను. లోపల ఎలా వుందో చూస్తానంటూ లోపలకి దిగాడు. ఈ లోపున పెద్ద బేరం దొరికిందంటూ ఫ్లారెన్సు నుంచి పరుగెత్తుకుని వచ్చారు మీరు. ఎంతరా అంటే ఐదు!'' అంటూ వెక్కిరించింది.
జియానీ ఆమెను రెక్క పట్టుకుని యివతలకు లాగాడు. ''నన్నంటున్నావు కానీ నీకు తలకాయుందా? తొట్టెలో వున్నాడంటున్నావు. మన మాటలు వినబడితే ఐదే యిస్తానంటాడు. నెమ్మదిగా మాట్లాడు.'' అంటూ మందలించి, బయటకు వెళ్లి తనతో వచ్చినవాడికి 'మా ఆవిడ అమ్మనంటోంది' అని చెప్పి పంపివేశాడు.
అతను తిరిగి వచ్చేటప్పటికి ఫెడిరిగో లోదుస్తులతో తొట్టెలోంచి బయటకు వస్తున్నాడు. జియానీని చూసి ''మీరెవరు?'' అన్నాడు. ''మీతో మాట్లాడినావిడ భర్తను. ఇదేమిటి మీరు లోదుస్తులతో వున్నారు?'' అని అడిగాడు జియానీ. ''ఏళ్లూ పూళ్లూ వాడని తొట్టెలోకి దిగేటప్పుడు యింకెలా దిగుతాం?'' అంటూ ఫెడిరిగో విసుక్కున్నాడు.
ఈలోగా తలుపు చప్పుడు వినగానే తను మంచం కింద దాచిన ఫెడిరిగో దుస్తులు చేతపట్టుకుని మోనా వచ్చి ''ఇవిగోనండి, మీ బట్టలు. ఇంతకీ మీకు తొట్టి నచ్చిందా?'' అని అడిగింది ఆతృత కనబరుస్తూ.
అతను మొహం చిట్లించి ''పెద్దగా, విశాలంగా వుంది కానీ లోపల తుప్పు పట్టినట్లుగా వుంది, ముక్కవాసన కూడా వేస్తోంది. బాగు చేసి యిస్తే కొంటా.'' అన్నాడు.
జియానీ ''తప్పకుండా చేయించి యిస్తాం. కాస్సేపు ఆగండి. ఏడుకి ఖరారు చేసుకుందాం.'' అన్నాడు.
మోనా అతన్ని పక్కకు లాగి ''చేయించి యిస్తాం అని గొప్పగా చెప్పేశారు కానీ, పనివాళ్లిద్దరూ లేరు. ఊరెళ్లారు, మీరే దిగాలి, లేకపోతే బేరం పోతుంది.'' అని బెదిరించింది.
''దిగక తప్పేదేముంది?'' అంటూ జియానీ పనిముట్లు పట్టుకుని తొట్టెలోకి దిగాడు. మోనా తొట్టె కన్నంలోంచి తొంగి చూస్తూ 'అదిగో ఆ మూల ఏదో వున్నట్టుంది, గోకండి, గట్టిగా పీకండి.'' అంటూ ఆదేశాలు యిస్తూ అతన్ని చాలాసేపు లోపలే వుంచింది. తాము మొదలుపెట్టిన పనికి మధ్యలో అంతరాయం కలిగినందుకు చింతిస్తున్న ఫెడిరిగో యీ అవకాశాన్ని చక్కగా వుపయోగించుకున్నాడు. ఎలాగూ లోదుస్తులతోనే వున్నాడు కాబట్టి మోనాను వెనకనుంచి తగులుకున్నాడు. ఆమె కూడా పూర్తిగా సహకరించింది.
లోపల తుప్పు గొడవలో వున్న జియానీకి బయటి కదలికల సంగతి పట్టించుకునే ధ్యాస లేకపోయింది. పైగా పై నుంచి మోనా తోముడుతో అతనికి ఏదో తోచటం లేదు. మోనా, ఫెడిరిగో యిద్దరూ తృప్తిపడి, ఫెడిరిగో వెళ్లి దుస్తులు పూర్తిగా ధరించేదాకా మోనా జియానీని బయటకు రానీయలేదు.
జియానీ బయటకు వచ్చాక, ఫెడిరిగో తొట్టెలోకి తొంగి చూసి ''సరే, నాకు నచ్చింది. ఇదిగో ఏడు నాణాలు. మీ పనివాళ్లు వూరి నుంచి వచ్చాక వాళ్ల చేత మా యింటికి పంపించండి.'' అని చెప్పి వెళ్లిపోయాడు.
రాత్రి అయేసరికి ఫెడిరిగోకు మళ్లీ కాంక్ష పుట్టుకుని వచ్చింది. మధ్యాహ్నం మాటల్లో జియానీ నేను సాయంత్రానికి ఫ్లారెన్సు చేరాలని అనడం విన్నాడు కాబట్టి మళ్లీ రాత్రి సమాగమానికి ఉవ్విళ్లూరాడు. ఎందుకైనా మంచిదని దిష్టిబొమ్మను గమనించాడు. అది తూర్పువైపు తిరిగి వుండటంతో హమ్మయ్య అనుకుని ధైర్యంగా మోనా యింటికి వెళ్లి ఎప్పటిలాగ తలుపును గోటితో గీరాడు.
