డేటింగ్లు, చాటింగ్‌లు…ఇప్పుడు ఏ దేశమైనా సర్వసాధారణమయ్యాయి. ఒకప్పుడు మోతాదుకు మించి సినిమాల్లో ముద్దూ ముచ్చట్ల సీన్స్ కనిపిస్తే…పాశ్చాత్య నాగరికత అంటూ గగ్గోలు పెట్టేవాళ్లు. ఇప్పుడు ప్రపంచీకరణ నేపథ్యంలో ఏదీ అసహజమనిపించడం లేదు. అంతా మామూలే అనే ధోరణి క్రమంగా పెరుగుతోంది.
అయితే డేటింగ్ల్లో ప్రముఖుల కథలు వేరు కదా? అందుకే మనం ఒకసారి అలా అమెరికా వెళ్లి ఓ ప్రముఖుడి కుమారుడి ప్రేమాయణం గురించి తెలుసుకుందాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెద్ద కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్. గుట్టుగా సాగుతున్న ఇతని ప్రేమ వ్యవహారాన్ని కరోనా రట్టు చేసింది. ఇతను కింబర్లీ గ్యుయల్ఫాయిల్ అనే యువతితో డేటింగ్లో ఉన్నాడు. యుక్త వయసు వచ్చాక ఇవన్నీ లేకపోతేనే ఆశ్చర్యపోవాలి.
ఇప్పుడు వీరి గురించి ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే…అంతా కరోనా మహత్యమే. ట్రంప్ జూనియర్ ప్రేయసి కరోనా బారిన పడింది. గతంలో ఈ సొగసరి ఫాక్స్ టెలివిజన్ యాంకర్‌గా పని చేసేది.
అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆమె అధ్యక్షుడు ట్రంప్ ప్రసంగం వినేందుకు దక్షిణ డకోటా రాష్ట్రానికి వెళ్లింది. ట్రంప్‌ను కలిసే వారందరికీ నిబంధనల ప్రకారం వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో కింబర్లీకి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. వెంటనే ఆమె ఐసోలేషన్‌కు వెళ్లారు.
అయితే ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగానే ఉన్నారని, కరోనా లక్షణాలేవీ కనిపించడం లేదని అధికారులు తెలిపారు. మరోసారి కరోనా నిర్ధారణ పరీక్ష చేసి కరోనాపై స్పష్టత ఇస్తామన్నారు. మొత్తానికి కరోనా పుణ్యమా అని ట్రంప్ పెద్ద కుమారుడి గర్ల్ ఫ్రెండ్ గురించి కూడా తెలిసొచ్చింది. ఆమె ట్రంప్ పెద్దకుమారుడి గర్ల్ ఫ్రెండ్ కాకపోయి ఉంటే…అసలు వార్తల్లో వ్యక్తిగా నిలిచేవారే కాదు.