దేశ చరిత్రలో ఇది ఒక అరుదైన సన్నివేశం. కేవలం ఆంధ్రప్రదేశ్‌కే కాదు.. ఇది దేశానికి అంతటికి పెద్ద వార్తే. ఒక రాష్ర్ట ప్రభుత్వం 10 అంబులెన్స్‌లను కొనుగోలు చేసి ప్రజలకు అందుబాటులోకి తేవడం అంటే చిన్న సంగతి కాదు. 10, 104 సేవల కింద ఈ అంబులెన్స్‌లను పూర్తి స్థాయిలో వాడనున్నారు. పేద ప్రజలకు ఇది పెద్దవరం వంటిది. ప్రత్యేకించి గిరిజన ఏజెన్సీ ప్రాంతాలలో దీని ఉపయోగం చెప్పనలవికాదు.
అయితే ఇవన్ని సజావుగా పనిచేయాలి. ఆశించిన రీతిలో సేవలు అందించాలి. అందులో ఏమైనా తేడాలు వస్తే విమర్శలు చేయవచ్చు. ఇందుకోసం ప్రభుత్వం రూ. 200 కోట్లు ఖర్చు చేసింది. వీటిని నిర్వహించే బాధ్యత అనండి, కాంట్రాక్ట్ అనండి అరబిందో ఫౌండేషన్‌కు అప్పగించారు. అది కూడా రివర్స్ టెండింగ్ విధానం ద్వారా.
వేల కోట్ల ఫార్మా కంపెనీలను నడిపే ఈ సంస్థ ఈ అంబులెన్స్‌లను మరింత సమర్థవంతంగా నిర్వహిస్తుందని ఆశించవచ్చు. ఒకవేళ ఇందులో తేడా వస్తే వారు కూడా విమర్శల పాలు అవుతారు. ఇవి ఎలా పనిచేస్తున్నాయన్నది కొన్ని నెలలు చూశాక ఒక అవగాహనకు రావాలి. ఇక్కడ అసలు ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలి. లక్ష్యాన్ని తెలుసుకోవాలి.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన పాదయాత్ర సందర్భంగా ఆయా చోట్ల సభలలో మాట్లాడుతూ ఆనాటి చంద్రబాబు ప్రభుత్వం పేదలకు ఉపయోగపడే ఈ అంబులెన్స్‌లను ఎలా నిరుపయోగంగా పడవేసిందో చెప్పేవారు. వాటిలో పనిచేసే సిబ్బందికి కూడా సరిగా జీతాలు వచ్చేవి కావు. ఆ విషయాలను ప్రస్తావించి ,తాను అధికారంలోకి వస్తే వాటన్నిటిని సరిదిద్దుతానని, రాష్ర్టంలో పేదలకు మేలు చేసేలా అంబులెన్స్ సేవలు అందిస్తానని వాగ్ధానం చేసేవారు. దానికి అనుగుణంగా ఆయన హామీని నిలెట్టుకున్నారు.
అన్ని వందల వాహనాలు ఒకేసారి కదులుతుండడం, వాటికి జగన్ పచ్చ జెండా ఊపడం చూడడానికి ఎంత కన్నుల పండగగా ఉంది. గతంలో ఎన్నడైనా ఇలాంటి సన్నివేశం చూశామా? అందువల్లే జగన్‌కు జాతీయ స్థాయిలో ప్రశంసలు వస్తున్నాయి.
కరోనా సంక్షోభ సమయంలో వెంటిలేటర్లతో సహా ఆధునిక వైద్య సదుపాయాలతో రూపొందిన ఈ అంబులెన్న్లను ఇన్నిటిని ఏర్పాటు చేయడం గొప్ప విషయమని, దేశంలోని ఇతర రాష్ట్రాలు కూడా దీనిని ఆచరించాలని కొందు ప్రముఖ జర్నలిస్టులు వ్యాఖ్యానించారు. దానిని బట్టే అర్థం చేసుకోవచ్చు. జగన్ చేసింది ఎంత మంచి అన్నది.
