పోలవరం పనులు, కాంట్రాక్టుల్లో భారీగా అవినీతి జరిగిందనే నమ్మకంతో జగన్మోహన రెడ్డి సర్కారు ప్రధానడ్యామ్ పనులు, జలవిద్యుత్ కేంద్రం పనుల కాంట్రాక్టులను రద్దు చేసేసింది. ఈలోగా వరదలు కూడా వచ్చాయి. పనులల్లో ఎలాంటి జాప్యం లేకుండా నవంబరు ఒకటో తేదీనుంచి తిరిగి ప్రారంభించే ఉద్దేశంతో.. జగన్మోహన రెడ్డి సత్వరమే రీటెండర్లు పిలవడానికి కూడా ఆదేశించారు. వీటికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల అయ్యేలోగానే.. నవయుగ సంస్థ హైకోర్టుకు వెళ్లి.. కాంట్రాక్టు రద్దు ఉత్తర్వులపై సస్పెన్షన్ విధించేలా చేసింది. దీనిపై జెన్ కో మళ్లీ అప్పీలు చేయడంతో.. హైకోర్టులో కేసు నడుస్తోంది. బుధవారం దీనికి సంబంధించి విచారణ జరిగే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మాత్రం చాలా నిమ్మళంగానే ఉన్నట్లుగా తెలుస్తోంది. పోలవరం అవినీతి టెండర్ల విషయంలో ఎలాంటి రాజీపడకుండా, రద్దు నిర్ణయానికే కట్టుబడి ఉండాలని జగన్ సర్కారు భావిస్తున్నట్లు సమాచారం. విద్యుత్కేంద్రం విషయంలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ.. ప్రభుత్వం కంగారు పడలేదు. నవయుగను తప్పించడానికి సాధికారికమైన వాదన తమ వద్ద ఉన్నదనే ఉద్దేశంతోనే ఉంది.
రీటెండర్ల ప్రక్రియను కూడా ఆపు చేయాల్సిందిగా హైకోర్టు తన మధ్యంతర ఉత్తర్వుల్లో ఆదేశించిన నేపథ్యంలో.. ఇప్పటిదాకా టెండరు నోటిఫికేషన్ ను ఆన్‌లైన్ లో అప్‌డేట్ చేయకుండా ప్రభుత్వం మిన్నకుంది. దీనికి సంబంధించి సంబంధిత అధికారులు, సాంకేతిక కారణావల్ల టెండరు అప్లోడ్ చేయలేదని, నాలుగోతేదీ తర్వాత అప్లోడ్ చేస్తామని చెబుతున్నారు. నాలుగోతేదీనే హైకోర్టులో కేసు విచారణ ఉండడం గమనార్హం. మధ్యంతర ఉత్తర్వులు రద్దవుతాయనే ఆశాభావంతో జగన్ సర్కారు ముందుకు సాగుతోంది.
టెండర్లను అప్లోడ్ చేసిన తర్వాత.. బిడ్లు దాఖలు చేయడానికి మూడు వారాల సమయం ఉంటుంది. అయితే ప్రభుత్వం విద్యత్కేంద్రం భాగానికి సంబంధించిన టెండర్లను పక్కన పెట్టి.. ప్రధాన డ్యామ్ పనులకు టెండర్లను అప్‌లోడ్ చేయడానికి అవకాశం ఉంది. అయితే ప్రభుత్వం తొందరపడడం లేదు. రెండింటికీ కలిపి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు.. నాలుగోతేదీ గడిస్తే.. రెండింటికీ కలిసి ఒకేసారి టెండర్లు అప్‌లోడ్ చేయడమే బాగుంటుందనే భావనతో ఉన్నట్లుగా తెలుస్తోంది.