జరిగినదేమిటంటే-ఊరు వెళ్లి పోవాలనే ఉద్దేశం మార్చుకుని జియానీ యింట్లో వుండిపోయాడు. ఆ విషయం తెలియని ఫెడిరిగో రాత్రి రావడానికి ప్రయత్నిస్తాడని వూహించిన మోనా దిష్టిబొమ్మ మొహాన్ని పడమటవైపుకి తిప్పి పెట్టింది. అయితే రాత్రివేళ ఒక తాగుబోతు ఆ కర్రను తన్నేసి కింద పడ్డాడు. మళ్లీ లేచి దిష్టిబొమ్మను నిలబెట్టి వెళ్లిపోయాడు. అలా నిలబెట్టడంలో దాని మొహం తూర్పువైపుకి మళ్లిపోయి, ఫెడిరిగోకు తప్పుడు సంకేతం యిచ్చింది. తలుపుపై గోకుడు వినగానే వచ్చినదెవరో మోనాకు తెలిసిపోయింది. ఏం చేద్దామా అని ఆలోచిస్తూ వుండగానే జియోనీకి మెలకువ వచ్చింది. ఏమిటది? అన్నాడు.
''అదా, తోడేలుమానవుడని చెప్పుకుంటారు కదా, అది యీ ప్రాంతాల్లో సంచరిస్తోందట. అప్పుడప్పుడు యిలా తలుపు గోకుతుంది. నేను చెవులు మూసుకుని కూర్చుంటాను. కాస్సేపటికి అదే వెళ్లిపోతుంది.'' అని చెప్పింది మోనా.
''తోడేలు మానవుడు అనేది గ్రీకు పురాణగాథల్లో వున్న కల్పితప్రాణి. జనాల మూఢనమ్మకాల్లో ఒకటి అంటారు. అది నిజంగా మన వూళ్లో తిరుగుతోందా?'' అని ఆశ్చర్యంగా అడిగాడు జియానీ.
ఈ లోగా అసహనంగా వున్నా ఫెడిరిగో యీసారి గట్టిగా గోకాడు.
''మూఢనమ్మకమో, కాదో తెలియదు, ఊళ్లో చెప్పుకుంటారు, యిదిగో మీక్కూడా వినబడుతోంది కదా ఆ శబ్దం. కదలకుండా పడుక్కోండి.'' అంది మోనా భయం నటిస్తూ.
''నా వంటి దైవభక్తుడు దానికి భయపడడం దేనికి? నేను లేచి రెండు కీర్తనలు పఠిస్తే ఆ మంత్రమహిమకు అదే పారిపోతుంది.'' అంటూ పక్క మీద నుండి లేచాడు జియానీ.
మంత్రాలు చదివేముందు కిటికీలోంచి తొంగి చూస్తాడన్న భయం పట్టుకుంది మోనాకు. అందుకని ''మీరు మంత్రాలు చదివే ముందు నేనొక చిన్న మంత్రం చదువుతాను. మా అమ్మమ్మ చిన్నప్పుడు మాకు నేర్పించిన మంత్రం అది. ఆ తర్వాత మీ కీర్తనలు పాడుదురు గాని…'' అంటూ తలుపు వద్దకు వెళ్లి
''తోకెత్తుకుని వచ్చిన తోడేలు మానవుడా, తోక దించి తోవ పట్టు
పరమభక్తుడు, పతిదేవుడు జియానీ నా అండ నుండ నాకేటి భయము''
అంటూ మూడుసార్లు రాగాలతో పాడింది. అప్పుడు జియానీ తన కీర్తనలు అందుకున్నాడు.
కాస్సేపటికి తలుపు తీసి చూస్తే ఏ ప్రాణీ కనబడలేదు. ఇదంతా తన మహిమే అని నమ్మిన జియానీ తన వూరు వచ్చి చర్చి పూజారులతో చెప్పి మురిసిపోయాడు. జరిగినదేదో వారు వూహించలేకపోయినా, 'నీ వంటి భక్తుడు మరింత సాధన చేస్తే దెయ్యాలూ, భూతాలూ కూడా తరిమికొట్టగలడు'' అని ఉబ్బేసి అతని నుండి మరిన్ని చందాలు వసూలు చేసి, యింకొన్ని పాటలు నేర్పారు.
''నా సాధన పూర్తయేవరకు నువ్వు అక్కడే వుంటే మంచిది, లేకపోతే నా ఏకాగ్రత దెబ్బ తింటుంది.'' అని జియానీ భార్యకు కబురు పంపాడు. ''మీ మహిమ కళ్లారా చూశాను. ఎన్ని ఏళ్లు పట్టినా మీ సాధన పూర్తి చేయండి. ఇక్కడ కిందామీదా పడుతూ నా తిప్పలేవో నేను పడతాను.'' అని మోనా తిరుగు కబురు పంపింది.
– ఎమ్బీయస్ ప్రసాద్ (జులై 2020)
[email protected]