అయితే సహజంగానే ప్రతిపక్షంలో ఉన్నవారికి ఇలాంటివి కాస్త ఇబ్బంది కలిగించేవే. అందులోను ఐదేళ్లపాటు అధికారంలో ఉండి, వారి హయాంలో జరగని పని ఇప్పుడు జరిగితే వారికి చికాకుగానే ఉంటుంది. అందుకే అంబులెన్స్ సేవలు ఆరంభానికి కొద్దిరోజుల ముందు నుంచే ఒక టీడీపీ అధికార ప్రతినిధితో ఉన్నవి, లేనివి ఆరోపణలు చేయించారు. మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ. 200 కోట్లు అయితే అవినీతి రూ. 300 కోట్లు జరిగిందని ఆరోపిస్తున్నారు. హేతు బద్ధత లేకుండా, కేవలం ద్వేషంతో ఇలాంటివి చేయడం వల్ల తెలుగుదేశం పారీే్టక నష్టం తప్ప ప్రభుత్వానికి జరిగే ప్రమాదం ఏమీ ఉండదని అర్థం చేసుకోవాలి.
సుదీర్ఘకాలం అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు టైమ్‌లో సుమారు 300 అంబులెన్స్ వాహనాలను తుక్కుగా అమ్మేశారు. అవి పాడైపోతే అమ్మవచ్చు. వెంటనే వాటి బదులు కొత్తగా అంబులెన్స్‌లను ప్రవేశ పెట్టి ఉండాలి. కాని ఆ పని ఎందుకు చేయలేకపోయారో, టీడీపీ అధికార ప్రతినిధులు వివరించాలి. అయితే ఇక్కడ ఒక విషయం కనిపిస్తుంది. తెలుగుదేశం చేస్తున్న పిచ్చి ఆరోపణలను ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూడా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. అందుకే వారిలో ఎక్కువ మంది ఈ ఆరోపణలకు మద్దతుగా మాట్లాడినట్లు కనిపించలేదు.
చంద్రబాబు నాయుకత్వంలోకి టీడీపీ వచ్చాక ఒక విధానం అలవాటు చేశారు. ఉన్నవిలేనివి ఆరోపణలు చేసి ప్రత్యర్థులపై బురద చల్లాలన్న విధానంతో ఆయన పనిచేశారు. అది కొన్నిసార్లు సెక్సస్ అయింది. చివరికి తన మామ అని కూడా చూడకుండా అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్.టీ.రామారావును సైతం ఈ విషయంలో వదలి పెట్టలేదంటే ఆశ్చర్యంకాదు. కానీ ఇప్పుడు ఆ రోజులు కావివి. సోషల్ మీడియా విస్తారంగా వచ్చింది. కేవలం ఒకటి, రెండు పత్రికలు రాస్తే వాటినే చదివేసి నమ్మివేయడం లేదు. ఇలాంటి తరుణంలో తెలుగుదేశం పార్టీ నిర్మాణాత్మకంగా వ్యవహరించడం అలవాటు చేసుకోవాలి.
ఒక పక్క వెయ్యి అంబులెన్స్ వాహనాలు చూసి ప్రజలంతా ఆశ్చర్యపోతుంటే చంద్రబాబు తన చోటా, మోటా నేతలతో తలా, తోక లేని ఆరోపణలు చేయిస్తే ప్రజలు నమ్ముతారనుకుంటే అది ఆయన భ్రమే అవుతుంది. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఆరోగ్యశ్రీ స్కీమ్‌ను తెచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ వ్యతిరేకించింది. దీనివల్ల కార్పొరేట్ ఆస్పత్రులకు మేలు జరుగుతుందని ఆ పార్టీ నాయకులు వాదించేవారు. కార్పొరేట్ ఆస్పత్రులకు కొంత ఉపయోగం జరిగితే జరిగి ఉండవచ్చు. కాని మొదటిసారిగా పేదవాడు కూడా కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించుకోవచ్చన్న భరోసాను ఆరోగ్యశ్రీ కల్పించిందంటే అతిశయోక్తి కాదు.
ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ ఆరోగ్యశ్రీ కన్నా మెరుగైన సేవలు అందించడానికి అనేక వ్యాధులను అందులో చేర్చారు. ప్రజలందరికి హెల్త్‌కార్డు ఇస్తానని జగన్ చెబుతున్నారు. అంతేకాదు కరోనా విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారో చూస్తున్నాం. తొమ్మిది లక్షల మందికి పరీక్షలు చేయించారు. అవి నిరంతరం కొనసాగుతున్నాయి. అయినా టీడీపీ వారు కాని, వారికి మద్దతు ఇచ్చే కొన్ని పత్రికలు కాని చాలా దారుణంగా వ్యవహరిస్తున్నాయి.
ఉదాహరణకు ఈనాడు పత్రిక హైదరాబాద్ ఎడిషన్‌లో కరోనా గురించి భయపడవద్దని, కరోనా వచ్చినా 92 శాతం మందికి తగ్గిపోతుందని బ్యానర్ కథనంగా ఇచ్చింది. అదే సమయంల ఏపీలో మాత్రం కృష్ణ, కర్నూలు జిల్లాలలో కరోనా కల్లోలం అంటూ ప్రజలను భయభ్రాంతులను చేసే యత్నం చేసింది. అంతేకాదు. తెలంగాణ ప్రభుత్వం కరోనా విషయంలో అనుసరిస్తున్న తీరుపై తెలంగాణ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేస్తే, అలాంటిదేమీ లేదన్నట్లుగా సాదాసీదా హెడింగ్తో ఆ పత్రిక సరిపెట్టింది. మంచిదే. కరోనా గురించి ఎవరిని భయపెట్టకూడదు. కాని ఏపీలో మాత్రం భయపడాలని వీరు కోరుకుంటున్నట్లుగా ఉంది.
ఈనాడు పత్రిక వారికి అయినా.. టీడీపీ వారికి అయినా జగన్‌పై కోసం ఉండవచ్చు. అధికారం తమ చేతిలో నుంచి పోయిందన్న బాధ ఉండవచ్చు. కాని దానిని ద్వేషంగా మార్చుకోరాదు. ఆ విద్వేషాన్ని ప్రజలపై చూపకూడదు. వాస్తవానికి హైదరాబాద్‌లో కరోనాకు సంబంధించి పరిస్థితి అంత బాగోలేదని కానివ్వండి, ఉపాధి దొరకడం లేదని కానివ్వండి.. చాలా మంది ఏపీతో సహా సొంత ప్రాంతాలకు వెళుతున్నారు. అంటే దీని అర్థం ఏపీ గురించి చంద్రబబు, ఈనాడు, మరికొన్ని పత్రికలు చెప్పేవాటిని ప్రజలు నమ్మడం లేదనేకదా..? ఆ విషయాన్ని వారు అర్థం చేసుకోవాలి.
కరోనా సమయంలో వలంటీర్ల వ్యవస్థ కాని, ఆశావర్కర్లు, ఎఎన్ ఎమ్.లు బాగా పనిచేస్తున్నారని అంతా చెబుతున్నారు. మెడికల్ షాపుకు వెళ్లి ఏదైనా దగ్గు మందు తీసుకుంటే, ఆ విషయం తెలుసుకుని వెంటనే వలంటీర్ పోన్ చేసి మీ ఇంటిలో ఎవరికైనా బాగోలేదా అని అడుగుతున్నారు. గతంలో ఎన్నడైనా ప్రభుత్వం ఇలా ప్రజల ఆరోగ్యం గురించి వాకబ్ చేసిందని చెప్పగలరా? అందువల్ల ప్రభుత్వం బాగా చేస్తున్నప్పుడు ఒక మంచి మాట చెప్పాలి. ఏదైనా తప్పు చేస్తే దానిని ఎత్తి చూపాలి. కాని గుడ్డి వ్యతిరేకతతో ఏ పార్టీ అయినా, ఏ మీడియా అయినా వ్యవహరిస్తే వారికి జరిగేది శంగభంగమే అని చెప్పక తప్పదు.
కొమ్మినేని శ్రీనివాసరావు